ఉత్తరాయణం

సామాన్యుల దరి చేరని సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొంది 70 వసంతాలు పూర్తిచేసుకోవడం ఆనందదాయకం. దేశ భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన రాజ్యాంగం నుండి ఆశించిన ఫలాలు అందడం లేదు. ఇందుకు కారణాలను పునరావలోకనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలందరికీ సామాజిక, సాంఘిక, ఆర్థిక న్యాయం కల్పించాలని మన రాజ్యాంగానికి 122కు పైగా సవరణలు చేశారు. ఏ ఫలితాలను ఆశించి సవరణలు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. రాజ్యాంగ నిర్మాణ సభకు మొట్టమొదటి అధ్యక్షుడైన బాబూ రాజేంద్రప్రసాద్ కలలుగన్న రాజ్యాంగం నిరాశ మిగిల్చింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, తమకు అనుకూలంగా రాజ్యాంగ భాష్యాలు మార్చుకునే రాజకీయ పక్షాల నిర్వాకాలతో దేశ శ్రేయస్సు, ప్రజాసంక్షేమాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగా మార్చారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశించిన ‘సామాజిక ఆర్థిక జీవనంలో ఒకే విలువలు’ అన్న సూత్రం కనుమరుగవుతోంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే వుండడంతో, కొన్ని రాష్ట్రాల అభివృద్ధి మాత్రం కుంటుపడింది. రాష్ట్రాలను కేంద్రం తమ చెప్పుచేతల్లో వుంచుకునేందుకు అప్రజాస్వామిక పద్ధతులు అవలంబించడం, కుట్రపూరిత రాజకీయాలు పెచ్చుమీరడంతో, రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడింది. 2002 సంవత్సరంలో ఏర్పాటైన జస్టస్ వెంకటాచలయ్య కమిషన్ రాజ్యాంగం పనితీరు మెరుగుపరచడానికి, నేరమయ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రజాప్రాతినిధ్య చట్టంలో అవసరమైన 249 సిఫార్సులు చేసింది. రాజకీయ పార్టీలు నైతిక విలువలకు పాతరేసి, ఎన్నికలలో గెలవడమే ధ్యేయంగా నేర చరితులకు, ముద్దాయిలకు సీట్లిచ్చి రాజకీయాలను నేరస్థులకు అడ్డాగా మార్చివేసాయి. రాజ్యాంగం మనకు మార్గదర్శకం. రాజ్యాంగ కర్త డా.బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తి వాక్యాలైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం అన్న మాటలు చెప్పే రాజకీయ నాయకులు గద్దె ఎక్కాక, నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కుల విషయంలో విచక్షణ కనబడుతోంది. ఏ పార్టీలు అధికారంలో వుంటే ఆ పార్టీలు అహేతుకమైన పరిమితులను సాకుగా చెప్పి ప్రజావ్యతిరేక చట్టాలను తెచ్చి వాటిని ఆయుధంగా ఉపయోగించుకొని తమ అవసరాలకు భిన్నంగా వ్యవహరించే వ్యక్తుల భావ వ్యక్తీకరణ నిర్బంధానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. మాతృభాషకు సంబంధించిన అంశాలలోనూ అసమానతకు ఉదాహరణ ఇప్పటికీ కేంద్ర సర్వీసులలో హిందీ, ఆంగ్ల భాషలలో మాత్రమే పరీక్షలు నిర్వహించడంతో ఉత్తరాది వారే నూటికి తొంభైకి పైగా ఉద్యోగాలు పొందుతున్నారు. ఇది మిగతా రాష్ట్రాల హక్కులు కాలరాయడమేనని పాలకులకు తెలిసినా కళ్ళుమూసుకొని కూర్చోవడం అన్యాయం. మత, కుల ప్రాతిపదికలు రాజకీయ రూపం సంతరించుకోవడం, రాజకీయాలు ముఠా, గ్రూపు వ్యవస్థలకు కేంద్రాలుగా మారిపోవడం, పెట్టుబడిదారులకు వ్యాపార కేంద్రాలుగా, బడా పారిశ్రామిక వేత్తలకు స్వర్గ్ధామంగా మారాయి. లౌకిక సామ్యవాదం నినాదానికే పరిమితమవడంతో రాజ్యాంగం అలంకారమాత్రంగా మిగిలిపోవడం ప్రజాతంత్రానికే గొడ్డలిపెట్టు.
- సి.కనకదుర్గ, హైదరాబాద్
వరాలు కొన్ని వర్గాలకే!
ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి, వేతన జీవులకు వరాల జల్లు అని భావిస్తున్నా, ఆ పథకాల పరిధిలోకి రాని సామాన్య జీవులు అధికంగానే వున్నారు. రైతులకు కొంత ఊరట లభించినా, అసంఘటిత కార్మికులకు బీమా పథకం వల్ల తక్షణ ప్రయోజనం లేదు. ప్రజాకర్షక పథకాల్లో అవినీతి గురించి ప్రభుత్వాలు దృష్టి పెట్టటం లేదు, పేదల సంఖ్య తగ్గటం లేదు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినా, ఎక్సైజ్ సుంకం తగ్గించినా సామాన్యులకు, రవాణా రంగానికి మేలు జరిగేది. పెట్రోలు వాడకం తగ్గించాలనుకుంటే జల, రైలు రవాణాను ప్రోత్సహించాలి. వంటగ్యాస్‌పై సబ్సిడీ కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణం చేయకుండా గతంలో వలె సబ్సిడీ ధరలకే సిలిండర్లు ఇస్తే పేదలకు ప్రయోజనం కలుగుతుంది. బ్యాంకు సిబ్బందికి పనిభారం తగ్గుతుంది. పోస్టల్, బ్యాంకు ఖాతాల్లో చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీ కొంత మేర పెంచినా- పెన్షన్లు లేని రిటైర్డ్ ఉద్యోగులకు కొంత వెసలుబాటు లభిస్తుంది. అక్రమాలకు ఆస్కారం లేని ఇటువంటి రాయితీలు సామాన్యులకు ఉపకరిస్తాయి. ప్రభుత్వాదాయం పెరుగుతున్నవేళ సంపన్న, సంఘటిత వర్గాలకే కాదు సామాన్య ప్రజానీకానికీ అభివృద్ధి ఫలాలు అందాలి.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
చైనా దిగుమతులను ఆపండి
కొన్ని పండగల సందర్భంగా మన దేశంలో గాలిపటాలను ఎగరవేయడం ఓ వేడుక. గాలిపటాలకు చైనా నుంచి దిగుమతి అవుతున్న మాంజా అనే కరుకు దారాన్ని వాడుతున్నారు. ఈ దారం సులభంగా తెగదు. దీనివల్ల ఎగిరే పక్షులు చనిపోతున్నాయి. గాయాల పాలవుతున్నాయి. మనుషులకు సైతం ఇది ప్రమాదకరంగా మారుతోంది. ఈ మాంజాను వాడకూడదని పోలీసులు, ప్రభుత్వం ఆంక్షలు విధించినా ఫలితం లేకుండా పోయింది. అసలు ఈ మాంజాను దిగుమతి చేయడమెందుకు? ఈ తప్పును ప్రభుత్వం చేసి, మాంజాను వాడినవారిని తప్పుపట్టడం సరికాదు. చైనా వస్తువులను కొనవద్దంటున్నారు. దిగుమతులు చేస్తున్నంత కాలం కొనడం తప్పదు. నేరం ప్రభుత్వానిదే.. ప్రజలదు కాదు.
-ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
విభజన రాజకీయాలెందుకు?
హైదరాబాద్‌లో తెరాస నాయకుడు కేటీఆర్ ఇటీవల వైఎస్ జగన్‌ను కలసి ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఆహ్వానించడం, అందుకు జగన్ సమ్మతించడం చూసి ‘తెలుగు తమ్ముళ్లు’ విరుచుకుపడడం విడ్డూరం. తెదేపా మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగేసుకొని కాంగ్రెస్ పార్టీని ఆలింగనం చేసుకోవడం తప్పుకాదు. జగన్ ‘హోదా’ ముసుగేసుకొని తెరాసని ఆలింగనం చేసుకోవడం ‘ఆంధ్రులకు ద్రోహం’ అంటూ తెదేపా గంగవెర్రులెత్తుతోంది. తెలంగాణవారు ఆంధ్రులకు శత్రువులైతే తెలుగు తమ్ముళ్లు అక్కడ కోట్ల విలువచేసే భవనాలు కట్టుకొని, వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదించడం ఆ రాష్ట్రానికి పన్నులు చెల్లించడం ద్రోహం కాదా? తెదేపా నాయకులు హైదరాబాద్‌లో ఇళ్లు అమ్మేసి, వ్యాపారాలు బంద్ చేసుకొని అమరావతికి వచ్చేయగలరా? ఎందుకీ విభజన రాజకీయాలు?
- సౌందర్య, కాకినాడ