ఉత్తరాయణం

కౌలురైతుల కన్నీరు తుడిచేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు వ్యవసాయం పెనుభారమై భూస్వాములు, మధ్య తరగతి రైతులు పట్టణాలకు వలసపోతూ జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలలో పుడమితల్లిని నమ్ముకొని, మరో ప్రత్యామ్నాయం లేనందున కౌలురైతులు మాత్రం వ్యవసాయాన్ని వదులుకోలేక పోతున్నారు. ఇప్పుడు కాకుంటే కొన్నాళ్లకైనా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు చేతికి అందివస్తాయన్న ఆశతో వీరు ఇతరుల భూములను కౌలుకు తీసుకొని కాలక్షేపం చేస్తున్నారు. అప్పోసప్పో చేసి కౌలు బకాయిలను భూకామాందులకు చెల్లిస్తున్నారు. ఇంటిల్లిపాదీ కాయకష్టంతో సాగుకు పూనుకోవడం కౌలురైతుల సాహసానికి నిదర్శనం. కౌలురైతులు పంట ఉత్పత్పులను విక్రయించేందుకు మాత్రమే అర్హులు. తాము సాగుచేస్తున్న భూములపై వారికి చట్టపరమైన ఏ హక్కు ఉండబోదు. భూస్వాములు కౌలురైతులకు చట్టపరమైన హక్కుల పత్రాలను రాసి అందజేస్తే భవిష్యత్తులో కౌలుదారులే భూహక్కును పొందే వీలుందనే అపోహలతో వారికి పత్రాలను ఇవ్వకుండా కాలహరణం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అలాంటి ముప్పేమి భవిష్యత్తులో రాబోదని ఎన్ని హితవులు పలికినా భూస్వాములకు మాత్రం బెరకుగానే ఉంది. ప్రభుత్వం భూస్వాములకు ఎంత భరోసా ఇచ్చినా వారిలో మాత్రం స్పందన కరువైంది. కౌలురైతులకు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టవు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం భూస్వాముల ఖాతాలలో జమకావడంతో- పంటలు పండించేందుకు ఆరుగాలం కష్టపడిన కౌలురైతులు ఉసూరుమంటూ నిట్టూర్చాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. బ్యాంకులలో రుణాలు లభించనందున వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి సాగుకోసం పెట్టుబడులు పెట్టే వీరి పరిస్థితి- ‘అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకే సరిపోయిందనే’ చందాన ఉంటుంది. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు, బిడ్డల పెళ్లిళ్లు వీరికి భారమే. భూమిని కౌలుకు ఇచ్చినంత మాత్రాన భూస్వామి హక్కులకు ఎలాంటి ఆటంకం ఉండదని, కౌలు రుసుం, పంట ఉత్పత్తే కౌలుదారులకు అందుతుందని ప్రభుత్వం నచ్చజెప్పాలి. ఈమేరకు ప్రభుత్వాలు కౌలుచట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. పంట దిగుబడుల పెంపుపై ప్రభుత్వాలు కనబరిచిన శ్రద్ధలో కొంచెమైనా కౌలురైతుల ఆదాయాలపై లేకపోవడం వల్లే సమస్యలు ముమ్మరించాయి. దళారీ వ్యవస్థే పంట ఉత్పత్తులకు ధరలను నిర్ణయిస్తున్నందున రైతులు నష్టపోతున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయినప్పుడు కూడా భూస్వాములు కౌలురైతు నుంచి అందాల్సిన రొక్కం ముక్కుపిండి వసూలుచేసుకొంటాడు. పంట నష్టపోయిన తర్వాత కౌలురైతులు ఇంటిల్లిపాదీ పస్తులుండడమో, తిరిగి కొత్త అప్పులకు వెంపర్లాడడమో తప్పితే మరోదారి లేదు. రైతులకు కౌలుదారీ పట్టాలిప్పించి బ్యాంకుల ద్వారా రుణ సహాయం, ప్రకృతి విపత్తుల సమయంలో వారి ఖాతాలో ఆర్థిక సాయం జమయ్యేలా చూడడం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సబ్సిడీ ధరలకు పంపిణీ చేయడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. కౌలురైతులు పచ్చగా పది కాలాలపాటు ఉండేలా ప్రభుత్వం అన్ని రకాలుగా వెసులుబాట్లు కల్పించాలి.
-దాసరి కృష్ణారెడ్డి, పుంగనూరు
వన్యప్రాణుల సంరక్షణ తక్షణ కర్తవ్యం
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా విడుదల చేసిన ‘పులుల గణాంకాల నివేదిక-2018’ప్రకారం మన దేశంలో పులుల సంఖ్య గత పుష్కర కాలంలో రెట్టింపవడం సంతోషించదగ్గ విషయం. ఈ ఘనతను సాధంచడంలో కృషిచేసిన కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు అభినందనీయులు. మన జాతీయ జంతువైన పెద్దపులికి సంబంధించి గణాంకాలు బాగానే ఉన్నా, మిగతా వన్యప్రాణుల సంఖ్యను పెంచడంలో, అంతరించిపోయే జంతువులను పరిరక్షించడంలో మనం విఫలమవుతున్నామనే చెప్పాలి. ఉదాహరణకి ఏనుగుల విషయం తీసుకుంటే 2015-2018 మధ్యలో కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే వివిధ కారణాలతో దాదాపు 373 గజరాజులు మృత్యువాత పడడం బాధాకరం. ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిన సమయంలో విద్యుద్ఘాతానికి గురై కొన్ని ఏనుగులు మరణిస్తే, రైళ్లు ఢీకొనడంతో మరికొన్ని, వేటగాళ్ళ బారిన పడి ఇంకొన్ని మరణిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి- అలిపూర్ ద్వార్ రైల్వే మార్గంలోనే రైళ్లను ఢీకొనడంతో గత ఎనిమిదేళ్ళలో 68 ఏనుగులు మరణించాయంటే ఇక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అభివృద్ధి ముసుగులో అడవుల విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతుండడం వల్ల ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో గనుల తవ్వకాల నిమిత్తం పెద్ద పెద్ద కంపెనీలకు అటవీ భూముల్ని ధారాదత్తం చేయడంలో అక్కడి నుండి ఈ జంతువులు వేరే ప్రాంతాల్లోకి తరలిపోవాల్సి వస్తోంది. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి మనుషుల్ని తొక్కి చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. గత మూడేళ్ళలోనే దాదాపు 1,700 మంది ఏనుగుల దాడిలో చనిపోయారంటే సమస్య తీవ్రత తెలుస్తుంది. ఈ విషయంలో గజరాజుల్ని తప్పు పట్టలేం. అలాగని ఆ ప్రజలదే తప్పని కూడా నిర్థారించలేం. ఏనుగులు ఆహారం కోసం పొలాల మీద పడి పంటలకు, పల్లెల్లో ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుండటం సర్వసాధారణం అయిపోయింది. పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసే విద్యుత్ వైర్లు ఏనుగుల పాలిట మరణ శాసనం రాస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు దగ్గర విద్యుద్ఘాతానికి గురై ఒక గున్న ఏనుగు మరణించింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని తగిన చర్యలు తీసుకొని ఇలా అంతరిస్తున్న జంతువులను కాపాడే దిశగాను, వన్యప్రాణుల నుంచి ప్రజలకు హాని జరగకుండా చర్యలు తీసుకోవాలి. కెన్యాలో రైతులు ఏనుగుల బెడద నుండి పంటలను కాపాడుకోవడానికి తమ పొలం చుట్టూ కంచెలో తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు. ఏనుగులు వచ్చి కంచెను కదల్చగానే తేనె తుట్టె కదిలి తేనెటీగలు లేచి ఏనుగులను కుట్టడంతో అవి వెనుదిరిగి అడవుల్లోకి వెళ్ళిపోతాయి. రైల్వే లైను ఉన్న ప్రాంతాల్లో అధునాతన సాంకేతికతను వాడి, సెన్సార్ల ద్వారా దగ్గర్లోని స్టేషన్‌కు కానీ, లోకో పైలట్‌కు కానీ ఏనుగుల సంచారం గురించి సమాచారం అందేలా చేయవచ్చు. ఏనుగులు ప్రమాదాల బారిన పడి మరణించకుండా, వాటివల్ల జనం ఇబ్బంది పడకుండా ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలి.
-మేజారి మల్లికార్జున, నడిగడ్డ (చిత్తూరు జిల్లా)