ఉత్తరాయణం

వృద్ధులకు సరిపోని పెన్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో వృద్ధులు, నిరుద్యోగులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు ఆసరా అందించాలని రాజ్యాంలోని 41వ అధికరణలో పొందుపరచబడింది. అయితే, ఈ అధికరణ అమలులోనికి వచ్చేందుకు దాదాపుగా 48 సంవత్సరాలు పట్టింది. 1995 నుండి వృద్ధులకు పింఛను అరకొరగా ఇస్తున్నందున వారి కనీస అవసరాలు తీరడం లేదు. పింఛను పథకం ద్వారా ఆయా రాష్ట్రాలలో లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వాలే గుర్తించి పింఛను మంజూరు చేయాల్సి వుండగా, అందుకు అయ్యే ఖర్చులో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. అయితే రాష్ట్రాలకు అయ్యే ఖర్చులో కేంద్రం భరించే వాటా కేవలం ప్రతిమనిషికి ప్రతినెలకు రెండు వందలు మాత్రమే. మిగతా ఖర్చు అంతా రాష్ట్రాలే భరించాల్సి వస్తుంది. పింఛను సౌకర్యం వున్న ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి మెరుగ్గా వున్నా, పదవీ విరమణ అనంతరం పింఛను సౌకర్యం లేనివారు, గ్రామీణులు, అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వం ఇచ్చే పింఛనులపైనే ఆధారపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కుబడి తీర్చుకునే విధంగా ఏళ్ళ తరబడి సవాలక్ష ఆంక్షలతో ఇచ్చే అరకొర ఆర్థిక సహాయం బడుగు జీవులపట్ల వారి ఉదాసీన వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో వృద్ధాప్య పింఛను పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి పదివేల ఎనిమిది వంద కోట్లు ప్రతి ఏటా ఖర్చుపెడుతున్నా, అందులో కేంద్రం తన వంతు వాటగా 550 కోట్లు మాత్రమే విదిలిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2001 జనాభా లెక్కల ఆధారంగా రూపొందిన సూత్రాలను ఆధారంగా తీసుకొని రాష్ట్రాలకు నిధులు కేటాయించడం వలన చాలామంది దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారికి ఆర్థిక సాయం ఎండమావిగా తయారైంది. వయసు పైబడిన వారు కనీస అవసరాలు తీర్చుకునేందుకు ధనార్జన చేయలేని స్థితిలో ఉంటూ తమ కుటుంబాల నిరాదరణకు గురై ఎంతోమంది మధ్యలో తనువు చాలిస్తున్నారు. 2013లో ఈ పథకం అమలుపై వేసిన టాస్క్ఫోర్స్ కమిటీ లబ్ధిదారుల గుర్తింపులోనూ, సాయం పరిమాణంలోనూ ద్రవ్యోల్బణం ఆధారంగా కేంద్రం పింఛనులు మంజూరు చెయ్యాలని స్పష్టం చేసినా కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటివరకూ, నిర్లిప్త ధోరణిలో, ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేవు. ఇప్పటికైనా రాష్ట్రాలు చేస్తున్న వ్యయంలో కేంద్రం వాటా పెరిగితే రాష్ట్రప్రభుత్వాలు వద్ధులకు మరింత మెరుగైన సాయం అందించగలుగుతాయి.
-ఎం.కనకదుర్గ, తెనాలి
విషజ్వరాలతో విలవిల
విజయనగరం జిల్లాలో ప్రస్తుతం విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. ఫలితంగా వారం వారం పదులకొద్దీ ప్రాణాలు గాలిలో కలుస్తుండగా, వందలాదిమంది మంచం పట్టారు. సాలూరు మండలంలోని కరాసువలస కుగ్రామంలో రెండు వారాల్లో తొమ్మిదిమంది అనారోగ్యంతో మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జ్వరాల్ని అదుపు చెయ్యడంలో విఫలమైన ఆరోగ్య శాఖ సదరు మరణాలకు కారణం డెంగీ కాదని, మలేరియా కాదని బుకాయిస్తోంది. సరైన ఆధారాలు లేకుండా డెంగీ అని తీర్మానిస్తూ వార్తలు రాస్తే తగు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించడం మరీ విడ్డూరం. వైద్య పరీక్షలు జరపకుండానే అవి డెంగీ కేసులు కావని మాత్రం వారెలా తీర్మానించగలరు? ముందు బుర్రపెట్టాల్సింది ఇంత అధిక స్థాయిలో మరణాలు ఎందుకు జరుగుతున్నాయని. అంటువ్యాధుల తరహాలో విషజ్వరాలు పెల్లుబికినపుడు ఎలా ఎదుర్కోవాలన్న ధ్యాస లేకపోవడం దారుణం. ఏటా ఇది చర్విత చరణం కావడం సరికాదు. వర్షాకాలం రావడానికి ముందుగానే రానున్న ఉపద్రవం గురించి మీడియా, పౌరసమాజం ఎలర్ట్ చేశాయి. అన్ని శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని లేదంటే ముప్పు తప్పదని సూచించినా ఫలితం లేదు. పరిస్థితికి తగ్గ స్పందన కూడా లేదు. దోమల నివారణకు గానీ, పారిశుద్ధ్య నిర్వహణ గానీ, వైద్య సేవలు, వైద్య శిబిరాల ఏర్పాటుగానీ, జ్వర పీడితులకు సత్వర చికిత్సలు గానీ ఏవీ అనుకున్న స్థాయిలో జరపలేదు. పరిస్థితి చెయ్యి దాటిన తర్వాత హడావుడి చేస్తున్నారు. మన్యం, మైదానం తేడా లేకుండా జిల్లా అంతటా విషజ్వరాలే. ఇదీ ఆందోళన కలిగించే ఆరోగ్యస్థితి. ప్రభుత్వం ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. మరిన్ని ప్రాణాలు కోల్పోకుండా చూడాలి.
-డా డీవీజీ శంకరరావు, పార్వతీపురం
నైతిక విలువల ధ్యాస లేదు
విద్యార్థుల్లో విజ్ఞానమనే జ్యోతిని వెలిగించేవారే గురువులు. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువులదే. ఒకప్పుడు విద్యాబోధనలో నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. గురువులను దైవ సమానులుగా పూజించేవారు. రానురానూ నైతిక విలువల బోధనకు ప్రాధాన్యత తగ్గుతోంది. మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆటపాటలు, నైతిక విలువలకు స్థానం లేకుండాపోతోంది. మారుతున్న సమాజ పరిస్థితుల దృష్ట్యా నైతిక విలువల ఆవశ్యకత ఎంతో ఉంది. తల్లిదండ్రుల ప్రభావమో, పరిసరాల ప్రభావమో, టీవీ, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల ప్రభావమో గానీ విద్యార్థులలో దురాలోచనలు, దురలవాట్లు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో ఇంట్లో తల్లిదండ్రులు, విద్యాలయాలలో గురువులు విద్యార్థులకు నైతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రతి తరగతిలోనూ నీతి పద్యాలను ప్రవేశపెట్టి విద్యార్థులలో మంచి మార్పును తీసుకురావాలి. ప్రతి భాషోధ్యాయుడూ విధిగా విద్యార్థులకు కథలు చెప్పడం, వారిచేత చెప్పించడం లక్ష్యంగా పెట్టుకోవాలి. నీతికథల పుస్తకాలను చదివించాలి. నీతి కథలను రాయించాలి. విద్యార్థులకు నైతిక విలువలను నేర్పేవారే ఉత్తమ ఉపాధ్యాయులు. టీచర్లు సన్మార్గంలో నడుస్తూ, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం