ఉత్తరాయణం

మోడల్ స్కూల్స్‌పై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ స్కూల్స్ నిర్వహణపై ప్రభుత్వం అధికారికంగా కమిటీ వేసి 8 నెలలు పూర్తవుతోంది. అయినప్పటికీ మోడల్ స్కూల్స్‌పై ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం వైపునుండి రాలేదు. ఈ పాఠశాలల సమస్య ఇప్పటిది కాదు. 2015లోనే కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు మోడల్ స్కూల్స్ ప్రాజెక్టును రాష్ట్రాలకు బదలాయింపు చేస్తున్నామనే ప్రకటన జారీచేసింది. ఆ ప్రకటనకు అనుగుణంగా కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు వీటి నిర్వహణపై ఒక లేఖను విడుదల చేస్తూ ఇకపై కేంద్రం మోడల్ స్కూల్స్‌పై తమ బాధ్యతనుండి వైదొలగి రాష్ట్రాలకు అప్పగించదని సారాంశం. ఏది ఏమైనా మోడల్ పాఠశాలలను అటు కేంద్రం, ఇటు రాష్ట్రం గాలికి వదిలేసి తమ బాధ్యతను విస్మరించాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు)పై ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించవలసిన అవసరం ఉంది. వచ్చే శాసనసభ సమావేశాలలో అయినా పాలక, ప్రతిపక్షాలు మోడల్ స్కూల్స్‌పై విధాన నిర్ణయం వచ్చేటట్లు ఈ సమస్యను ప్రస్తావించి ఒక పరిష్కార మార్గం చూపాలి. శ్రీకాకుళంలో ఇటీవల జరిగిన రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోడల్ స్కూల్స్ అభివృద్ధిపై దృష్టిపెడుతున్నామని ప్రకటించడం హర్షణీయం. అయితే, ప్రభుత్వం ఈ వ్యవస్థపై, ఉపాధ్యాయుల సర్వీసు అంశాలపై త్వరితగతిన నిర్ణయం ప్రకటించడంలో ఆలస్యం చేయడం సరికాదు.
-బి.సురేష్, శ్రీకాకుళం

తెలుగుభాషకు గ్రహణం
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉనికిని, గుర్తింపును తెచ్చిన కన్నతల్లి వంటి మాతృభాష నేడు నిరాదరణకు గురవుతోంది. మాతృభాషను కాపాడవలసిన తెలుగుబిడ్డలు పరాయి భాషల మోజులో పడడం అత్యంత దురదృష్టకరం. ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాషగా, ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా ప్రఖ్యాతి పొందిన తెలుగు భాష మనవారికే రుచించక పోవడం విడ్డూరం. మాతృభాషలను ప్రేమించడం ఎలాగో మన పొరుగు రాష్ట్రాలవారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, వృత్తికి సంబంధించిన విషయాలను పక్కనపెడితే, మిగతా వ్యవహారాలన్నీ తమ మాతృభాషలోనే జరుపుతారు. 12వ తరగతి వరకు మాతృభాషకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మాతృభాషలో చదువుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత ప్రత్యేక వెసులుబాటు వుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మాతృభాష ఒక అంశంగా వుంటుంది. మాట తీరు, కట్టుబొట్టూ అన్నీ వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. వారితో పోల్చుకుంటే మన భాషాభిమానం ఏపాటిదో ప్రతీ తెలుగువారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. తెలుగేతర ప్రాంత పాలకులైన అక్బర్ పాదుషా తెలుగు పట్ల ఆసక్తి చూపటం, కన్నడ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అని ప్రశంసించడం తెలుగు గొప్పదనాన్ని సూచిస్తోంది. విదేశీ పాలకులైన బ్రిటీష్‌వారు సైతం తెలుగును ప్రోత్సహించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు త్యాగ నిరతితోనే దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు వారి మాతృభాషలను అభివృద్ధిచేసుకోగా, తెలుగు రాష్ట్రాలు మాత్రం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నాయి. మొక్కుబడిగా ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు భాషా దినోత్సవాలు జరపడమే తప్ప తెలుగు భాషా పరిరక్షణకు చిత్తశుద్ధితో చేసిన కృషి శూన్యం. ఒక భాషను నిర్లక్ష్యం చేయడం అంటే ఒక సంస్కృతిని, ఒక సంప్రదాయాన్ని, ఒక జీవన శైలిని నిర్లక్ష్యం చేయడమే. మాతృభాషకు ద్రోహం చెయ్యడం అంటే ఆ భాషను మాట్లాడుతున్న కోట్లాది మంది మనోభావాలకు, భావోద్వేగాలకు, అభివృద్ధికి ద్రోహం చేసినట్లే. తెలుగుభాష పరిరక్షణ కోసం ప్రతి తెలుగువాడూ గిడుగు రామమూర్తిలా నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది.
-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం

ఇంత అత్యుత్సాహమేల?
‘చట్టానికి కళ్లు ఉండరాదంటే’ అందరి పట్లా సమదృష్టి ఉండాలని అర్థం. అయితే, చట్టాన్ని అమలుచేసే వారిలో ఆ సమదృష్టి లేకపోతే సమాజానికి తీరని నష్టం. పైగా అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రమాదకరమైన ధోరణి. దేశవ్యాప్తంగా ఐదుగురు పౌర హక్కుల నేతలను తాజాగా అరెస్టు చేయడం సంచలనం కలిగించింది. వారిని అరెస్టు చేయడంలో నిబంధనల్ని పాటించలేదంటూ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. అంటే ఆ నేతల హక్కులకే దిక్కులేకుండా పోయిందన్న మాట. పాలక వర్గాలకు విభిన్న భావజాలం కలిగినందున వారికి సంబంధించి నిబంధనల్ని పాటించడం, పాటించకపోవడం అన్నది అధికారులకు ‘అంతగా పట్టించుకోవాల్సిన’ విషయం కాలేదన్న మాట. ఈ తరహా ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకి శోభనిస్తుందా? ఈ ఉదంతం గురించి వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు ‘అసమ్మతి అన్నది సేఫ్టీవాల్వ్ లాంటిది. అది లేకపోతే సమాజం ప్రెజర్ కుక్కర్‌లా పేలిపోతుంది’- అంటూ ప్రభుత్వానికి మంచిమాట చెప్పింది. అరెస్టయిన నేతలంతా కోరేగామ్ అల్లర్లను ప్రేరేపించారన్నది ఆరోపణ. ఆ అల్లర్లలో ప్రత్యక్ష పాత్ర వహించిన ఒక వర్గం వారిపై ఏ చర్యలూ లేవని, ఆ దరిదాపుల్లో లేని పౌర హక్కుల నేతలపై అత్యుత్సాహపు చర్యలు తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా దేశ ప్రధానిని హతమార్చేందుకు కుట్ర పన్నిన నిషేధిత మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరిస్తున్నట్టు ఉత్తరం దొరికిందన్నది మహారాష్ట్ర పోలీసుల ఆరోపణ. అది తీవ్రమైనదే. ప్రధానికే కాదు సామాన్య పౌరునికి ఆ రకమైన అపాయం ఉన్నా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. అయితే ఆ తరహా ఉత్తరాలు, మెసేజ్‌ల్లో విశ్వసనీయత ఎంత అన్నది? ముందు నిర్ధారణ చేసుకోవాలి. నకిలీ వార్తల యుగంలో మరీ కచ్చితంగా పాటించాల్సిన నియమమిది. భావజాలాలకు అతీతంగా చట్టం అమలులో స్థిరత్వం, న్యాయం ఉండాలి.
- డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం

భీతిగొల్పుతున్న ప్రమాదాలు
ఇటీవలి కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలలో సామాన్యులతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు దుర్మరణం పాలవుతున్న దుర్ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా అనె్నపర్తి వద్ద మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతి చెందడం ప్రజలందరినీ నిర్ఘాంతపరచింది. జాతీయ రహదారులు తరచూ నెత్తురోడుతూ ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నాయి. దీంతో ప్రజలకు జాతీయ రహదారులపై భద్రత ఎండమావిగా మారింది. అతివేగం, నిద్రలేమి, అలసట, మద్యపానం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధ్వాన రహదారులు, సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం, వాహన చోదకుల తప్పిదాల వల్ల రహదార్లపై రక్తపుటేర్లు పారుతున్నాయి. రోడ్డుప్రమాదాల నివారణతోపాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రమాదాలు జరిగినపుడు మాత్రం హడావుడి చేస్తున్న ప్రభుత్వాలు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. చాలా ప్రభుత్వ విభాగాలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలి.
-బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూరు.