ఉత్తరాయణం

విరాళాల నిగ్గు తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే మనది భారీ ప్రజాస్వామ్య వ్యవస్థ అని గొప్పలు చెప్పుకొని నేతలు పబ్బం గడుపుకోవడం మన జాతి చేసుకున్న దురదృష్టం. మన దేశ ఎన్నికల ప్రక్రియ కరెన్సీ నోట్ల చుట్టూ తిరగడం, రాజకీయ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన ధనాన్ని, పెద్ద మొత్తాలలో సంపన్నులు, కార్పొరేట్ సంస్థల నుండి స్వీకరించి దానికి బాండ్ల పథకం కింద మసిపూసి మారేడుకాయ చేయడం- ఈ వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిందో తెలుపకనే తెలుపుతోంది. అవినీతితో మమేకమైన ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి సుప్రీం కోర్టు సదరు దాతలను వారు ఇచ్చిన గుప్తదానాలను జనావళికి తెలియజేయాల్సిందేనని ఇటీవలి తాజా ఉత్తర్వులు జారీచెయ్యడంతో భూరి విరాళాలను బాండ్లరూపంలో చూపించుదామన్న రాజకీయ పార్టీలు, నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. భారీ మొత్తాలలో విరాళాల సేకరణ అనేది అవినీతికి దారులు తెరిచినట్లవుతుందన్న సంతానం కమిటీ నివేదికను, రాజ్యాంగ సమీక్షా సంఘం ఇచ్చిన నివేదికను పార్టీలు, ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయి. అడ్డదారుల్లో పెద్దమొత్తాలలో నల్లధనాన్ని కుబేరుల నుండి స్వీకరించి వాటిని తెల్లధనం చేయడానికి బాండ్ల ప్రతిపాదన తేవడం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించడమే అవుతుంది. కార్పొరేట్ సంస్థలలో వారి నికర లాభంలో 7.5 శాతం దాకా విరాళాలు ఇవ్వచ్చునన్న పరిమితిని ఎత్తివేసి, కంపెనీలు ఏ మేరకు విరాళం ఇచ్చింది తమ సంస్థ ఖాతాలో పేరుప్రస్తావించక్కర్లేదన్న వెసులుబాటు ఇవ్వడం రాజకీయ పార్టీలకు వరంలా మారింది. 2019 సంవత్సరంలో ఎస్‌బిఐ జారీచేసిన బాండ్ల విలువ 1716 కోట్లకు విస్తరించడం ఈ అక్రమ విరాళాలు ఎంతవరకు పాకిపోయాయో చెప్పకనే చెబుతోంది. నల్లధనాన్ని విరాళంగా ఇచ్చే కార్పొరేట్ సంస్థలు రాజకీయ పక్షాలను తమ గుప్పెట్లో వుంచుకొని రాజ్యాంగ చట్ట సవరణలు తమకు అనుకూలంగా చేయాల్సిందిగా పట్టుపట్టడం బహిరంగ రహస్యం. ఇప్పటికైనా పార్టీలు, ప్రభుత్వాలు ఈ అడ్డగోలు ధన సమీకరణను ఆపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
- సి.కనకదుర్గ, హైదరాబాద్