ఉత్తరాయణం

తినని ధాన్యంతో తిప్పలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు ధాన్యం పంటకు ప్రసిద్ధి. ఈ జిల్లాల్లో పండిస్తున్న లక్షలాది టన్నుల ధాన్యాన్ని అన్నదాతలు సహా రాష్టవ్య్రాప్తంగా ఎవరూ తినకపోవటం దురదృష్టకరం. గోదావరి జిల్లాల్లో 9 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేస్తుండగా అందులో 7 లక్షల ఎకరాల్లో ‘ఎంటీ యు-3626’ అనే బొండాలు రకాన్ని పండిస్తున్నారు. దొడ్డురకం బియ్యాల్లో బొండాలు మరీ ముతకవిగా పేరుపొందాయి. ఈ కారణంగా ఈ బియ్యానికి ఏపీలో గిరాకీ లేదు. కేవలం కేరళ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రైతులు ఈ ధాన్యాన్ని పండిస్తున్నారు. చాలాకాలంగా సన్న రకాలైన సోనామసూరి, కర్నూలు సన్నాలు, నెల్లూరు మొలగొలకులు, బీపీటీ రకాల వరికి లేదా మధ్యస్తంగా ఉండే స్వర్ణ, కావేరి, తెల్లహంస రకాలకు జనం అలవాటు పడ్డారు. దీంతో బొండాలు రకం ఎగుమతి కోసం వేసే పంటగా మారింది. ప్రస్తుత దాళ్వా సీజన్‌లో తూర్పు గోదావరి జిల్లాలో 4.25 లక్షల ఎకరాల్లోను, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లోను దాళ్వా సాగుచేయగా అందులో 70 నుండి 80 శాతం బొండాలు రకం వేశారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం గోదావరి జిల్లాల్లో ఎకరానికి సగటున 48 బస్తాల దిగుబడి వస్తోంది. మొత్తం 29 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపుగా 20 లక్షల టన్నులు బొండాలు రకానికి చెందినదే. రెండేళ్ల క్రితం వరకూ కేరళ మార్కెట్‌లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉన్నా, అది ఇప్పుడు తగ్గటంతో వ్యవసాయశాఖ ఈ పంట వేయవద్దని రైతులను హెచ్చరించింది. పౌర సరఫరాలశాఖ కూడా రాష్ట్రంలో ఎక్కడా తినని వరి ధాన్యం పండించటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో బొండాల సాగును నిరోధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. పౌర సరఫరాల శాఖ బొండాలు రకాన్ని రేషన్ దుకాణాలకు పంపితే ఆ నెల సరుకు మొత్తం నల్లబజారుకు తరలిపోతుంది. రేషన్ కార్డుదారులు కిలో రూపాయకి బొండాల బియ్యం తీసుకొని వెంటనే 13నుండి 15 రూపాయలకు అదే డీలర్‌కు అమ్మేస్తున్నారు. ఆ బియ్యం కిలో 20 రూపాయలకు రైసు మిల్లులకు చేరి అక్కడ సన్నబియ్యంగా మరపట్టి అదే బియ్యాన్ని తిరిగి భారత ఆహార సంస్థకు కిలోకు 29 రూపాయలు చొప్పున అమ్మేస్తున్నారు. బొండాలు రకం బియ్యం ఆంధ్రలో ఎవరూ తినకపోయినా కేరళలో ఆనందంగా తినడానికి కారణం ఏమిటంటే ఈ రకం అన్నం కొద్దిగా తిన్నా ఆకలి తీరుతుందని, ఎక్కువసేపు అరగకుండా ఉండి పూటల తరబడి ఆకలి వేయదని ఆహార నిపుణులు అంటున్నారు. కేరళలో ఎక్కువమంది మత్స్యకార్మికులు ఉన్నందున వారు వేట సమయంలో ఈ అన్నం తింటారు. ఈ రకం బియ్యంతో ఎక్కువగా ఇడ్లీ నూక తయారుచేస్తారు. కేరళలో ఇటీవల డిమాండ్ తగ్గడంతో రైతులు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ధాన్యం మిల్లుల యజమానులు సైతం వీటిని కొనడం లేదు. రైతులు ఆందోళన చెందటంతో ఇప్పుడు గోదావరి జిల్లాల కలెక్టర్లు ఈ ధాన్యం దిగుబడుల్లో కనీసం 50 శాతం కొనేలా మిల్లు యజమానులపై ఒత్తిడి తెచ్చారు. అధిక దిగుబడుల కారణంగానే ఈ రకాన్ని రైతులు సాగుచేస్తున్నారని, ఇప్పుడు అందరూ తినే సన్నరకాల్లో కూడా అధిక దిగుబడులు ఇచ్చే రకాలు వచ్చాయని, అందువల్ల రైతులు పంట మార్పిడికి సిద్ధపడాలని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ కె.ఎస్.వి.ప్రసాద్ సూచించారు. బొండాలు రకాన్ని దాళ్వా (రబీ) పంట కాలంలో తప్ప సార్వా (ఖరీఫ్) పంట కాలంలో విత్తనాల కోసం తప్ప సాగుచెయ్యరు.
