ఉత్తరాయణం

నీటి సంరక్షణే ప్రాధమ్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటిఎద్దడి శరవేగంగా విస్తరిస్తున్న దేశం మనది. పట్టణాలు, పల్లెలు నానాటికీ ‘నిర్జల ప్రదేశాలు’గా మారిపోతున్నాయి. వర్షాకాలం వచ్చినా చెన్నై పట్టణానికి రైళ్లలో మంచినీరు సరఫరా చేయాల్సి వస్తోందంటే నీటి కొరత ఎంత తీవ్రరూపం దాల్చిందో అవగతమవుతుంది. రానున్న రెండేళ్లలో మరో ఇరవై ఒక్క పట్టణాలు ఇదే బాట పట్టనున్నాయని అధికారిక నివేదికలు ఘోషిస్తున్నాయి. ఒకవైపు అస్సాంలో వరదలతో, నీటి ముంపుతో ప్రజలు అల్లాడుతుండగా, మరోవైపు తెలుగు రాష్ట్రాలు సహా అనేక ప్రాంతాలలో నీటి ఎద్దడితో జనం గొంతెండిపోవడం గమనార్హం. మంచినీటికి కటకట లాడే పరిస్థితికి చేరడం భారతదేశానికి ప్రకృతి శాపం కాదు. ఇది ముమ్మాటికీ మానవ తప్పిదం. మన నిర్లక్ష్యం, అజ్ఞానం వల్లనే ఈ దుస్థితి అనివార్యమైంది. వ్యక్తిగత స్థాయిలో సమూహ స్థాయిలో నీటి వినియోగంలో ఏ మాత్రం శ్రద్ధ, అవగాహన లేకపోవడంతో త్వరత్వరగా విలువైన జలవనరులను నష్టపోతున్నాం. నిజానికి భారతదేశానికి మంచినీటి ఎద్దడి రాకూడదు. వర్షపాతం మామూలు స్థాయిలో ఉన్నా ప్రజల అవసరాలకు నీరు సరిపోతుంది. మనకు వర్షపాతం ద్వారా 4వేల బిలియన్ క్యూబిక్ మీటర్లు సమకూరుతుంది. అయితే బాధ ఏమిటంటే అందులో 8 శాతం మాత్రమే దాచుకోగలుగుతున్నాం. అంటే కేవలం 360 బీసీఎం. మిగతాదంతా సముద్రం పాలవుతోంది. చెరువులు, కుంటలను పునరుద్ధరించడంతోపాటు ఉన్న వాటిని కబ్జాకాకుండా చూడాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నీటి సముదాయాల్ని కాపాడాలి. ప్రతి కట్టడానికీ నీటి నిల్వ స్థలాలు, ఇంకుడు గుంతలు తప్పనిసరి చెయ్యాలి. భూగర్భ జలాల్ని విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నాం. వ్యవసాయానికి అవసరానికి మించి నీటి వాడకం జరుగుతోంది. శాస్ర్తియ పద్ధతుల్లో నీటిని పొదుపుగా వాడేలా రైతులకు పరిజ్ఞానం, పనిముట్లు అందించాలి. 1950లో తలసరి నీటి లభ్యత 5వేల క్యూబిక్ మీటర్లుండగా నేడు అది 1400 క్యూబిక్ మీటర్లకు దిగజారింది. అంత వేగంతో జలం అంతరించిపోతున్నప్పుడు అంతకన్నా వేగంగా సమాజం స్పందించాల్సి ఉంది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని కేవలం ప్రభుత్వం ఎదుర్కొనలేదు. ప్రజల్ని చైతన్యపర్చడం ద్వారా మార్గనిర్దేశం చెయ్యడం ద్వారా ప్రభుత్వం కీలక పాత్ర పోషించగలదు. ప్రధాని మోదీ ‘రానున్న రెండు మూడేళ్లలో హర్ ఘర్ జల్ అంటూ అందరికీ మంచినీటిని పైపుల ద్వారా అందిస్తామ’ని చెప్తున్నారు. నీటి ఎద్దడి ఇలానే కొనసాగితే ప్రధాన పట్టణాలకు కూడా ‘హర్ ఘర్ జల్’ సాధ్యం కాదు. నీటి సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ కదలాలి. ఇప్పటికే చాలా ఆలస్యం జరగడంతో పరిస్థితి విషమించింది.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
విద్యారంగంపై నిర్లక్ష్యం
మానవ వనరుల అభివృద్ధిలో కీలక పాత్ర వహించే విద్యారంగానికి నిధుల కేటాయింపు గణనీయంగా పెంచాలని కొఠారి కమిషన్, సుబ్రహ్మణియన్ కమిషన్, విపిన్ పాటిల్ కమిషన్‌లు చేసిన సిఫార్సులు బుట్టదాఖలు అయ్యాయి. విద్యారంగానికి ప్రస్తుతం జిడిపిలో 2.9 శాతం నిధుల కేటాయింపు మాత్రమే జరుగుతుండగా, దీనిని కనీసం ఆరుశాతానికి పెంచాలని 2019 నూతన జాతీయ విద్యావిధాన ముసాయిదా సూచించింది. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కీలక సిఫార్సులను పట్టించుకోలేదనడానికి తాజా వార్షిక బడ్జెట్‌లో విద్యారంగానికి చేసిన కేటాయింపులే నిదర్శనం. విద్యారంగానికి రూ. 95వేల కోట్లు కేటాయించగా అది మొత్తం జిడిపిలో 1.9 శాతం, బడ్జెట్‌లో 3.4 శాతం మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు 1.0 శాతం తగ్గడం ఆందోళనకర పరిణామం. 110 దేశాలలో ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ అండ్ కో-ఆపరేషన్ డెవలప్‌మెంట్ సంస్థ చేసిన అధ్యయనంలోగ్రీస్ దేశం ఆరు శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తూ 82వ స్థానంలో వుండగా 1.9 శాతం నిధులతో భారత్ 97వ స్థానంలో నిలబడడం విచారకరం. అధ్యాపకుల కొరత, దిగజారుతున్న విద్యాప్రమాణాలు, వృత్తివిద్యలో లోపిస్తున్న నైపుణ్యం, వౌలిక సదుపాయాల కొరత ఇత్యాది కారణాలతో దేశంలో విద్యాసంస్థల పనితీరు అంతంతమాత్రంగా వుంటూ చివరకు ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయాల జాబితాలో భారత్ ఎలాంటి స్థానం సంపాదించుకోలేకపోవడం దురదృష్టకరం. విద్యార్థుల స్థూల నమోదు భారత్‌లో 25.8 శాతం వుండగా అత్యధికంగా అమెరికాలో 86 శాతం, రష్యాలో 81 శాతం, చైనాలో 49 శాతం వుంది. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాణాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
‘ఆయుష్’కి ఆయుష్షు పోయండి..
పేద ప్రజలకు సంప్రదాయ వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో రాష్ట్రాల్లో ‘ఆయుష్’ వైద్య సేవలను ప్రారంభించింది. ఒకేచోట ఇంగ్లీష్ వైద్యంతోపాటు, భారతీయ వైద్యం అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007వ సంవత్సరంలో 982 ఆయుష్ డిస్పెన్సరీలను పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు 587 వైద్యశాలను కేటాయించారు. 2012 జూలై నుంచి వీటికి నిధులు సక్రమంగా రావటం లేదని, ఖాళీలను భర్తీచేయాలని, కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పాలకులు ఆయుష్ శాఖను నిర్లక్ష్యం చేశారు. ఏపీలో అరకొర వైద్యులతో, వసతులతో ప్రస్తుతం 450 ఆయుష్ వైద్యశాలలున్నాయి. గత 5 సంవత్సరాలుగా వైద్యుల పోస్టులను భర్తీచేయకపోగా, సిబ్బందిని మిగతా వైద్యశాలల్లో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించడం విడ్డూరం. ఎస్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ, కాంపౌండర్లను రెండేళ్ల నుంచి తొలగించినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. వారు విధుల్లో వున్నారో లేరో తమకే తెలియదని ఆ శాఖ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని, బకాయి జీతాలు ఇవ్వాలని విజయవాడలో సుమారు 250 రోజులు నిరాహారదీక్ష, ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు ఆయుష్ శాఖలో ఎస్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ, కాంపౌండర్లను తక్షణమే విధుల్లోకి తీసుకొని వారి వేతన బకాయిలను చెల్లించాల్సి ఉంది. వయోపరిమితి దాటిపోయి ఏ ఉద్యోగానికి పనికిరామని, కుటుంబ పోషణ చాలా కష్టంగా వున్నదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఆయుష్ విభాగాల్లో సిబ్బందిని రెగ్యులర్ చేశారు. తెలంగాణలో ఆయుష్ శాఖకు పెద్దపీట వేసి నిధులు మంజూరుచేశారు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ సమస్యపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఆయుష్ శాఖ ఆదేశాల మేరకు డాక్టర్లు లేనిచోట కింది స్థాయి సిబ్బందిని విధులకు రావద్దని, వారికి వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్ లేదని సంబంధిత శాఖ చెబుతుండడం బాధాకరం.
-ఆర్.లలిత, దామెగుంట (చిత్తూరు జిల్లా)