ఉత్తరాయణం

తెలుగు భాషకు గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ఉనికిని గుర్తింపును తెచ్చిన కన్నతల్లి వంటి మన మాతృభాష, పోషణ, ఆదరణ కరువై చిక్కిశల్యమై మంచాన పడింది. కన్నతల్లి ఆలనా పాలనా చూడాల్సిన తెలుగు బిడ్డలు పరాయి భాషల మోజులో పడి విలువలను మరచి, పెంపుడు తల్లి పంచన చేరడం అత్యంత దురదృష్టకరం. దేశ భాషలోనే కాకుండా ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాషగా, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన తెలుగు భాష మన వారికే రుచి కాకుండా పోయింది. మాతృభాషలను ప్రేమించడం అంటే మన పొరుగురాష్ట్రాల వారిని చూసి నేర్చుకోవల్సింది ఎంతైనా వుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, వృత్తికి సంబంధించిన విషయాలను పక్కన పెడితే, మిగతా వ్యవహారాలన్నీ తమ మాతృభాషలోనే జరుపుతారు. 12వ తరగతి వరకు అక్కడ మాతృభాషకు ఒక ప్రత్యేక స్థానం వుంది. మాతృభాషలో చదువుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత ప్రత్యేక వెసులుబాటు వుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలలో వారి మాతృభాష ఒక అంశంగా వుంటుంది. వారి మాటతీరు, కట్టూబొట్టూ అన్నీ వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. వారితో పోల్చుకుంటే మన భాషాభిమానం ఏపాటిదో ప్రతీ తెలుగువారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. తెలుగేతర ప్రాంత పాలకులైన అక్బర్ పాదుషా తెలుగు పట్ల ఆసక్తి చూపటం, కన్నడ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగులెస్స’ అని ప్రశంసించడం తెలుగు గొప్పదనాన్ని సూచిస్తుంది. చివరకు విదేశీ పాలకులైన బ్రిటీష్‌వారు సైతం తెలుగును ప్రోత్సహించారు. రాష్ట్రానికి ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు త్యాగ నిరతితోనే దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునః విభజన జరిగింది. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు తమ మాతృభాషలను అభివృద్ధిచేసుకోగా తెలుగు రాష్ట్రాలు మాత్రం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నాయి. మొక్కుబడిగా ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు భాషా దినోత్సవాలు జరపడమే తప్ప తెలుగు భాషా పరిరక్షణకు చిత్తశుద్ధితో చేసిన కృషి శూన్యం. ఒక భాషను నిర్లక్ష్యం చేయడం అంటే ఒక సంస్కృతిని, ఒక సంప్రదాయాన్ని, ఒక జీవన శైలిని నిర్లక్ష్యం చేయడమే. మాతృభాషకు ద్రోహం చెయ్యడం అంటే ఆ భాషను మాట్లాడుతున్న కోట్లాది మంది మనోభావాలకు, భావోద్వేగాలకు, అభివృద్ధికి ద్రోహం చేసినట్లే... తెలుగు భాషా పరిరక్షణకోసం ప్రతీ తెలుగువాడు ఒక గిడుగు వారిలా నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమయ్యింది.

--సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం