ఉత్తరాయణం

ఆర్థిక సంక్షోభం తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ సత్వర అభివృద్ధికి పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ వుండడం ఎంతో అవసరం. ప్రభుత్వం తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాలు ప్రజలందరికీ లబ్ధికలిగించే విధంగా వుండాల్సిన ఆవశ్యకతను ఆర్థిక నిపుణులు, మేధావులు పదేపదే చెబుతూవచ్చారు. ఆర్థికపరమైన విధానాలు లోపభూయిష్టంగావున్నా లేక తొందరపాటు నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నా మొత్తం దేశ ఆర్థికవ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం వుంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016, నవంబర్ 8న తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, ఆ తరువాత హడావుడిగా అమలుచేసిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమేకాక, సామాన్య మధ్యతరగతి ప్రజల బతుకులను ఛిద్రం చేశాయి. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోగా, వేలాది సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు ఆర్థిక సంక్షోభం కారణంగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం అధిక వస్తుసేవ పన్నులను తగ్గించే ప్రయత్నంలో దాదాపు పద్దెనిమిది నెలలకాలం పాటు మధ్యతరగతి ప్రజలు ఎన్నో బాధలను ఎదుర్కోవలసి వచ్చిందనేది జగమెరిగిన సత్యం. ఈ ఆర్థిక సంవత్సరం నుండి రెవెన్యూలోటు లక్ష్యాలను తొలగించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ విధంగా నిర్ణయం తీసుకున్నందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, రెవెన్యూ లోటు లక్ష్యాల భర్తీతో నిమిత్తంలేకుండా లక్ష కోట్ల రూపాయల తాయిలాలతో కూడిన పథకాలను కూడా మోదీ ప్రభుత్వం ప్రకటించింది. రైతుల ఖాతాల్లోకి నిధులు, వడ్డీలేని రుణాలుసహా రకరకాల పథకాలకు లక్ష కోట్లు ఖర్చుచేస్తారు. రెవెన్యూలోటు లక్ష్యాలను నిర్మూలించడం వల్ల దేశంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.4 శాతానికి పెరగవచ్చని మూడీస్ ఇనె్వస్టర్ సర్వీస్ తెలియజేసింది. ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని చేపట్టే పథకాల అమలుకు- భవిష్యత్‌లో ప్రజల నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పదు. వచ్చే రెండు నెలల్లో మూడు లక్షల కోట్ల ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించడంపై ఆర్థిక నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ప్రభుత్వ నిర్ణయం స్థూల ఆర్థిక స్థిరత్వానికి, ద్రవ్య పరిస్థితికి దోహదం చేయదని, సబ్సిడీ పథకాలకు అధిక వడ్డీలకు ఓపెన్ మార్కెట్ నుండి ఋణాలు తీసుకోవడం అంతే ఆర్థిక దుబారాయేనని కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భవిష్యత్ రుణసేవల అవసరాలను తీర్చడానికి తగిన ఆదాయాన్ని సృష్టించలేని రంగాలలో అప్పుచేసిన నిధులను గుమ్మరించడంవల్ల తీవ్ర ప్రమాదం ఏర్పడగలదని కాగ్ అభిప్రాయపడింది. లక్షల కోట్ల రూపాయలను ఓట్లకోసం తాయిలాల రూపంలో గుమ్మరించడం అపసవ్య విధానం. అదికూడా రెండుమూడు నెలల్లో ఖర్చుచేయడమంటే నాణ్యతకు, పటిష్టమైన పర్యవేక్షణకు తిలోదకాలిచ్చి అవినీతికి పెద్దపీట వేయడమేనని కాగ్ అభిప్రాయపడింది. ఉచిత పథకాలు ఇంత పెద్దఎత్తున అమలుచేయడంకంటే ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించి వారికి ఆర్జించే అవకాశాలను మెరుగుపరచడమే మంచిదన్న కాగ్ సూచనలను విస్మరించలేం.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
‘ఓట్’ ఆన్ అకౌంట్ బడ్జెట్!
ప్రధాని మోదీ ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ మంచివని చెప్తారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ‘స్థిరమైన పార్టీని ఎన్నుకోండి, సంకీర్ణ ప్రభుత్వాలు వద్దు, రోజుకో ప్రధాని వుంటే కష్టం’ అంటారు. కానీ ఆలోచిస్తే ఏటేటా ఎన్నికలొస్తేనే మంచిదేమోనని అనిపిస్తుంది ఈసారి బడ్జెట్ చూశాక. విధానాలూ, ప్రణాళికలూ, నిధులూ అంటూ పూర్తిస్థాయి బడ్జెట్ కన్నా, ఎన్నికల ముందొచ్చే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కే మెరుపులెక్కువ. అంతోఇంతో ప్రజలు ఊరట పొందే ఊసులు, ఊరింపులు ఎక్కువ. ఎన్డీయే హయాంలోని నాలుగేళ్ల పూర్తి బడ్జెట్లు ఇచ్చిన అభయం కన్నా, నాలుగు నెలల ఖర్చులనుద్దేశిస్తూ వచ్చిన తాత్కాలిక బడ్జెట్ ఎక్కువ ఆశలు రేపుతోంది. ముఖ్యంగా వేతన జీవులు 2014 నుండి ఎదురుచూస్తూ వచ్చిన పన్ను మినహాయింపులు ఈసారి రెట్టింపుచేశారు. పన్ను మినహాయింపు పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచడం మంచి నిర్ణయం. పెరుగుతున్న జీవన వ్యయం నేపథ్యంలో ఇది అవసరం. అసంఘటిత కార్మికులకు పింఛను సదుపాయం కల్పించడం మరో మంచి నిర్ణయం. మన దేశంలో అసంఘటిత కార్నికులే ఎక్కువ కనుక. ఐదెకరాల లోబడి భూమి కలిగిన చిన్న రైతులకు ఏటేటా ఆరువేల రూపాయల నగదు ప్రత్యక్షంగా చేతికే అందిస్తామన్నది సానుకూల చర్య. దీనిని భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. అంతకుమించి చేయాల్సినవి కనీస మద్దతుధర పెట్టుబడికన్నా యాభై శాతం ఎక్కువగా నిర్ణయించడం, మార్కెట్ అనుసంధానం, గోదాముల నిర్మాణం ఇంకా ఎన్నో. అయితే ఇది తాత్కాలిక బడ్జెట్ కనుక ప్రభుత్వం ఈ మాత్రమైనా రైతుల గురించి ఆలోచించడమే మహద్భాగ్యం అనుకొందాం. దేశంలో నిరుద్యోగిత గత నలభై ఐదేళ్ల రికార్డుని అధిగమించి ఆరుశాతంగా నమోదైందని అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. యువత ఎక్కువగా ఉన్న దేశం నిరుద్యోగ దేశంగా మిగిలితే సామాజిక, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుంది. ఉద్యోగ కల్పనలో పరాజయాన్ని అంగీకరించి ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సింది. నిర్మాణ రంగానికి చేయూత నివ్వాల్సింది. ఆ దిశగా చర్యలులేవు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీల అమలులో ఐదేళ్ల పిమ్మట కేంద్రం ఏ స్థానంలో వుందో ఈ ఆఖరు బడ్జెట్లోనైనా తెలియజెప్తే బాగుండేది. ఏది ఏమైనా ఎన్నికల హామీల పూర్తి సినిమాకు ముందు ఈ బడ్జెట్ అధికారిక ట్రైలర్ ఆకర్షించింది. అందుకే - అసలు బడ్జెట్‌కి వడ్డింపులెక్కువ- కొసరు బడ్జెట్‌కి ఊరింపులెక్కువ.
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం
అగ్రవర్ణ పేదలు మనుషులు కాదా?
సమాజంలో మానవులంతా సమానమే. కులాల ప్రకారం మానవుల శరీరాల్లో మార్పులుండవు. ప్రతి మానవునికి తిండి, గుడ్డ కావాలి. కులాల ప్రకారం కనీస అవసరాలు వేరుగా వుండవు. కుల విభజనను రాజకీయ ప్రయోజనాలకు నేతలు వాడుకొంటున్నారు. ఉన్నవి రెండే కులాలు.. అవి పేద, ధనిక అనేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రయోజనాలకై ప్రజలను యస్.సి, యస్.టి, బి.సి, ఒ.సి, మైనారిటీలుగా నేతలు విభజించుకున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో వారు పబ్బం గడుపుకుంటున్నారు. కులాలను, మతాల చేర్చి మన రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి లోపాల మయమైన రాజ్యాంగం లేదు. మన దేశంలో చాలా రాష్ట్రాలలో 80 శాతానికి మించి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇలా చెల్లుబాటయ్యే రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు వచ్చేసరికి చెల్లుబాటు కాకుండాపోతాయా? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వటం సబబే. అయినప్పటికీ రిజర్వేషన్లు పూర్తిగా రద్దుకావటమే దేశానికి క్షేమకరం. కులం, మతం అనేవి మన రాజ్యాంగంలో ప్రమాదకరమైన పదాలు. ప్రజలు, పాలకులు దేశ క్షేమానికై పోరాడాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురము
ఇ.పి.ఎస్ పెన్షనర్ల మొర వినరా?
2002, 2003 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి బలవంతంగా తొలగింపబడిన ఉద్యోగులకు ఇ.పి.ఎస్-95 పెన్షన్‌ను వర్తింపచేశారు. దీంతో వారికి ఈనాటికి ఇంకా ఏ ఎదుగుదల లేని విధంగా వెయ్యి రూపాయల లోపు పెన్షన్ వస్తున్నది. దీనికి కారణం- 1992, 1997లో జరుపవలసిన వేతన సవరణలను నిలిపివేయడం. గత దశాబ్దన్నర కాలంగా ఉద్యోగులు తమ తమ రాష్ట్రాలలో, ఢిల్లీలో ఎన్ని ధర్నాలు, నిరాహారదీక్షలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేసినా ఫలితం లేదు. అప్పటి ప్రధానులు వాజపేయి, మన్మోహన్‌సింగ్, ఇప్పటి ప్రధాని మోదీకి వందలసార్లు విన్నపాలు చేసుకున్నా, కోర్టుతీర్పులు ఉద్యోగుల తరఫున వచ్చినా కేంద్ర ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు. వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారు. వీరిపాటి కూడా చేయలేదా ఇ.పి.ఎస్-95 పెన్షనర్లు?
- డా. ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్