ఉత్తరాయణం

ఆకాశంలో సరకుల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యావసర సరకుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. రాకెట్లకంటే స్పీడుగా అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ధరలను చూసి సామాన్యుడు ఆందోళనతో తల్లడిల్లిపోతున్నాడు. గత ఆరు నెలల కాలంలో ఉద్యోగస్తుల, పెన్షనర్ల జీతాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగక పోయినప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం రెండింతలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా వ్యాపారులు మాత్రం సరకుల ధరలను తగ్గించకపోవడం గమనార్హం. సామాన్యులకు ప్రస్తుత తరుణంలో జీవనం దినదిన గండంగా మారింది. ఎన్నికల ముందు ఒక రెండు నెలలపాటు ధరలు నిలకడగావున్నా ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరలను అమాంతం వ్యాపారులు పెంచి విపరీతమైన లాభాలను గడిస్తున్నారు. మరోవైపు ఎంత డబ్బు వెచ్చించినా నాణ్యమైన సరకులు దొరకడం గగనమైపోయింది. అన్నింటిలో కల్తీ యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. పెరుగుతున్న ధరలు సామాన్యుల పాలిట శాపంగా పరిణమించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పేద, మధ్యతరగతి వారు బతకడం దుర్భరవౌతుంది. సామాజిక అసమానతలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి రోజూ అక్రమంగా బియ్యం వంటి నిత్యావసర సరుకుల అక్రమ రవాణాకు సంబంధించి అనేక వార్తలు వెలువడుతున్నా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం శోచనీయం. నల్లబజారులో వందల టన్నుల కొద్దీ బియ్యం, గోధుమలు, జొన్న వంటి ఆహార ధాన్యాలు విజిలెన్స్ తనిఖీల్లో పట్టుబడుతున్నా, పౌర సరఫరా అధికారులు వారిపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తుండడంతో నల్లవ్యాపారుల ఆగడాలకు అంతే లేకుండాపోతోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే నడుం బిగించాలి. నిత్యావసర వస్తువుల ధరలు ఒక పరిమితికి మించకుండా సీలింగ్ విధించడం, నల్లబజారులోకి సరకులను తరలించి, అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు యుద్ధప్రతిపదికపై చర్యలు చేపట్టాలి.
- సిహెచ్. సాయి ఋత్త్విక్, నల్గొండ
‘ఆయుష్మాన్ భవ’ భేష్
దేశంలోని పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించే బృహత్తర ఆరోగ్య పరిరక్షణ పథకం ‘ఆయుష్మాన్ భవ’కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయం. తొలి విడతలో పది కోట్ల మందికి వర్తించే ఈ పథకంలో భాగంగా అవసరమైన వైద్య సిబ్బంది, సదుపాయాలను అందుబాటులోనికి తేవడం దేశ వైద్యచరిత్రలోనే అపూర్వం. ఒక్కొక్క కుటుంబానికి అయిదు లక్షలమేర ఆరోగ్య బీమా కల్పిస్తూ వచ్చే నాలుగేళ్ళలో యాభై కోట్ల మందికి వర్తింపజేసే ఈ పథకం పూర్తిగా కేంద్ర నిధులతోనే సాగనున్నందున, పేద ప్రజలకు బీమా ప్రీమియం నుండి పూర్తి మినహాయింపు ఇస్తున్నందున, ప్రపంచంలోనే అతిపెద్ద బీమాగా చరిత్ర సృష్టింనుండడం భారతీయులందరికీ గర్వకారణం. ఇంతటి అద్భుతమైన పథకానికి రూపకల్పన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాలు, దార్సనికత, ప్రజాసంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధిని మెచ్చదగినవి. ఈ భారీ ప్రజారోగ్య పథకం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశాలు ఏర్పడడంతోపాటు, వారి నైపుణ్యాలను పెంపొందించేందుకూ వీలుకలుగుతుంది. ఈ పథకం ద్వారా సార్వత్రిక ఆరోగ్య భద్రతా వ్యయపరిమితి బాగా తగ్గిపోతుంది. ఇంతటి భారీ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు విజయవంతంగా చేయాలంటే ఎంతో పకడ్బందీ కార్యాచరణ అవసరం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకాలతో రోగులకు అవసరం లేని శస్త్ర చికిత్సలు చేస్తూ కార్పొరేట్ ఆసుపత్రులే ఎక్కువగా బాగుపడ్డాయి. ఆయుష్మాన్ భవ పథకం ద్వారా ప్రైవేట్ వైద్యరంగాన్ని ప్రోత్సాహం అందించే బదులు ప్రభుత్వ వైద్యరంగానికి జవసత్వాలు కల్పించాలి. అల్పాదాయవర్గాలకు మాత్రమే పరిమితమైన సార్వజనీన ప్రజారోగ్య సంరక్షణ పథకాన్ని పిల్లలూ, స్ర్తిలు, సీనియర్ సిటిజన్లకు వర్తించేలా విస్తృతం చేయాలి. అవినీతిని నిలువరించేందుకు జన్‌లోక్‌పాల్ పద్ధతిలో నియంత్రణ వ్యవస్థను ఏర్పరచేందుకు అవసరమైన చట్టాలను కేంద్రం రూపొందించాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
జోరుగా మద్యం విక్రయాలు
మద్యం దుకాణాలకు హద్దూపద్దూ లేకుండాపోతుంది. నగరాల నడిబొడ్డున, పాఠశాలల సమీపంలో ఎక్కడపడితే అక్కడ ఎడాపెడా మద్యం దుకాణాలను ఏర్పాటుచేశారు. ప్రధాన రహదారుల వెంబడి కూడా లెక్కలేనన్ని మద్యం దుకాణాలను తెరిచారు. చెడుసావాసాలను మరిగి, పెద్దల అదుపాజ్ఞలలో లేని విద్యార్థులు సైతం విరామ సమయంలో మద్యం సేవిస్తున్నారు. నగరాలలో నిత్యం ఎంతోమంది మద్యం సేవించి ఇతరులతో ఘర్షణలకు దిగుతున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతూ ప్రమాదాలను జరిపి, అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. నగరాలలోని కూడళ్లలో, రహదారులపై మద్యం దుకాణాలను వేరే చోటకు తరలించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
మనకు ఒరిగేదేమిటి?
ఐఐటీ-జీ, నీట్, సివిల్స్ లాంటి పోటీపరీక్షల్లో మన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తే ‘తెలుగు తేజాల కీర్తికేతనాలు’ అంటూ ఫొటోలు, ఇంటర్వ్యూలను పత్రికల్లో, టీవీల్లో హోరెత్తించి నానా హంగామా చేయడం పరిపాటిగా మారింది. నిజానికి ఈ భారీ ప్రచారంతో సంబంధిత కోచింగ్ సెంటర్లకు మాత్రమే ఆర్థికంగా మేలు జరుగుతుంది. కాని ఘనమైన ర్యాంకులు సాధించిన వారి వల్ల రాష్ట్రానికి, జన సామాన్యానికి పెద్దగా ప్రయోజనం ఉండదు. మంచి ర్యాంకులు సాధించిన వారు ఉద్యోగాల పేరిట అమెరికా లేదా ఇతర సంపన్న దేశాల సేవలో తరించేందుకు తరలిపోతారు. మిగిలినవారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులను ఆదరిస్తారో లేదో గాని, తాము మాత్రం హాయిగా ఉంటారు. వారు తమ సంపాదన నుంచి కొంత శాతాన్ని అనాథలకు, వరద బాధితులకు విరాళంగా ఇస్తే బాగుంటుంది. కాని మనవారిలో ఇలాంటి సేవాభావమే ఉండదు. ర్యాంకులు సాధించిన వారితో కార్పొరేట్ కాలేజీలకే లాభం తప్ప - మిగతావారు సంతోష పడాల్సిన అవసరం ఏముంది?
- శాంతిచంద్రిక, సామర్లకోట