ఉత్తరాయణం

రసాయన ఎరువులతో ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ వ్యవసాయ ప్రధాన దేశం. మన దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం ప్రధాన పాత్ర వహిస్తోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు వ్యవసాయం ప్రకృతి పద్ధతులతో మొదలయ్యింది. తర్వాతి కాలంలో అనేక కొత్త విధానాలు, కొత్త పంటల రకాలు, వాటిలో అధిక దిగుబడి నిచ్చే సంకరాలు సాగులోకి వచ్చాయి. పంటలకు వచ్చే తెగుళ్ళ నివారణకు వివిధ రసాయనాల వాడకం మొదలయ్యింది. దానితో ఆగిపోకుండా అధిక దిగుబడి ఆశతో అశాస్ర్తియమైన సేద్య విధానాలను అవలంబిస్తూ రైతులు వాటికి వచ్చే చీడ పీడల నివారణకు ఎరువులను అధిక మోతాదులో వాడడంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈ రోజు ఏ ఆహార పదార్థం తీసుకోవాలన్నా వంద సార్లు ఆలోచించి వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారతదేశంలో 2016-17వ సంవత్సరానికి గాను నాలుగు కోట్ల టన్నుల రసాయన ఎరువులు ఉత్పత్తి అయ్యాయంటే వీటి వినియోగం ఏ స్థాయిలో వుందో మనం ఊహించుకోవచ్చు. ఇవి సరిపోవనట్లు 88 శాతం మేరకు డై అమ్మోనియా ఫాస్పేట్ (డిఎపి)ను కెనడా, రష్యా, అమెరికా, జోర్డాన్, మొరాకో వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. పంటలకు మోతాదును మించి ఎరువులను వాడడంతో వాటి రసాయనిక అవశేషాలు ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇలా ఒకటేమిటి? మనం రసాయనాలనే తింటున్నామని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీంతో పలురకాల భయంకర, దీర్ఘకాలిక, వైద్య విజ్ఞానానికే అంతుచిక్కని ఎన్నో రోగాలు మానవాళిని ఆవహిస్తున్నాయి. సాధారణంగా పంటలకు 4:2:1 నిష్పత్తిలో నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను అందించాల్సి వుండగా అత్యధిక దిగుబడి ఆశతో స్వల్పకాలిక ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని వాటిని దేశ వ్యాప్తంగా 8:2:9 నిష్పత్తిలో వాడుతున్నారంటే రసాయన కాలుష్యం జీవజాతి మనుగడను ఎంతగా కబళిస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రైతులలో ఈ అంశంపై అవగాహనా రాహిత్యం, నిరక్షరాస్యత, ఎరువుల వినియోగాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం, రైతులకు సరైన మార్గదర్శనం చేసే విధానాలు లోపించడం, వ్యవసాయ రంగానికి సమస్యగా మారింది. పర్యావరణ హిత వ్యవసాయం- భూమిలోని స్థిరత్వాన్ని, భూమిలో వుండాల్సిన జీవ సమతుల్యాన్ని పెంచుతుంది. కానీ ఈ రోజు వ్యవసాయంలో స్వల్పకాలిక లాభాల ఆశ పెరిగి ఎడాపెడా రసాయన ద్రావకాలను ఉపయోగిస్తుండడంతో భూమిలో అసమతుల్యం ఏర్పడి పంటల్లో పోషక లోపాలు ఏర్పడుతున్నాయి. కొండనాలుకకు మందేస్తే వున్న నాలిక వూడిన చందంగా వ్యవసాయ భూముల్లో ఒక లోపం సవరించేందుకు రసాయనాలు వాడితే, అది పూర్తిగా పంట భూముల సారానే్న నష్టం చేస్తోంది. మన దేశంలో వందకుపైగా ఎనభై వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం వున్న బయోఫెర్టిలైజర్ల కంపెనీలు వున్నా ఇరవై వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరగడం ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. తెలుగు రాష్ట్రాలలో అయితే రసాయన ఎరువుల విస్తృత వినియోగంతో పంట పొలాల్లో కార్బన్, జింకు లోపాలతో పంట దిగుబడి మీద దెబ్బతీస్తోంది. ఈ ద్రావకాల వినియోగం వలన వ్యవసాయ భూముల్లో సూక్ష్మ పోషక లోపాల ఏర్పడే వ్యవసాయానికి, ఉద్యాన పంటలకు అడ్డంకిగా మారి పంట దిగుబడి రాక రైతు ఆర్థికంగా దెబ్బతింటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళుతెరిచి సేంద్రియ ఎరువుల పట్ల, పర్యావరణ హిత వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తే తప్ప విషతుల్య రసాయనాల వినియోగానికి స్వస్తి పలికే అవకాశం వుండదు.
-సి.కనకదుర్గ, హైదరాబాద్
కప్పగంతులు సిగ్గుచేటు
‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ’ అన్నట్టు ఒక పార్టీలో ఉన్నత పదవులనలంకరించి, అనేక విధాలుగా లబ్ది పొంది, అదే పార్టీ కష్టాల కడలిలో కొట్టుకొనిపోతుంటే- పార్టీ ప్రతిష్టను నిలబెట్టే ప్రయత్నం చేయక.. మరో బలమైన పార్టీలో చేరడం ప్రజలను అవమానించడమే అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన శాసనసభ్యులు, ఏపీలో తెదేపాకు చెందిన రాజ్యసభ సభ్యులు వరుసగా అధికార తెరాసలోకి, భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించారు. ఈ చర్య సంబంధిత నాయకులకు అవమానకరంగానూ లేకపోయినా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కొందరు తెలుగుదేశం ఎమ్.ఎల్.ఏలు కూడా బి.జె.పి. బాట పట్టనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ దేశంలో నీతి నియమాలు లేనివి ఒక్క రాజకీయాలు మాత్రమేనని అందరూ అంటున్న మాట నిజమేననిపిస్తోంది.
-డా.ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్
ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి
చట్టసభల ప్రతిష్టను పెంచాలంటే శాసనసభ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజాసమస్యలపై చర్చించి, జనం కోర్కెలను తీర్చాలని నేతలకు ఓట్లేసి పంపుతున్నారు. అది మర్చిపోయి నేతలు ఒకరినొకరు నిందించుకుంటూ పోవటం సరైన పద్ధతి కాదు. ఏపీ శాసనసభలో స్పీకర్‌ను ఎన్నుకున్న రోజునే అధికార, విపక్షాలు పరస్పరం నిందించుకున్నారు. ఇలా నిందించుకోవడానికి శాసనసభ వేదిక కాదు. ఎమ్మెల్యేలు ఒకరినొకరు అసభ్యంగా మాట్లాడటం, కించపరచుకోవటం పద్ధతి కాదు. ప్రజలందరికీ ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలి. కులమతాలకు శాసనసభ చర్చల్లో స్థానం ఉండరాదు.
-జి.శ్రీనివాసులు, అనంతపురము