- పుట్టా సోమన్నచౌదరి, కాకినాడ
విద్యుత్ రేట్లు తగ్గించాలి
ఈమధ్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ బాగున్న గృహ విద్యుత్ మీటర్లను సైతం తొలగించి కొత్త స్కానింగ్ మీటర్లను ఏర్పాటు చేస్తోంది. విద్యుత్ కచ్చిత వినియోగాన్ని తెలుసుకొనేందుకు అంటున్న ఈ డిజిటల్ మీటర్లు ఇంట్లో విద్యుత్ వుందో లేదో తెలీపే చిన్న ఇండికేటర్ల నామమాత్రపు వాడకం కూడ లెక్కిస్తాయట. పాత మీటర్లతో చక్రం తిరుగుతూ ఫ్యాన్, కూలర్ వంటివి ఎంత కరెంట్ వినియోగించుకుంటాయో వినియోగదారులకు కనిపించేవి. కొత్త మీటర్లలో ఆ సౌకర్యం లేదు. ఇక ప్రీ పెయిడ్ చెల్లింపుల అవసరమేముంది? గడువులో బిల్లు చెల్లించలేని వినియోగదారుల వద్దనుండి భారీగా అపరాధ రుసుము వసూలు చేస్తున్నారు. కొత్త మీటరుతో నెలకు ఐదారు యూనిట్లు ఆదా అవుతుందేమో. ఏనుగులు దూరే కంతను వదలి, చీమలు దూరే కంతను మూసినట్లు అంతగా అవసరం లేకపోయినా కోట్లాది రూపాయలు వెచ్చించి కొత్త విద్యుత్ మీటర్లను కొనుగోళ్లు చేశారు. అధిక ధరలకు ప్రైవేటు సంస్థల నుండి విద్యుత్ కొనుగోలు చేసి, ఆ భారం ప్రజానీకంపైనే మోపుతున్నారన్న ఆరోపణలు వున్నాయి. ఎగువ శ్లాబు రేట్లు తగ్గించకపోగా నెలకు 200 యూనిట్లు దాటిన గృహ వినియోగదారులపై రెట్టింపుచార్జీలు (రూ. 7 నుంచి 8వరకు) వసూలు చేస్తున్నారు. పొరుగున వున్న ఒడిశాలో నెలకు 200-400 యూనిట్ల వాడకంపై యూనిట్‌కి 5.30 రూ. మాత్రమే వసూలు చేస్తున్నారు. 200 యూనిట్లు పైగా వాడుతున్న ప్రజలంతా సంపన్నులు కాదు, సామాన్యులే అధికం. వేడెక్కిపోతున్న వాతావరణంలో ఫ్యాన్లు, కూలర్ల వాడకం పెరిగిపోతూ వుంది. నెలకు 200 యూనిట్లు దాటిన గృహ విద్యుత్ వినియోగంపై మోపిన చార్జీల భారాన్ని సహేతుకంగా తగ్గించి సామాన్య ప్రజానీకానికి ఉపశమనం కలిగించాలి.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట