ఉత్తరాయణం

‘మగ పెత్తనం’ మారేదెపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఆడవారంటే వంటింటికే పరిమితం. ఆడపిల్లలను కనడానికి, వారిని చదివించడానికి చాలామంది దంపతులు అంత శ్రద్ధవహించేవారు కాదు. ఆడపిల్లకు పెళ్లి చేస్తే అత్తారింటికి వెళ్తుందని, అనవసర ఖర్చు ఎందుకనే భావన చాలా కుటుంబాల్లో ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా సామాజికంగా ఎన్నో మార్పులు.. విద్య, ఉద్యోగ రంగాల్లోనే కాదు, చట్టసభల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. ఆనాడు దేశంలో మొదటి మహిళా అధ్యాపకురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే మొదలుకొని, నేటి ఆధునిక సమాజంలో ఎందరో మహిళామణుల కృషి ఫలితంగా- స్ర్తిలు సాధికారత దిశగా దూసుకుపోతున్నారు. మగవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా మహిళలు అనేకానేక రంగాల్లో నైపుణ్యం చాటుకుంటున్నారు.
పాలనారంగంలోనూ మహిళలు రాణించాలన్న ఉద్దేశంతో వారికి స్థానిక సంస్థల పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీల్లో స్ర్తిలకు చట్టపరంగా రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. అయితే, చాలా చోట్ల పదవుల్లో ఉన్నది మహిళలే అయినప్పటికీ- వారి భర్తలు లేదా సంబంధిత కుటుంబాల్లోని పురుషులే అజమాయిషీ చెలాయిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన మహిళలు మాత్రం ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. ఈ పరిస్థితులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ల కారణంగా అవకాశం లేని పురుషులు తమకు బదులు తమ ఇళ్లలోని మహిళలను ఎన్నికల్లో నిలబెడుతున్నారు. గెలిచేది మహిళలే అయినప్పటికీ, పురుషుల పెత్తనమే కొనసాగుతోంది. పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ చైర్‌పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్లుగా ఎన్నికయ్యేందుకు మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ పదవులను తమ కుటుంబాల్లోని మహిళలకు దక్కేలా చేస్తూ, అధికారాన్ని కాపాడుకుంటున్నారు. చాలాచోట్ల పదవుల్లో ఉన్న మహిళలను సంతకాలకే పరిమితం చేసి, వారి స్థానాలలో భర్తలు లేదా ఆయా కుటుంబాల్లోని పురుషులు చక్రం తిప్పుతున్నారు. దీంతో రాజకీయ రంగంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినా, ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. కుటుంబాన్ని తీర్చిదిద్దే మహిళలకు సొంతంగా పదవులను నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, వారికి ఆ అవకాశం దక్కడం లేదు. ఇందుకు కారణం మగ పెత్తనమే అని చెప్పక తప్పదు.
రాజ్యాంగపరంగా మహిళలకు అవకాశాలిస్తూ, వాటిని మగవారు చేతుల్లోకి తీసుకోవడమా..! ఇది సరైన పద్ధతేనా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై ఇకనైనా దృష్టి సారించాలి. పదవుల్లో రాణించేందుకు మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ, వారు స్వతహాగా నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించాలి. ఈ దిశగా చర్యలు తీసుకోని పక్షంలో మహిళలకు పాలనావ్యవస్థలో రిజర్వేషన్లకు అర్థం లేదు. మన దేశంలో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఇందిరా గాంధీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోనియా గాంధీ, మేనకా గాంధీ, షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ, మాయావతి, ఉమాభారతి, వసుంధర రాజె, స్మృతి ఇరానీ, ప్రతిభాపాటిల్, సుమిత్రా మహాజన్ వంటి మహిళా నేతలు స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ రాణించిన మాట వాస్తవం కాదా? స్థానిక సంస్థల విషయానికొస్తే మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు, తమ నైపుణ్యం చాటుకొనేందుకు అవకాశం దక్కడం లేదు. పదవులు ఇస్తేనే చాలదు. పదవుల్లో ఉన్న మహిళలు తమ విధులను నిర్వహించుకొనేలా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇవ్వాలి. రాజ్యాంగం పరంగా వారి హక్కులను, స్వేచ్ఛను కాలరాయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
-డా. పోలం సైదులు 94419 30361
వ్యాధులతో జనం విలవిల
ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో ఎంతోమంది జనం ఆస్పత్రుల పాలవుతున్నారు. వాతావరణంలో మార్పు కారణంగా జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, చలిజ్వరాలతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్యం అందకపోవడంతో వ్యాధిగ్రస్తులు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇదే అదనుగా భావించి కొందరు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు వివిధ రకాల వైద్య పరీక్షల పేరిట అందినకాడికి దోచుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రైవేటు ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయి. ‘డెం గ్యూ’లాంటి ప్రాణాంతక వ్యాధులను తగ్గించే మందులు లేకపోవడం, రోగులకు తగినంతగా వసతి సౌకర్యాలు లేకపోవడం, వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలినందున ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సిబ్బందికి సెలవులను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా వైద్యులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వైద్య, ఆరోగ్య శాఖ ఇకనైనా మేల్కొని ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ నుంచి పేదవర్గాల వారికి విముక్తి కలిగించాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట