ఉత్తరాయణం

దిగజారిన సీబీఐ ప్రతిష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థగా పేరుగాంచిన సీబీఐ విశ్వసనీయత గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అట్టడుగుకి చేరినట్టే. మరీ వేలెత్తి చూపలేని విధంగా ఆ సంస్థ పనితీరు ఎప్పుడూ లేదు. కానీ కాస్త పరువుమాత్రం ఉండేది. రాష్ట్రాల్లో పోలీసులు ఛేదించలేని కేసుల్లో అంతా సీబీఐ వైపు చూసేవారు. అయితే, కేంద్రంలో అధికార పక్షం ఇష్టాయిష్టాల ప్రకారం వేగం, దిశ మార్చే విషయాలు నమోదు చేస్తున్న ఆ సంస్థపై ప్రజల్లో ఇన్నాళ్లూ ఉన్న కాస్తోకూస్తో గౌరవం కూడా పోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సీబీఐలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నవారు ఒకరిపై ఒకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకోవడమే కాకుండా, వాటికి రుజువులు కూడా చూపిస్తున్నారు. అది కేవలం అంతర్గత ఆధిపత్యపోరు కాదు. తీవ్రస్థాయి అవినీతికి సంబంధించినది. మిగతా వ్యవస్థలతో ముఖ్యంగా రాజకీయ వ్యవస్థతో ముడిపడి ఉన్న అవినీతికి సంబంధించినది. ఆ సంస్థ పాలన, విధి నిర్వహణ పద్ధతుల్లో ఉన్న లొసుగుల వల్ల ముదిరి, ఇప్పుడు బయటపడ్డ క్యాన్సర్ లక్షణంలా ఉంది. ఇక జరగాల్సింది ఆ అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు. ఆ తరువాత జరగాల్సింది సంస్థలోని లోపాల్ని శాశ్వతంగా సరిదిద్దే ఏర్పాటు. కానీ, మోదీ ప్రభుత్వం ఈ రెండు పనుల్నీ మానివేసి వెంటనే చేసింది మాత్రం ఆ సంస్థకున్న గౌరవాన్ని అర్ధరాత్రి జప్తు చెయ్యడం. తప్పు జరిగిందన్న వంకతో సీబీఐ డైరెక్టర్నీ, ప్రత్యేక డైరెక్టర్నీ అర్ధరాత్రి విధుల నుంచి తొలగించడమే కాకుండా, పదుల సంఖ్యలో అధికారులకు స్థానభ్రంశం చేసింది. ఈ చర్య పూర్తిగా ఏకపక్షం. సీబీఐ డైరెక్టర్‌ను తొలగించాలంటే ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత కలిసి నిర్ణయం చెయ్యాల్సి ఉంటుంది. ఆ నిబంధనను అతిక్రమించాల్సిన అత్యవసర స్థితి ఏముందిక్కడ? ఇలా అర్ధరాత్రి హడావుడి పడడం ఆ సంస్థపై విశ్వసనీయత పెంచడానికట! ఇది- తప్పు తేలకుండానే తీర్పు ఒకవైపు ఇచ్చేసినట్టుకాదా? కళ్లెదుట ఉన్న అవినీతి వ్యవహారంపై సరైన దర్యాప్తు జరిపించడంతోపాటు, అవినీతికి ఆస్కారమిస్తున్న అన్ని ద్వారాల్ని మూసేసే చర్యలు చేపట్టాలి. రాజకీయ జోక్యం లేని స్వతంత్రత, పనితీరులో పారదర్శకత ఆ సంస్థలో నెలకొల్పాలి. సరైన వ్యవస్థగా తీర్చిదిద్దాలే గానీ- పనిలో ప్రపంచస్థాయి వాసి కనపర్చగలిగే సంస్థ సీబీఐ. ఆ దిశగా చర్యలు తీసుకోవడం వల్లనే విశ్వసనీయత పెరుగుతుంది. ప్రక్షాళనలో పక్షపాతం కనబడితే ఎలాంటి ఫలితం ఉండదు.
- డా.డి.వి.జి.శంకరరావు, విజయనగరం

అవినీతి అధికారులకు అందలాలు!
గతంలో ప్రభుత్వ పెద్దలు నిజాయితీపరులైన ఉద్యోగులను ప్రోత్సహించేవారు. కాలక్రమంలో ప్రభుత్వోద్యోగాల్లో పనిచేసినా, చేయకపోయినా ఒకటేనన్న అభిప్రాయం ఏర్పడింది. నేడు ఆ దశ దాటి, నిజాయితీపరులను పక్కనబెట్టి పైరవీలు చేసే అవినీతిపరులైన ఉద్యోగులను అందలం ఎక్కించే దుస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో కోట్లాది రూపాయల అక్రమార్జన కేసుల్లో అరెస్టు కాబడి, సస్పెండయిన అధికారులపై కేసులు నత్తనడకగా సాగటం, రెండు సంవత్సరాల్లోగా కేసులు పరిష్కారం కాలేదన్న సాంకేతిక కారణంతో తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవటం, కొన్నిసార్లు ప్రమోషన్లు కూడా ఇవ్వటం జరుగుతోంది. నిజాయితీపరులైన ఉద్యోగులకు అంతగా ప్రాధాన్యత లేని పోస్టింగులు ఇస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ పట్టుకున్నప్పుడు రెండురోజులు హడావుడి, ఆ వార్త పాతబడిపోగానే, ఏదోలా విధుల్లో చేరడం ఆనవాయితీగా మారింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు అన్న సామెతలా, పాలక పెద్దలే అవినీతికి అలవాటు పడితే చిరుద్యోగులను ఎలా నియంత్రిస్తారు? జీతాలు ఆకర్షణీయంగా పెంచినా అవినీతి తగ్గకపోవడం ‘మామూలు’ వ్యవహారమైంది. గతంలో సాక్ష్యాల సేకరణలో కాలయాపన కారణంగా కేసులు కోర్టుల్లో వాయిదాలు పడేవి. నేడు ఐటీ యుగంలో అవినీతిపరులు, అక్రమార్కులు ఆడియో- వీడియో రికార్డింగ్‌ల సాక్షిగా ఏసీబీకి దొరికిపోతుంటే ఏళ్లు గడిచినా శిక్షలు పడకపోవడం న్యాయానికి అన్యాయం చేసినట్లే. ఇకనైనా ఇలాంటి కేసులను నిర్ణీత సమయంలో పూర్తిచేసి, బిహార్‌లోవలే అక్రమాస్తులు తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అవినీతి కేసులను శీఘ్రమే పరిష్కరిస్తే అక్రమార్కుల ఆటకట్టించవచ్చు. అలాంటి వారికి ఉద్యోగ భద్రత ఎక్కువైనా సమాజానికి చేటు తెస్తుంది.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట

అది వివక్ష కానే కాదు..
శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశం విషయమై జస్టిస్ ఇందూ మల్హోత్రా వెల్లడించిన అభిప్రాయం ముమ్మాటికీ సరైనదే. హేతువాద భావాలను మతపరమైన అంశాలలోకి తీసుకురారాదని, ఒక పక్క మతానికి, నమ్మకానికి మధ్య భావాలను గౌరవిస్తూనే రాజ్యాంగం కల్పించిన సమానత్వం, వివక్ష లేమి వంటి అంశాలను సమన్వయం చేయాలని ఆమె పేర్కొనటాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఎందుకంటే బాలుర పాఠశాలల్లో, కళాశాలల్లో బాలికలకు, బాలికల పాఠశాలల్లో, కళాశాలల్లో బాలురకు ప్రవేశాన్ని కల్పించాలని తీర్పుచెపితే ఎలా వుంటుందో అయ్యప్ప గుడిలోకి అతివలను అనుమతించడం అలాగే వుంటుంది. కొన్ని అనివార్య, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలాంటి వివక్షాపరమైన నిబంధనను విధించుకొనడం మతపరంగా జరుగుతుంది. మహిళల ప్రవేశాన్ని నిరోధించినంత మాత్రాన అది వారిని కించపరచినట్లుగానో, వివక్ష చూపుతున్నట్లుగానో భావించరాదు. స్ర్తిలు మాత్రమే జరుపుకొనే పేరంటాలకు పురుషులను కూడా అనుమతించమనటం ఎంత అసహజంగా వుంటుందో అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల స్ర్తిలకు ప్రవేశం కల్పించాలనడం అలాగే వుంటుంది.
-కె.అమ్మాజీ, విజయవాడ