ఉత్తరాయణం

బిహార్ విషాదం.. ఓ గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాథమిక ఆరోగ్యం పట్టాలు తప్పితే ఎంతటి పెనుప్రమాదమో బిహార్‌లో తాజా ఉదంతం తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం దాదాపు ఒకేలా దయనీయ స్థితిలో ఉంది. దానిని సరిదిద్దడం, లోపాల్ని అధిగమించడం కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కర్తవ్యం. ఉదాసీనతతో ఉన్నా, అరకొర సంస్కరణలు చేసినా, అసలు సమస్యకి పొంతన లేని పరిష్కారాలు వెతుకుతూ కూర్చున్నా ఫలితం సున్నాయే. బిహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రాంతంలో ఈ సీజన్‌లో ఇప్పటికి 107 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా పౌష్టికాహార లోపంతో ఉన్నవారే. ఆడుతూ, పాడుతూ ఉన్న పిల్లలు హఠాత్తుగా మూర్ఛపోయి ప్రాణాలు కోల్పోతుండడం ఆ ప్రాంతంలో నాలుగైదేళ్ల క్రితం మొదలైంది. అప్పుడు కారణం శోధించగా అక్కడ విరివిగా పండుతున్న లిచీ పళ్ళను తిని పరగడుపున నిద్రపోవడంతో, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి మెదడు ప్రభావితమై వారు చనిపోయినట్టు తేలింది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలే బాధితులు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు ఆ సమస్య లేదు. రోగ లక్షణాలు కనిపించిన వెంటనే 10 శాతం గ్లూకోజ్ ఇంజక్షన్ నరాల్లోకి ఎక్కిస్తే బతికే చాన్స్ బాగా పెరిగినట్టు తేల్చారు. నిపుణుల సలహాలు పాటిస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో గత రెండేళ్లు ఆ తరహా మరణాలు తగ్గాయి. మళ్ళీ ఈసారి పెరగడంలో ప్రభుత్వపు ఉదాసీనత కనబడుతోంది. పిల్లలు లిచీ పళ్ళు తిన్నా, రాత్రిపూట భోజనం చెయ్యడం తప్పనిసరి అన్నది గట్టిగా ప్రచారం చెయ్యలేదు. పౌష్టికాహార లోపానికి దిద్దుబాట లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెనువెంటనే చెయ్యాల్సిన చికిత్సపై అవగాహన లేదు. ఫలితంగా వందలాది ప్రాణాలు గాలిలో కలిశాయి. చిన్నచిన్న జాగ్రత్తలను తీసుకొని ఉంటే చిన్నారులు బతికి ఉండేవారు. ఈ ఉదంతంతో నేర్చుకోవాల్సింది ప్రాథమిక ఆరోగ్యం పటిష్టం చెయ్యాల్సిన అవసరం గురించి. పౌష్టికాహార లోపం పెనుశాపమై, రోగ నిరోధక వ్యవస్థను నీరుగార్చి పిల్లలను అన్ని రోగాలకు అలుసుచేస్తుంది. చదువుపట్ల, ఎదుగుదల పట్ల తీవ్ర అవరోధంగా ఉంటుంది. కాబట్టి చిన్నారులు పౌష్టికాహార లోపానికి గురికాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా చూడాలి. రక్షిత మంచినీరు అందివ్వడమే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కేంద్రం జీడీపీలో ఒకటిన్నర శాతం కూడా ఆరోగ్యంపై ఖర్చుచెయ్యకపోవడం సిగ్గుచేటు. కేంద్రం, రాష్ట్రాలు ప్రజారోగ్యానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. బీమా ఆధారిత ఆరోగ్య సేవలు ఎంత విస్తృతపరిచినా, ప్రజలకు అందుబాటులో ప్రాథమిక వైద్యం లేకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏటేటా ఈ సీజన్‌లో విషజ్వరాలు ప్రబలుతాయి. ముఖ్యంగా మన్య ప్రాంతాలు విలవిలలాడుతుంటాయి. అక్కడి పిల్లల వసతి గృహాలు మృత్యుఘంటికలు మోగిస్తాయి. ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో, వివిధ శాఖల్ని సమన్వయ పరుస్తూ సన్నద్ధం కావాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఉపద్రవాన్ని ఎదుర్కొంటూనే, దీర్ఘకాలికంగా ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే చర్యలు చేపట్టాలి.
-డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం
వృద్ధులకు సామాజిక భద్రత ఏదీ?
దేశంలో ఎవరైనా నిస్సహాయులుగా ఉన్నారంటే అందుకు వ్యవస్థలు, పాలకుల వైఫల్యమే కారణం. ఆపన్నులను ఆదుకోవడానికి బదులు ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించడం క్షమార్హం కాదు. సామాజిక రక్షణ అనేది వృద్ధుల ప్రాథమిక హక్కుగా గుర్తించాలని ఓ వృద్ధాశ్రమాన్ని 2005లో సందర్శించిన సందర్భంగా అప్పటి రాష్టప్రతి ఏపీజే అబ్దుల్ కలాం చేసిన వ్యాఖ్యలు నేటికీ అక్షర సత్యాలుగా మిగిలిపోయాయి. సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ దేశవ్యాప్తంగా వయోవృద్ధుల పరిస్థితి దయనీయంగానే ఉంది. సమాజంలోని దివ్యాంగులు, వితంతువులు, ఇతర సామాజిక వర్గాలవారు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక ప్రకారం వృద్ధులకు సామాజిక రక్షణపరంగా మన దేశం 92వ స్థానంలో వుండడం నిజంగా సిగ్గుచేటు. జీవిత చరమాంకంలో ఆర్ధిక, అనారోగ్య సమస్యలు, కన్నబిడ్డల నిరాదరణ వంటివి వృద్ధుల స్థితిగతులను దుర్భరం చేస్తున్నాయి. సొంతంగా పనులు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో వారు ఇతరులపై ఆధారపడడం తద్వారా వారి చీత్కారాలకు గురవడం అత్యంత బాధాకరం. ఇక గ్రామీణ వృద్ధుల జీవితాలు గాలిలో దీపం చందాన తయారయ్యాయి. గత అయిదేళ్ళలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిబద్ధతతో, చిత్తశుద్ధితో చేపట్టిన పలు సామాజిక వికాస కార్యక్రమాల ఫలితంగా వృద్ధుల జీవనం కాస్తంత మెరుగైందన్న సదరు నివేదిక కేంద్ర ప్రభుత్వం వారి నిబద్ధతను చాటిచెబుతూనే మరొకపక్క చేరుకోవాల్సిన లక్ష్యాలు ఎంతో దూరంలో వున్నాయని స్పష్టం చేస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలలో సామాజిక భద్రతపరంగా కొంత మెరుగ్గా వుండడం ఆశాజనక పరిణామం. వృద్ధుల నిత్యావసరాలు తీరేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ఇతరచోట్ల వారికి అవసరమైన ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం, రైళ్ళు, బస్సులలో ఉచిత ప్రయాణం, ఉచిత అంబులెన్సు, వైద్య సౌకర్యాలు, పిల్లలు లేని వారికి ఉచితంగా అంత్యక్రియలు జరిపించడంతోపాటు వారికి మెరుగైన జీవన స్థితిగతుల కోసం ఒక పటిష్ట ప్రణాళికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, సమన్వయంతో అమలు చేయాల్సి వుంటుంది. ఉద్దేశ పూర్వకంగా తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేసే పిల్లలకు కఠినమైన శిక్షలు విధించాలి. ఇక, దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనను గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేసాయి. మోదీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు తక్షణం మోక్షం కల్పించడం ఎంతో అవసరం.
-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
యథేచ్ఛగా ఫిరాయింపులు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు బెల్లం చుట్టూ ఈగలు మూగిన చందాన అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికలు పూర్తయి నెల కాకుండానే స్వపక్షాన్ని వదిలి పదవులనాశిస్తూ అధికార పార్టీలోనికి నిస్సిగ్గుగా దూకేస్తున్నారు. అధికార పక్షం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీ మారుతున్నామని కొందరు నాయకులు చేస్తున్న ప్రకటనలు నమ్మశక్యంగా లేవు. వచ్చే ఐదేళ్ళు విపక్షంలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చునేకంటే అధికార పక్షంలోకి ఫిరాయిస్తే ఏదో ఒక పదవి దొరక్కపోతుందా? అన్న ఆశతోనే ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నది విస్పష్టం. ఇక ఎన్నికల సమయంలో నైతిక విలువలతో రాజకీయాలంటూ ఘనమైన ప్రకటనలు ఇచ్చే కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాక, ఆ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ‘ఆపరేషన్ ఆకర్ష్’ వంటి పేర్లతో విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పెద్దఎత్తున కొనుగోలు చెయ్యడం, అసలు విపక్షమే లేకుండా చెయ్యడం వంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నాయి. చట్టసభలలో ప్రశ్నించే గొంతు లేకుండా చెయ్యడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. ఇక అధికార పక్షం అధికార దుర్వినియోగానికి అంతే ఉండదు. ప్రశ్నించేవారు లేకపోవడం వలన నిరంకుశత్వం పెరుగుతుంది. ఫిరాయింపులను నిరోధించే చట్టం కాలం చెల్లినదై ప్రస్తుతం జరుగుతున్న విపరిణామాలను ఏమాత్రం నిరోధించలేకపోవడం, ఈ చట్టానికి తక్షణం సవరణలు చేపట్టాలన్న 2006 నాటి సుప్రీం కోర్టు ఆదేశాలు బుట్టదాఖలు కావడం దేశ ప్రజల దౌర్భాగ్యం.
- సి.సాయిప్రతాప్, హైదరాబాద్