ఉత్తరాయణం

నిరుద్యోగుల ఆశలు ఫలించేదెపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగ నియామకాలు భారీ స్థాయిలో జరుగుతాయని నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు రెండు లక్షలు పోస్టులను భర్తీచేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఆయన మాటలు నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి అడుగులు వేయడం హర్షణీయం.
ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన గ్రామ, పట్టణ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేసింది. వీటిద్వారా కొన్ని వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలు కాకపోవడం నిరుద్యోగులను కొంత నిరాశకు గురిచేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లోని శాశ్వత ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి పూనుకుంటే మరికొంత మంది నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. ఫలితంగా కొంతవరకైనా నిరుద్యోగిత తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యావ్యవస్థ సమూల ప్రక్షాళనకు నడుం బిగించినట్టు కనిపిస్తుంది.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలవైపు ఆకర్షించాలంటే వౌలిక వసతుల కల్పనతోపాటు సమర్థవంతమైన ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉంది. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతుల పిల్లలకు బోధించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఫలితంగా ఆ ఉపాధ్యాయుడు ఏ తరగతికీ న్యాయం చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇలాంటి పాఠశాలలను గుర్తించి వెంటనే ఉపాధ్యాయుల కొరత తీర్చాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 20వేల పైచిలుకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని గతంలో జగన్‌మోహన్ రెడ్డి వివిధ సందర్భాల్లో గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే వాటి భర్తీకి పూనుకుంటామని పలుమార్లు హామీలు కూడా ఇచ్చారు.
మరోవైపు ప్రతి ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు డిఎడ్, బిఈడీ కోర్సులను పూర్తిచేసుకుని కళాశాలల నుండి బయటకు వస్తున్నారు. ప్రభుత్వాలు సకాలంలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో వీరంతా రోడ్లపై తిరగాల్సిన దుస్థితి దాపురించింది. కొంతమంది నిరుద్యోగ ఉపాధ్యాయ పట్ట్భద్రులు ప్రైవేటు పాఠశాలలవైపు మొగ్గుచూపి పూట గడుపుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన అరకొర ఉపాధ్యాయ నియామకాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. గత డీఎస్సీలో జాప్యం వల్ల ఎంతోమంది నిరుపేద విద్యార్థులు ఆర్థికంగా చితికిపోయారు. కాబట్టి జగన్ ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచించి వెంటనే భారీ డీఎస్సీ ప్రకటన విడుదల చేయాలి. అన్ని ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీచేసి నిరుద్యోగుల కల నెరవేరేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయాలి. తద్వారా నిరుద్యోగ ఉపాధ్యాయ జీవితాల్లో వెలుగులు నింపాలి.

-బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూర్