ఉత్తరాయణం

పొదుపు పథకాలపై కోతలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుండి ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా బ్యాంకులు, పోస్ట్ఫాసులు సామాన్యుల పొదుపు డిపాజిట్లపై క్రమంగా వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోని వడ్డీలతో పోల్చి, కార్పొరేట్ వర్గాల వత్తిడితోను, మన దేశం ఆర్థికంగా ఎదిగిందని ఇలా తగ్గిస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ సంస్థల్లో పొదుపు చేసుకునే వారిలో సంపన్నులకంటే వ్యాపార వ్యవహారాలు తెలియని, పెన్షన్లు, వైద్య సౌకర్యాలు లేని రిటైర్డ్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, భవిష్యత్తు కోసం డబ్బు దాచుకునే సామాన్య ప్రజానీకమే అధికం. తగ్గిపోతున్న ప్రభుత్వ వడ్డీలు, మరోవైపు పెరిగిపోతున్న జీవన వ్యయం, వైద్య ఖర్చులు తట్టుకోటానికి అధిక వడ్డీల ఆశతో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది సామాన్య ప్రజానీకం నష్టపోతున్నారు. మరోవైపు ‘కూచమ్మ కూడబెడ్తే మాచమ్మ మాయం జేసింద’న్న సామెతలా బ్యాంకుల్లోని ఈ ప్రజల సొమ్ము చౌక రుణాల పేరున తీసుకొని తిరిగి చెల్లించని మొండి బాకీల్లో కార్పొరేట్ పెద్దలదే అతి పెద్ద వాటా.
నాడా దొరికిందని గుర్రాన్ని కొన్న సామెతలా పట్టణాల్లో చౌక రుణాల వ్యామోహంతో బాగున్న ఇళ్లను సైతం కూల్చివేసి, కొద్దిపాటి స్థలంలో బహుళ అంతస్థులు నిర్మించటం, నిర్మాణ ఖర్చులు అనూహ్యంగా పెరిగి, ఇంటి అద్దెలు సక్రమంగా అందక, బ్యాంకుల కిస్తీలు కట్టలేక ఎన్నో గృహాలు వేలానికి రావటం తరచూ వార్తలు రావడం చూస్తున్నాం. అపార్ట్‌మెంట్ల పేరుతో పది మంది వుండే స్థలంలో వంద మంది నివసిస్తున్నారు. ఇసుక వాడకం కూడ పర్యావరణానికి హాని చేసే విధంగా పెరుగుతోంది. ఈ చౌక రుణాలను గ్రామీణ ప్రాంతానికి విస్తరిస్తే ఉత్పత్తి రంగాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటివి వృద్ధి చెందుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు, ఇతర విదేశీ సంస్థల రుణాల బదులు స్వదేశీ బ్యాంకు రుణాలు తీసుకుంటే ప్రజలకు, దేశానికి మంచిది. డాలర్‌తో రూపాయి విలువ పెరుగుతుంది. ఉదారంగా బడాబాబులకు ఇచ్చే రుణాలు తగ్గిస్తే అసలు భద్రంగా వుంటుంది. ఇక డిపాజిట్లపై వడ్డీ విషయానికొస్తే ఐటీ, రియల్ ఎస్టేట్ వంటి రంగాల వృద్ధితో తలసరి ఆదాయం పెరుగుతుండవచ్చు. కాని అందరి ఆదాయం మాత్రం పెరగటం లేదు. తలసరి ఆదాయమేగాక వ్యక్తుల ఆదాయాన్ని కూడ పరిగణనలోకి తీసుకోవాలి. నేటికీ బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాల్లోని గ్రామీణ కుటుంబాల ఆదాయం కూడ నెలకు ఐదారువేల రూపాయలు మించటం లేదని ఈమధ్య ఒక సర్వేలో తేలింది. కనుక ఆర్థిక గణాంకాలతో కాకుండా పెరిగిపోతున్న జీవన వ్యయం, పెరగని ఆదాయం దృష్ట్యా సామాన్యులకు చెందిన చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ పెంచాలి. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవడం, ఎక్సైజ్ సుంకాన్ని హేతుబద్ధంగా తగ్గించటం వంటి చర్యల వల్ల ఎటువంటి ప్రభుత్వ సబ్సిడీలు అందుకోలేని, ఆశించని ప్రజానీకానికి ప్రయోజనం కలుగుతుంది. వీటిలో భారీ ప్రాజెక్టులు, ప్రజాకర్షక పథకాల్లో జరిగినట్టు వేల కోట్ల రూపాయల అక్రమాలకు, అయాచిత లబ్దికి ఎటువంటి ఆస్కారం ఉండదు. కనుక ప్రభుత్వాలు ఆ దిశగా కూడ ఆలోచించాలి.
-టీసీ సాంబశివరావు, నర్సరావుపేట
అందరికీ ఆమోదయోగ్యంగా కొత్త జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తజిల్లాల ఏర్పాటు విషయం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నవ్యాంధ్రలో 13 జిల్లాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగించిన సమయంలో కొత్తజిల్లాల ఏర్పాటు ఊసే కనిపించలేదు. గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీల మేరకు ఎంపీ నియోజకవర్గాల ప్రాతిపదికగా కొత్తజిల్లాల ఏర్పాటు జరుగుతుందని, ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైందనీ వార్తలొస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రానే్న జిల్లా కేంద్రంగా మారుస్తారా? ఆ నియోజకవర్గంలో అన్ని వౌలిక సదుపాయాలూ వుండి, అందరికీ అనుకూలంగా వుండే పట్టణాలను జిల్లా కేంద్రంగా మారుస్తారా? అన్నది ప్రస్తుతం అందరి మనసులనూ తొలచివేస్తున్న ప్రశ్న. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలుగా వున్నాయి. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జిల్లా కేంద్రంగా ఉన్న అనంతపురం నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మంట్లు ఉంటాయి. ఇక హిందూపురానే్న జిల్లా కేంద్రంగా చేస్తారా? వేరే పట్టణాన్ని చేస్తారా? అన్నది ప్రశ్నార్థకం. హిందూపురం పార్లమెంటు పరిధిలో కదిరి, ధర్మవరం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సత్యసాయి బాబా ఆధ్యాత్మిక నిలయమైన పుట్టపర్తి కూడా వుంది. హిందూపురానే్న జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా వుంటుందా? అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం వుంది. హిందూపురం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో వుంది. దాంతోపాటు కదిరి, ధర్మవరం రెవెన్యూ డివిజన్లకూ దూరం అయ్యే పరిస్థితి కూడా వుంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల పూర్తి స్థాయిలో కర్ణాటక సరిహద్దు ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం వుంది. కానీ ఆ జిల్లాలో కొనసాగే ఇతర ప్రాంతాలు పెద్దగా అభివృద్ధి చెందే అవకాశం వుండదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం హిందూపురంలో తాగడానికి కూడా నీటి ఎద్దడి తీవ్రత అధికంగా వున్న ప్రదేశంగా పేరొందింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం వున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయడం కన్నా- అన్ని ప్రాంతాలకు మధ్యలో వుండి అంతర్జాతీయ గుర్తింపు పొందిన పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా వుంటుంది. ముఖ్యంగా పుట్టపర్తిలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్, యూనివర్సిటీ, అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన జరిగే విద్యాలయాలు, మ్యూజిక్ కళాశాల, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలు, ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ అసుపత్రులున్నాయి. అనంతపురం జిల్లా నుంచి విమాన ప్రయాణాలు కొనసాగించుకోవాలనుకునేవారు ఎక్కువగా బెంగుళూరు నగరానికి వెళ్ళాల్సి వుంది. అదే పుట్టపర్తిలోని విమానశ్రయాన్ని రాబోవు రోజుల్లో జాతీయ స్థాయి విమానశ్రయంగా ఏర్పాటుచేసుకుంటే విమాన ప్రయాణం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరమూ తీరిపోతుంది. పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఆధీనంలో వుండటంతో కొంతవరకు పరిశీలించాల్సిన అవసరం వుందనుకున్నా విమానాశ్రయ ప్రాంతంలో సుమారు 500ల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. ఆ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. పుట్టపర్తికి దగ్గరలోనే గొల్లపల్లి, మారాల రిజర్వాయర్లు వున్నాయి. వాటి నుంచి పుట్టపర్తికి కూతవేటు దూరంలో వున్న బుక్కపట్నం చెరువులోకి నీళ్ళను నింపుకోవడం వల్ల పుట్టపర్తితో పాటు ఆ చుట్టుపుక్కల గ్రామాల రైతన్నలకు కూడా నీటి కష్టాలుండవు. ప్రధాన నగరాలకు మించిపోని విధంగా సదుపాయాలున్న పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఎందుకు ఏర్పాటు చేయకూడదన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం వుంది. కొత్త జిల్లా ఏర్పడ్డాక ఆ జిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నింటికీ అనుకూలంగా వుంటుందా? వౌలిక సదుపాయాలు వున్నాయా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుని కొత్తజిల్లాల ఏర్పాటు జరగాలి.
-నల్లమాడ బాబ్‌జాన్ 85000 83799