ఉత్తరాయణం

‘పురపాలన’లో ప్రక్షాళన ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మున్సిపాలిటీల్లో పాలనను మెరుగుపరచేందుకు ఏపీ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. గతంలో సాధారణ ఎన్నికలు ప్రకటించాక ఆపద్ధర్మ ప్రభుత్వాలు కొంత ఉదాశీనత వహించేవి. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడచినా పౌర సేవలు సక్రమంగా అందటం లేదు. గుర్రం గుడ్డిదైనా దాణాకు లోటులేదన్న సామెతలా మున్సిపాలిటీలు పన్నులను మాత్రం వడ్డీ సహా ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. నేడు చాలా పట్టణాల్లో ప్రధాన సమస్య వీధి కుక్కలు, కోతుల బెడద. వీటి బారిన పడిన ఏటా ఎంతోమంది పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కట్టుదిట్టమైన భద్రతలో నుండే మంత్రివర్యులకు ఈ బాధలు తెలియకపోవచ్చు. మున్సిపల్ అధికారులకు తరచు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం.
అధికారులు వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, వాటిని మళ్ళీ వీధుల్లోకి వదులుతున్నారు. ఇక కోతుల నియంత్రణకు కొండముచ్చులను పంపుతారట. కొండముచ్చును చూచిన కోతులు మరో వైపువెళ్ళి తరువాత జనావాసాల్లోకే వస్తాయి. గతంలో మున్సిపల్ అధికారు లు, సిబ్బంది తరచూ వీధుల్లో పర్యటిస్తుంటే ప్రజలు కూడా కొంత బాధ్యతగా మెలిగేవారు. నేడు అధికారులు ఆఫీసులకే పరిమితమైపోతుంటే రోడ్ల ఆక్రమణలను పట్టించుకునేవారు లేరు. ప్రధాన రోడ్లపై రోజుల తరబడి భారీ వాహనాలను వదిలేయడం, గృహనిర్మాణ సామగ్రిని నడిరోడ్డుపై ఉంచడం వల్ల జనం ప్రమాదాల బారిన పడుతున్నారు. రహదారులు పాడైనా ఎవరూ స్పందించడం లేదు. గతుకుల రోడ్లతో వాహన చోదకులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త రోడ్ల నిర్మాణంపై ఉన్న ఆసక్తి మరమ్మతులపై చూపడం లేదు.
సింగపూర్ వంటి ప్రపంచ స్థాయి రాజధాని సంగతేమో గాని, ప్రస్తుతం ఏపీ రాజధానిలో అధికారుల హడావుడి తప్ప సామాన్య ప్రజల సమస్యలను ఎవరూ ఆలకించడం లేదు. పాలనలో ప్రక్షాళన లేకుంటే- అభివృద్ధి పేరుతో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినా ‘కరి మింగిన వెలగపండు’లా అవినీతిపరుల పాలవుతుంది. సింగపూర్ వంటి రాజధాని లేకపోయినా ప్రజలకేమీ తక్షణ ముప్పులేదు. కానీ- కుక్కలు, కోతుల వల్ల ప్రాణాలు కోల్పోయే దుస్థితిని తొలగించాలి. కోతులను అడవులకు తరలిస్తే పౌరులకు భద్రత ఉంటుంది. కోతులు తినే ఫలవృక్షాలను అటవీప్రాంతాల్లో విరివిగా నాటాలి. పట్టణాల్లో ఆలనాపాలనా లేకుండా రోడ్లపై యథేచ్ఛగా సంచరించే పశువులను సంరక్షణ శాలలకు తరలించాలి.

-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట