ఉత్తరాయణం

ధూమపానాన్ని వ్యతిరేకిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధూమపానానికి వ్యతిరేకంగా మొదటిసారిగా ఇంగ్లండ్‌లో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ధూమపాన వ్యతిరేక ప్రచారం ఇంగ్లాండ్ నుంచే ఇతర దేశాలకు వ్యాపించిందని చెప్పవచ్చు. 1984లో ఇంగ్లండ్‌లో ధూమపానానికి వ్యతిరేకంగా ఒక జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఆనాటి నుండి ఏటా మార్చి నెలలో రెండవ బుధవారం రోజున ధూమపాన వ్యతిరేక దినం పాటిస్తున్నారు. ఇంగ్లండ్‌లో పొగ తాగడానికి వ్యతిరేకంగా గత 20 సంవత్సరాల నుండి చేస్తున్న ప్రచారం వల్ల సుమారు 1.5 మిలియన్ల మంది ఈ అలవాటును మానుకున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. సిగరెట్టులో మనిషికి హాని చేసే 500 రకాల వ్యర్థ పదార్థాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. సిగరెట్టులోని కార్బన్ మొనాక్సైడ్, తార్, నికోటెన్ అనే పదార్థాలు ఆరోగ్యానికి తీవ్ర హాని కల్గిస్తాయి. ధూమపానం వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్, క్షయ, గుండె జబ్బులు సోకే అవకాశం వుంది. ధూమపానం చేసే వారు వదిలిన పొగను పీల్చేవారు కూడా వ్యాధిగ్రస్తులయ్యే అవకాశం వుంది. అందువల్ల ఇతర దేశాలతోపాటు మన దేశంలోకూడా బహిరంగ ప్రదేశాలలో ధూమపానంపై నిషేధాజ్ఞలు అమలులో వున్నాయి. 2007 మార్చి 14న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటే, యేటా మార్చి రెండవ బుధవారం ఏ తేదీన వచ్చినా నిర్వహిస్తున్నారు. ఇంత ప్రచారం జరుగుతున్నా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ధూమపానానికి బానిసలవుతున్నారు. సిగరెట్టు ధరలు విపరీతంగా పెరిగినా దమ్ముకొడుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 10మంది చనిపోతున్నారు. కానీ పొగాకు పరిశ్రమలు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తులపై వచ్చే పన్నుతో ప్రభుత్వ ఖజానాలు నిండుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల మంది ధూమపానం చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో ఇది ఏడోవంతు. ధూమపానంలో చైనా అగ్రస్థానంలో వుంది. ధూమపానం చేసేవారిలో 80 శాతం మంది పేద, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేస్తున్నవారిలో 22.6 కోట్లమంది పేదవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తేలింది. ధూమపానంపై ప్రజలలో చైతన్యం తేవాల్సిన తరుణం ఇది.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
పాక్‌తో క్రికెట్ ఆడాలి..
ప్రపంచ కప్ క్రికెట్‌లో ఇండియా, పాకిస్తాన్‌లు షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్‌లో వచ్చే జూన్‌లో ఢీకొనబోతున్నాయి. అయితే పుల్వామా ఉగ్రదాడిలో 43 మంది భారత జవాన్లు మరణించడంతో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్థాన్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాలను తెంచుకున్నది. పాకిస్థాన్‌తో జరిగే క్రికెట్ మ్యాచ్‌ను కూడా రద్దుచేసుకోవాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇండియా, పాక్‌ల మధ్య క్రికెట్‌మ్యాచ్ అంటే ప్రపంచమంతా విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంది. క్రికెట్‌లో ఇంతకుమించి ఉత్కంఠ రేకెత్తించే మ్యాచ్ మరొకటి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టకూడదు. ఆటలను కొనసాగిస్తూనే, మరోపక్క ఉగ్రదాడులను, పాకిస్థాన్ కపట పన్నాగాలను రాజకీయంగా ఎదుర్కోవాలి. పాకిస్థాన్‌తో మనకు మ్యాచ్ నాకౌట్‌లో అనగా సెమీఫైనల్ లేక ఫైనల్‌లో ఎదురైతే ఎలాంటి నిర్ణయం అమలుచేయాలో వ్యూహం ఉండాలి. మ్యాచ్‌ను భారత్ రద్దుచేసుకుంటే ఐసిసి ఇండియా క్రికెట్‌పై జరిమానా, నిషేధం విధించే అవకాశముంది. కనుక ప్రపంచ కప్‌లో ఇండియా పాక్‌తో ఢీకొని, ఆ దేశాన్ని ఓడించి భారత అభిమానుల భావోద్వేగాలను చల్లార్చాలి.
- జి.అశోక్, గోదూర్ (జగిత్యాల జిల్లా)
జాడలేని భూగర్భ జలాలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాగునీరు గరళాన్ని తలపించడం మానవ తప్పిదమే అనడంలో సందేహం లేదు. రానున్న సంవత్సరాల్లో నీటికోసం కటకటలాడే పరిస్థితి వస్తుందంటే అతిశయోక్తి కాదు. భూగర్భంలో 1200 అడుగుల వరకు తవ్వి నీటిని తోడెయ్యడంతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు మరొక రెండేళ్ళు కొనసాగితే భూగర్భజలాలు పూర్తిగా ఎండిపోయి, తిరిగి వాటిని పొందడం అసాధ్యవౌతుందని ఎన్నో నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర భూగర్భ జలమండలి ఇన్ని హెచ్చరికలు చేస్తున్నా నివారణ చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వాల అసమర్ధతను చెప్పకనే చెబుతోంది. జల సంరక్షణ కన్నా నీటి వాడకం అధికం కావడం, నీటి వినియోగంపై అవగాహనా రాహిత్యం, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు లెక్కకుమించి పెరిగిపోవడం, వర్షాభావం, ఒక బోరులో నీరు రాకపోతే, పక్కనే రెండవ బోరు తవ్వి యథేచ్ఛగా భూగర్భ జలాలను దుర్వినియోగం చెయ్యడంతో గుక్కెడునీళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడడానికి ఎంతో సమయం పట్టదని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎంత లోతుకు తవ్వితే అంత ఎక్కువగా నీరు పడుతుందన్న అపోహతో వందల, వేల అడుగులకు బోర్లను వేసి భూగర్భ జలాలను తోడెయ్యడంతో వివిధ హానికర రసాయనాలు మిళితమై వున్న నీరు వస్తోంది. దీనిని సేవించడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో 12వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలు అందుబాటులో వుంటే, 9వేల ఎంసిఎంల నీటిని సాగు, గృహ పారిశ్రామిక అవసరాలకు వాడెయ్యడం గమనార్హం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో మరొక ఎడారిని తలపించడం ఖాయం. కొన్ని సర్వేలలో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నీటి నమూనాలను పరీక్షించగా 47 శాతం నీరు త్రాగడానికి పనికిరాదని, నైట్రేట్, ఫ్లోరైడ్‌లు ప్రమాదకర స్థాయిలో వున్నాయని తేలింది. నీటిలో పూర్తిగా కరిగే ఘన పదార్థాలు (టిడిఎస్) ఒక లీటరుకు 500 మిల్లీగ్రాములు వుండాల్సి వుండగా, అది గరిష్టంగా 900నుండి 3000 మిల్లీ గ్రాములు వున్నాయన్న దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించాయి. ఈ గరళ జలాలను సేవిస్తే ఎముకలు పటుత్వాన్ని కోల్పోవడంతోపాటు ఉదర సంబంధమైన అనారోగ్యాలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు కళ్ళు తెరవకపోవడం గర్హనీయం. పట్టణాలలో అయితే శుద్ధిచేసిన నీరు అందుబాటులో వుండడంతో కొంతవరకు మంచి నీటి అవసరాలకు వాటిపై ఆధారపడుతున్నారు. కానీ గ్రామాలలో ప్రజలు అవగాహనా రాహిత్యం, పేదరికంతో విషపూరిత జలాలనే త్రాగి అనేక రోగాల బారిన పడుతున్నారు. ఈ జలాలతో పండించిన పంటలు కూడా విషతుల్యం అవుతున్నాయన్న కఠోర సత్యాన్ని శాస్తవ్రేత్తలు వెల్లడించినా ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఫ్లోరైడ్ జలపీడిత ప్రాంతాలతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోతున్న ప్రాంతాలకు సురక్షిత త్రాగునీరు అందించే ప్రణాళికలను సత్వరమే చేపట్టాలి.
- సి.కనకదుర్గ, హైదరాబాద్