ఉత్తరాయణం

జల సంరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి వనరుల్లో భాగమైన నీరు సకల జీవజాతికి ప్రాణాధారం. పంటలకు, మానవజాతి మనుగడకు జలవనరులు కీలకం. కానీ, మానవుడు తన అవసరాల నిమిత్తం నీటిని ఇష్టారీతిగా వినియోగిస్తున్నందున భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వాలు ఎంతగా నిధులు ఖర్చు చేస్తున్నా సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఋతుపవనాల అనిశ్చితి, ఉష్ణోగ్రతల్లో మార్పులు, జల సంరక్షణపై నిర్లక్ష్యం కారణంగా నీటి ఎద్దడి రానురానూ జటిలమవుతోంది. వర్షాభావ పరిస్థితులతో బావులు, చెరువులు, బోర్లు ఎండిపోవడం సర్వసాధారణమైంది. సమృద్ధిగా వర్షాలు కురవనందున వేసవితో పాటు మిగతా కాలాల్లోనూ మహిళలు మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం బిందెలను మోసుకువెళ్లాల్సిన దుస్థితి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కునే పరిస్థితి తప్పడం లేదు. మహిళలు మంచినీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద, రహదారులపైన ఆందోళనలు చేస్తున్నారు. అభివృద్ధి పేరిట ఇష్టారీతిన అడవులను నాశనం చేయడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు జరిగి రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. ఫలితంగా నీటి వనరులు కనుమరుగైపోవడంతో భవిష్యత్ తరాలకు పెనుముప్పు పొంచి ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లోని సాంప్రదాయ నీటి వనరుల్లో భాగమైన బావులు, చెరువులు, వాగులు నేడు నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రబలుతున్న ఈ జల సంక్షోభానికి గల ముఖ్యకారణం నేటి నాగరిక మానవుడు అవలంబిస్తున్న నీటి వినియోగ పద్ధతులే అనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవవ్యకత ఎంతైనా ఉంది. సమగ్రమైన జల సంరక్షణ ద్వారా జల భద్రత చేకూరుతుందని ప్రచారం చేయడానికి ‘జలశక్తి అభియాన్’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి వర్షపునీటి బొట్టును ఒడిసి పట్టడానికి ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించాలన్నది ప్రభుత్వ సంకల్పం. మొదటి దశలో ఏటా జూలై 1 నుండి సెప్టెంబర్ 15 వరకు నైరుతి రుతుపవన సమయంలో, రెండవ దశలో అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ఈశాన్య రుతుపవనాల సమయంలో అవగాహన కల్పించాలనే బృహత్తర లక్ష్యాలతో ఈ పథకాన్ని నిర్దేశించారు. వృథాగా పోతున్న వర్షపు నీటి వినియోగం, సమర్థవంతమైన నీటి పొదుపు ప్రణాళికలు గురించి ప్రచారం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సాంప్రదాయ నీటి వనరులైన చెరువులు, బావులు, వాగులను పునరుద్ధరించి, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. భారీ స్థాయిలో వనీకరణ కార్యక్రమాలను చేపడుతూ, ప్రతి ఇంటి ఆవరణంలో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకొని నీటి వృథాను అరికడుతూ, నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని భావిస్తున్నారు. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు విద్యార్థులు, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, సామాజిక ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ఒక ప్రజా ఉద్యమంగా సుస్థిర నీటి సంరక్షణకు కృషి చేయాల్సి ఉంది. నీటిఎద్దడి ప్రాతమైన రాజస్థాన్‌లో అల్వార్ జిల్లాకు చెందిన రాజేంద్రసింగ్, మహారాష్టల్రోని రాలేగావ్ సిద్ధి ప్రాంతంలో అన్నాహజరే జల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని, ‘జలశక్తి అభియాన్’ను ఉద్యమంగా తీసుకువెళ్లి నీటి కరవుకు చరమగీతం పాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
-సంపతి రమేష్ మహారాజ్ 99595 56367
మరో కలికితురాయి
భారత అంతరిక్షరంగ చరిత్రలో మహా అద్భుతం ఆవిష్కృతమై, సుమారు 130 కోట్ల భారతీయుల గొప్పదనాన్ని చాటేలా ‘చంద్రయాన్-2’ నిర్ణీత కక్ష్యలోకి చేరడం ‘దేశ’ కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా అభివర్ణించవచ్చు. చంద్రునిపైకి మన దేశం చేపట్టిన ప్రతిష్టాత్మక రెండవ యాత్రలో తొలి అంకం విజయవంతం కావడం అభినందించదగ్గ విషయం. చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్తవ్రేత్తలకు అభినందనలు. శాస్త్ర సాంకేతిక రంగాలలో తనకు సాటిలేదని భారత్ మరోమారు నిరూపించింది. తాజా ప్రయోగంతో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 అద్భుతంగా పనిచేయడం, అనుకున్న దానికన్నా ఆరువేల కి.మీ. మేర కక్ష్యలో వ్యోమనౌకను ప్రవేశపెట్టడం చంద్రయాన్-2లో మంచి ఫలితాలు చేకూర్చే అంశాలుగా చెప్పవచ్చు. సంపూర్ణ దేశివాళీ నైపుణ్యంతో తయారుచేసిన ‘చంద్రయాన్-2’ విజయంతో ‘ఇస్రో’కే గాక ప్రతి భారతీయునిలో ఆనందాన్ని నింపింది. భవిష్యత్తులో ‘ఇస్రో’ మరెన్నో ఉపగ్రహాలను తయారుచేసి దేశ కీర్తిపతాకాన్ని ఎగరవేయాలని ఆశిద్దాం.
- కామిడి సతీష్‌రెడ్డి,జడలపేట
‘ఇస్రో’కు జేజేలు
ఎన్ని సవాళ్ళు ఎదురైనా మొక్కవోని దీక్షతో ‘ఇస్రో’ చంద్రయాన్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 వాహకనౌక ద్వారా విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పెట్టడం సంతోషించదగ్గ విషయం. ఇది మన దేశానికి గర్వకారణం. ఇంతవరకూ ఏ దేశమూ పరిశోధనలు చేయని చంద్రుని దక్షిణ ధృవ ఉపరితలం మీద పరిశోధనలు తలపెట్టడం మన శాస్తవ్రేత్తల ఆత్మవిశ్వాసాన్ని, వారి అమోఘమైన ప్రతిభను సూచిస్తాయి. మన శాస్తవ్రేత్తల తెలివితేటలు, నైపుణ్యాలు ప్రపంచంలోని ఏ దేశ శాస్తవ్రేత్తలకూ తీసిపోవని మరోసారి నిరూపితమైంది. ప్రభుత్వరంగ సంస్థల పనితనం బాగాలేదనే అపవాదు పటాపంచలు చేసి, ప్రపంచంలోనే మేటి అంతరిక్ష పరిశోధనా సంస్థలైన నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకే గట్టి పోటీనిచ్చే సంస్థగా ఇస్రో ఎదగడం మన దేశానికి గర్వకారణం. ఇస్రోలోని పనితీరును నష్టాల్లో ఉన్న ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లో అమలుపరచడంవల్ల వాటి సామర్థ్యాన్ని పెంచి ఆ ప్రభుత్వరంగ సంస్థలను లాభాల బాటలో నడిపించవచ్చు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
- మేజారి మల్లికార్జన, నడిగడ్డ (చిత్తూరు జిల్లా)
ఘనం... చంద్రయానం
భారత్ కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేస్తూ చంద్రయాన్-2 దిగ్విజయంగా మొదలైంది. సంక్లిష్టమైన, పూర్తి దేశీయ తయారీ జీఎస్‌ఎల్వీ మార్క్‌త్రీ క్రయోజనిక్ ఇంజనుతో విజయవంతంగా రాకెట్‌ని అంతరిక్షంలోకి పంపడంతో ఇస్రో శాస్తవ్రేత్తల ఘనత ప్రపంచానికి పరిచయమైంది. ఇది భారత శాస్త్ర సాంకేతిక రంగానికి ఘన విజయం. చరిత్రాత్మక ఘట్టం. ఈ ప్రయోగం ద్వారా చంద్రుణ్ణి చేరే దేశాల్లో నాలుగవదిగా భారత్ నిలిచింది. మిగతా మూడు అగ్ర దేశాలకన్నా భారత్ తన రోదసి పరిశోధనలకై, ఇస్రో సంస్థకు కేటాయించిన బడ్జెట్లు చాలా తక్కువే. కేవలం వాటికన్నా ఇరవై శాతం మాత్రమే నిధులు పొంది, అత్యున్నత ప్రమాణాలు సాధించడం మన శాస్తవ్రేత్తల ఘనత. ఈమధ్యనే విడుదలైన హాలీవుడ్ సినిమా అవెంజర్స్‌కి ఖర్చుపెట్టిన దానికన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్-2 సాధ్యం చేశారంటేనే మన శాస్తవ్రేత్తలెంత అసాధ్యులో కదా! ఈ ప్రయోగానికి మహిళా శాస్తవ్రేత్తలు నాయకత్వం వహించడం మరో మేలిమలుపు. ఆకాశాన్ని శోధించడంలో ఆకాశంలో సగంగా భావిస్తున్న మహిళలు ముందుండడాన్ని భారత్ సాధ్యం చేసింది.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం