ఉత్తరాయణం

సాకారం కాని సొంతింటి కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలకు ప్రాథమిక అవసరాల్లో ముఖ్యమైన సొంత ఇళ్లను సమకూర్చడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. 2017 నాటి జాతీయ సామాజిక సర్వే ప్రకారం దేశంలో కేవలం 45శాతం మందికి మాత్రమే స్వంత ఇంటి కల సాకారమయ్యింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో సొంతిల్లు అనేది నేటికి మధ్య, దిగువ తరగతి ప్రజలకు ఒక కలగా మిగిలిపోవడం బాధాకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణ పథకాలు చేపడుతున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో ప్రజల అవసరాలు తీర్చడం లేదు. రకరకాల చిక్కుముడులతో కూడిన నిబంధనలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల కారణంగా ఆయా పథకాలు ప్రజలందరికీ చేరువ కాలేకపోతున్నాయన్నది చేదు నిజం. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లోపించడం, అర్హులకు బ్యాంకుల నుండి ఋణాలు సకాలంలో అందకపోవడం, ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించడం వంటి కారణాలతో ప్రభుత్వ పథకాలు స్వంత ఇంటి కల ఆకాంక్షను నెరవేర్చలేక పోతున్నాయి. పేదలకు గృహ నిర్మాణమే లక్ష్యంగా ఆయా పథకాల్లో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. ఈ మార్పులలో భాగంగా ఒక్కొక్క గృహానికి ప్రభుత్వ సహాయాన్ని 70వేల నుండి 1.2 లక్షలకు పెంపు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ద్వారా అదనంగా పనె్నండు వేల రూపాయలు సమకూర్చడం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారుల ఇంటి నిర్మాణం కోసం 90-95 రోజులపాటు ఉచితంగా కూలీలను అందించడం, గృహాలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండా అందించడం, అదనంగా మరో 70వేల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు సహకారం, సమయానికి ఇళ్ళ నిర్మాణం పూర్తిచేయని గుత్తేదారులపై కఠినచర్యలు తీసుకోవడం వంటి చర్యలు నిస్సందేహంగా నత్తనడకన నడుస్తున్న గృహ నిర్మాణానికి ఊతం అందిస్తుంది. ‘అందరికీ ఇళ్లు’ అనే నినాదంతో 2021-22 కాలం నాటికి 2.91 కోట్ల గృహాలు నిర్మించాలని నిర్దేశించుకున్న ఉన్నత లక్ష్యాలను పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను అమలుచేయాలి. గతంలో తప్పుల తడకగా, అత్యంత అవినీతి మయంగా అమలైన ఇందిరా ఆవాస్ పథకం నుండి గుణపాఠాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నేర్చుకోవడం, ఆ తప్పులు తిరిగి పునరావృతం అవకుండా, ఇళ్ళ నిర్మాణం పథకాలలో ఎటువంటి అవినీతికి తావివ్వకుండా, నాణ్యతాపరమైన లోపాలు తలెత్తకుండా పటిష్టమైన పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎంతో అవసరం.
-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
సమ్మెలతో తిప్పలు తప్పవు
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికులు ఈనెల 13 నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకొని, తమ డిమాండ్ల పరిశీలనకు కొత్త మంత్రివర్గం పూర్తిస్థాయిలో ఏర్పడేవరకు తగిన వ్యవధినివ్వాలి. ఆర్టీసీ యాజమాన్యం అంటే చైర్మన్, అధికారులు కాదు, వారూ పబ్లిక్ సర్వెంట్సే. ప్రజాధనంతో నడిపే ప్రభుత్వ సంస్థల మేనేజ్‌మెంట్లు ప్రభుత్వాల నుండి తగు సూచనలు, అనుమతులు తీసుకుంటాయి. కరువులో అధికమాసం అన్నట్లు వేసవిలో బస్సు సర్వీసులు పెంచకపోగా, సమ్మెచేస్తే సామాన్య ప్రజానీకం అవస్థ పడుతుంది. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో దీర్ఘకాలం సమ్మెచేస్తే, ఆ తరువాత బస్సు చార్జీలు భారీగా పెంచారు. మన పొరుగున వున్న ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో మనకంటే చార్జీలు ఎంతో తక్కువ. మళ్ళీ ఈమధ్య వివిధ సెస్సుల పేరుతో చార్జీలు పెంచి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తగ్గించి అధిక చార్జీలు వసూలు చేసేలా అల్ట్రా డీలక్సు సర్వీసులు పెంచారు. కుటుంబ ప్రయాణాలకు సొంత కార్లు, వాహనాలే చౌక అనే స్థితి వచ్చింది. ఫలితంగా వ్యక్తిగత వాహన వినియోగం భారీగా పెరిగి రోడ్డు ప్రమాదాలు, వాయు కాలుష్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి. పేదలేమో చౌక అని లారీల్లో ప్రయాణిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వలె ప్రజలకు చౌకగా రవాణా వ్యవస్థను అందిస్తే ప్రస్తుతానికి కొంత భారమైనా భవిష్యత్తులో వ్యక్తిగత వాహన వినియోగం, ప్రమాదాలు, పెట్రో వాడకం తగ్గి ప్రజలకు, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఆర్టీసీలో నష్టాలు తగ్గించేందుకు- డీజిల్ ధరలపై పన్ను రాయితీలతోపాటు, గత ప్రభుత్వం పోలవరం, అమరావతి ప్రాంతాలను ప్రజలు సందర్శించేందుకు సంస్థపై మోపిన అదనపు వ్యయాన్ని తిరిగి చెల్లించాలి. అన్ని విభాగాల్లో జరిగే దుబారా, అక్రమాలు అరికట్టాలి. సిబ్బందిపై పెరిగిన పనిభారాన్ని తగ్గించే విధంగా తాత్కాలిక సిబ్బందిని తక్షణమే నియమించాలి. సంస్థ నష్టాలు పూడ్చుకోటానికి అనవసరమైన కొన్ని రాయితీలు ఎత్తివేసి, సీజన్ టిక్కట్లతోపాటు తెల్లరేషన్ కార్డులున్న సీనియర్ సిటిజన్లకే చార్జీల్లో రాయితీలు ఇవ్వాలి. అదనపు భారాలన్నీ ప్రభుత్వమే భరించాలంటే మంత్రులో, అధికారులో భరించరు, తిరిగి ప్రజలపైనే పడుతుంది. నేడు ఎన్నో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు రంగంతో పోటీపడవలసిన స్థితి వచ్చింది. ఒకనాడు ఎయిరిండియా, బ్యాంకులు, ప్రైవేటు బస్సు రవాణా, జాతీయం చేస్తే ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నేడు ఎన్నో ప్రభుత్వ సంస్థలను మూసివేస్తున్నా ప్రజలు వ్యతిరేకించకపోవటానికి కారణం ప్రభుత్వ సేవలు దిగజారటమే. ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వ సంస్థలు వారికి భారం కాకూడదు. సమస్యలను సాధ్యమైనంతవరకు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఒకవేళ ఆర్టీసీలో సమ్మె జరిగినా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నరసరావుపేట