ఉత్తరాయణం

‘బాహుబలి’ నరేంద్ర మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అఖండ మెజారిటీ సాధించడాన్ని చూస్తే ఇదంతా మోదీ మహిమేనని సర్వత్రా వినపడుతున్న మాట. మోదీకి దీటైన రీతిలో ప్రధాని అభ్యర్థిగా విపక్ష కూటముల నుంచి ఎవరూ.. ఆ స్థాయి సమర్థతతో కనిపించకపోవడం ఈ విజయానికి మరో కారణం. ఎన్నికల ముందు నిరుపేద అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు తీసుకురావడం, పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులను ఆకట్టుకోవడం, పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడికి మెరుపువేగంతో ప్రతిదాడి జరిపి పాకిస్తాన్‌ను గజగజలాడించడం, ముస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించడంలో భాగంగా త్రిపుల్ తలాక్‌ను రద్దుచేయడం వంటి అనేక అంశాలు భాజపా విజయానికి దోహదపడ్డాయి. ఈ విజయం ఒక్క మోదీ ద్వారానే ఆవిష్కృతమయ్యిందని చెప్పవచ్చు. పెద్దనోట్ల రద్దు ద్వారా సామాన్యులు చాలా ఇబ్బందులు పడిన వైనం, జీఎస్టీ ద్వారా చిన్నతరహా, మధ్యతరగతి వ్యాపారులు ఆందోళన చెందిన విషయం, ఇతరత్రా అనేక అంశాల్లో మోదీ ఇందిరాగాంధీ కన్నా నియంతగా వ్యవహరిస్తున్నాడనే విమర్శ తదితర కారణాలతో 2014 నాటి విజయాలను భాజపా దక్కించుకోవడం కష్టం అని అందరూ భావించారు. గత డిసెంబర్‌లో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడం, అంతకుముందు 6 నెలల కిందట కర్నాటకలో కూడా కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం, పంజాబ్‌లో అధికారంలో వున్నందున ఈ అయిదు రాష్ట్రాల్లో తమకు ఆశించిన స్థాయిలో సీట్లు వస్తాయని, మిత్రపక్షాల సహకారంతో యూపీఏ అధికారంలోకి వస్తుందని, 2004లో మన్మోహన్‌సింగ్ వలే ఇపుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానిగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ నేతలు భావించారు. ఏ విధంగానైనా మోదీని మరోసారి కుర్చీమీద కూర్చోనివ్వకూడదు అని సమాజ్‌వాద్ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి నాయకులు ఒకే వేదిక మీదకు వచ్చారు. వీరందరినీ ఒకచోటుకి చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడిన శ్రమ అంతాఇంతా కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొత్త కూటమి పేరుతో కొన్ని రాష్ట్రాలలో పర్యటించారు. వీరందరి ఆశలను అడియాసలు చేసి ప్రజలు కచ్చితమైన మెజార్టీతో తీర్పునిచ్చారు. మరోసారి మోదీ ‘బాహుబలి’లా నిలవడంతో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు ఇపుడు చూస్తున్నాయి.
ఇక, దేశ రాజకీయాలను శాసించాలని భావించిన చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే ఘోర పరాభవం ఎదురయ్యింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను గమనించక, నిఘా అధికారులు ఇచ్చే తప్పుడు నివేదికలు, కోటరీ బృందం చెబుతున్న విషయాలను గుడ్డిగా నమ్మడం వంటి అనేక వైఫల్యాలతో వ్యవహరించడమేగాక అభ్యర్థుల ఎంపికలో బాబు చాలా పొరపాట్లు చేశారు. ఎమ్మెల్యేలకు, అధికారులకు విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వడంతో ఈ రెండు వర్గాలు ఒక సిండికేట్‌గా ఏర్పడి అంగన్‌వాడీ టీచర్లు, హోంగార్డ్‌ల నియామకాల వంటి చిన్న చిన్న ఉద్యోగాల ఎంపికలో కూడా భారీగా డబ్బు చేతులు మారడం, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఎమ్మార్వోల వంటి అధికారులు రోజువారీ లెక్కలను ఎమ్మెల్యేలకు వివరించడం, జన్మభూమి కమిటీలు ప్రజలను జలగల్లాగా పీడించి సమాంతర వ్యవస్థను నడపడం, ఇసుక కుంభకోణాలు, అసైన్డ్ భూముల కబ్జాలు వంటివన్నీ టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. ఇక-నాలుగు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారం దక్కించుకున్న కేసీఆర్‌కు పార్లమెంట్ ఎన్నికలలో చుక్కెదురు కావడంతో వీరు కూడా ఆత్మ పరిశీలనతో ముందుకు సాగవలసిన అవసరం ఏర్పడింది. 16 పార్లమెంట్ సీట్లు వస్తాయని ప్రతిచోట కేసీఆర్ ఢంకా మోగించి చెబుతూ వచ్చారు. కేటీఆర్ కూడా తెలంగాణలో వేరే పార్టీలకు చోటే లేదు అని ఊరు, వాడ అదిరిపోయే విధంగా ప్రచారం చేశారు. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ నాలుగు పార్లమెంట్ సీట్లలో పుంజుకోవడం, కోమాలోకి వెళ్లిందన్న కాంగ్రెస్‌కు అనూహ్యంగా మూడు సీట్లు దక్కడం వంటి పరిణామాలు చూస్తుంటే.. తెలంగాణ ప్రజలు తాము చైతన్యవంతులమని నిరూపించారు.
-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212
ఇది వైసీపీ ప్రభంజనం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం చరిత్రాత్మకమైనది. రాజకీయ ఉద్ధండులూ జగన్ హోరులో ఓటమిని చవిచూడటం విశేషం. అభివృద్ధి, సంక్షేమ పథకాలు చంద్రబాబును ఏమాత్రం ఆదుకోలేకపోయాయి. ‘ఒక్క అవకాశం ఇచ్చి చూడండి’ అని జగన్ చేసిన అభ్యర్థనను జనం స్వీకరించారు. దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. ప్రత్యర్థులు ఎన్ని ప్రతికూలతలు సృష్టించినా వైసీపీ నాలుగింట మూడువంతులకు పైగా సీట్లుతెచ్చుకుని విజయ దుందుభి మోగించింది. ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల ‘స్టార్ క్యాంపెయినర్లు’ దండెత్తి వచ్చినా.. ‘సింహం’ సింగిల్‌గానే మరోసారి పోరాడింది. విజేతగా నిలిచింది. జగన్ జపించిన ‘నవరత్నాలు’ సంక్షేమ మంత్రానికి పల్లెలు, పట్టణాలు, నగరాలన్నీ అర్ధరాత్రి వేళలోనూ పోలింగ్ బూత్‌లకు వరుస కట్టాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు యువత తమ జగన్‌కు అండగా నిలిచారు. అయిదేండ్ల చంద్రబాబు పాలన ఆసాంతం ప్రజా, నిరుద్యోగ విధానాలతో సాగింది. ఇలాంటి సమయంలో జగన్ గెలవడం ఒక చారిత్రక అవసరం అని గుర్తించింది నవ్యాంధ్ర. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న మెజారిటీ ప్రజల అచంచలమైన విశ్వాసం ముందు అధికార పక్షం చేష్టలు కూలబడిపోయాయి. కొత్త రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పాలించిన చంద్రబాబు నవ్యాంధ్ర ప్రజల అవసరాలకు అనుగుణమైన విధానాలను అనుసరించడంలో విఫలమయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత వైసీపీ సంచలన విజయానికి దోహదపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికలకు కొన్ని నెలలముందు తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసించలేకపోయారు. ఇదంతా చంద్రబాబు ఎన్నికల డ్రామాలో భాగమని ప్రజలు భావించారు. ఫలితంగా వారు బాబు ఓటమికి కంకణం కట్టుకుని మరీ పనిచేశారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికుల పెన్షన్లను మూడువేల రూపాయల చేస్తామన్న హామీ బాగా పనిచేసింది. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు బెడిసికొట్టాయి. ప్రత్యేక హోదాపై జగన్ పోరాటాన్ని నమ్మారు. తమ మద్దతు జగన్‌కే అని పోటెత్తి ఓటేశారు. అయితే విజయం ఎంత ఘనంగా ఉంటుందో, బాధ్యత కూడా అంతే బరువుగా ఉంటుంది. దానిని నెరవేర్చే దిశగానే కొత్త ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి.
- బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూరు
ప్రజా వ్యతిరేకతకు ఫలితం...
జగన్ విజయం తెలుగుదేశం పార్టీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. గత ఐదేళ్లుగా ప్రభుత్వోద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు సక్రమంగా ఇచ్చే కరువుభత్యం పదిహేను నెలల అనంతరం చెల్లించడం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను పూరించక పోవడం, 7/2018 నుండి వేతన సవరణ చేయకపోవడం, రెండు దశాబ్దాల పైబడి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దినసరి, కంటింజెంట్, ఒప్పంద కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించక పోవడం, గుత్తేదారుల ప్రమేయంతో అధికారుల ప్రేక్షక పాత్ర, బహిరంగంగా ప్రజాప్రతినిధులు ఇసుక నుండి తైలం లాగడం.. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబుది ధృతరాష్ట్ర పాత్రగా ప్రజలు భావించారు. ఎన్నికల ముందు పసుపు, కుంకుమ, పింఛన్లు పెంచడం, అనేక మంది మంత్రులు, శాసనసభ్యులకు ఆదాయంపై ఉన్న యావ ప్రజాసమస్యలపై లేకపోవడం వంటి సవాలక్ష కారణాలు వైకాపాకు అఖండ ఆధిక్యాన్ని కట్టబెట్టాయి, రాజధాని, పోలవరం నిర్మాణంతోపాటు ప్రజాసమస్యలపై పాదయాత్రలో ఇచ్చిన హామీలపై జగన్ అంకితభావంతో పనిచేయాలి. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి..
- ఎర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం