ఉత్తరాయణం

ఆశయాల ఆచరణ మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జాతిపిత’ మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలంగా నిర్వహిస్తోంది. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన ఘన చరిత్ర గురించి ఇపుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన ఆశయాలను ప్రచారం చేయడం ద్వారా నేటి తరానికి, రాబోయే తరాలకు గాంధీ సిద్ధాంతాలు ఆదర్శం కానున్నాయి. నాడు మహాత్మాగాంధీ బ్రిటీష్ పాలకులను ఈ దేశం నుంచి పారద్రోలడానికి అహింసనే ఆయుధంగా, శాంతి మార్గాన్ని మన జాతికి అందించారు. ఈ మార్గాల ద్వారానే యావత్ భారతివనిని ఒక తాటిపైకి నడిపించి దేశ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. నేటి నాగరిక వ్యవస్థలో కూడా అనేక దేశాలు గాంధీ అనుసరించిన శాంతి మార్గమే శరణ్యం అని ఘోషిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సైతం స్పందించి 2007 అక్టోబర్ 2నుంచి గాంధీ జయంతిని ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా గుర్తించింది. బ్రిటన్ సహా అనేక దేశాల అధినేతలు వారి వారి రాజధాని నగరాల్లో గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. కానీ, మన దేశంలో అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు మహాత్ముని ఆశయాలను కేవలం ప్రచారం వరకే పరిమితం చేస్తూ ఆచరణ అనే విషయాన్ని గాలికి వదిలేయడం అత్యంత గర్హనీయం.
గాంధీ ఆశించిన ‘గ్రామ స్వరాజ్యం’ చివరికి ఎండమావిగా మారింది. నాడు ‘పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలు- పల్లె ప్రజలే దేశానికి పసిడి బొమ్మలు’ అని ఆయన అన్నారు. ప్రపంచీకరణలో భాగంగా పట్టణాలకు భారీగా జనం వలస పోతుండడంతో పల్లెలన్నీ నేడు వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రజలలో వ్యవసాయం మీద ఆసక్తి తగ్గుతోంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం లేదా కార్పొరేట్ ఉద్యోగం అనే మాయలో పడడంవల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోంది. పంటలు తగ్గడంతో వ్యవసాయ ఉత్పత్తుల్లో కల్తీ పెరిగింది. సంప్రదాయ వ్యవసాయం తగ్గడంతో ప్రకృతి కాలుష్యమయం అవుతోంది. పదవులను బాధ్యతగా గుర్తించాలనీ, అధికారం కోసం వెంపర్లాడకూడదనీ, దేశానికి విముక్తి కలిగించడమే తన ధ్యేయమని అలనాడు గాంధీ భావించారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ప్రధాని కుర్చీ మీదనో, రాష్టప్రతి సింహాసనం మీదనో అధిష్ఠించడానికి అవకాశాలు పుష్కలంగా వున్నప్పటికీ ఆ పదవులను సేవాభావంతో కూడినవారు చేపట్టాలని జాతి జనులకు, నాటి ఉద్యమ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం సిద్ధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అదే సందర్భంలో అనేక మంది నాయకులు పదవుల కోసం అడ్డదారులు తొక్కడానికి పోటీపడ్డారు. దేశంలోని కొన్ని నగరాల్లో ప్రారంభమైన హిందూ, ముస్లిం మతస్థుల కలహాలను పరిష్కరించడానికి గాంధీ ఆయా ప్రాంతాలకు వెళ్లారు. ఇలా గాంధీ పదవులను త్యాగం చేయగా, ఆయన అనుచరులమని చెప్పుకొంటున్న నేటి తరం నాయకులు పదవుల ద్వారా భోగాలు అనుభవిస్తున్నారు. నాయకులను కట్టడి చేయవలసిన ప్రజలు యథారాజా-తథాప్రజా అనే విధంగా వారి మాయలోనే పయనిస్తున్నారు. నేడు ఏ ఎన్నిక జరిగినా, ఎటువంటి పదవి అయినా.. పైరవీల ద్వారా, పైసల ద్వారానే సాధ్యమవుతున్నాయే తప్ప- గాంధీ ఆశయాలు అణుమాత్రమైనా కనిపించడం లేదు. నేడు ఏదో ఒక కోణంలో హింస ద్వారానే ఏదైనా సాధ్యపడుతుందన్న భావన నేతల నైజంగా మారింది.
-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212
‘ఆయుష్’ను బతకనివ్వండి..
పేద ప్రజలకు సంప్రదాయ వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో రాష్ట్రాల్లో ఆయుష్ వైద్య సేవలను ప్రారంభించింది. ఒకేచోట ఇంగ్లీషు వైద్యంతోపాటు, భారతీయ వైద్యశాలలు వుండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా ఆంధ్రప్రదేశ్‌లో 2007 నుంచి 982 ఆయుష్ డిస్పెన్సరీలను ఏర్పాటుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 587 వైద్యశాలలను ఏపీకి కేటాయించారు. 2012 జూలై నుంచి వీటికి నిధులు సక్రమంగా రావటం లేదని, ఖాళీలను భర్తీచేయాలని, కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులర్ చేయాలని అనేక వినతులు చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించడం లేదు. ఏపీలో అరకొర వైద్య సిబ్బందితో, వసతుల లేమితో ప్రస్తుతం 450 ఆయుష్షు వైద్యశాలలున్నాయి. గత అయిదు సంవత్సరాలుగా పోస్టులను భర్తీచేయకపోగా ప్రభుత్వం పిహెచ్‌సి, సిహెచ్‌సిలలో పనిచేస్తున్న ఆయుష్ సిబ్బందిని భర్తీచేయడం లేదు. డాక్టర్లు లేనిచోట సిబ్బందిని తొలగించి, వైద్యశాలలో విధులను నిర్వహించుకోవాలనడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా వుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహించే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి ఎస్.ఎన్.ఓ., ఎం.ఎన్.ఓ, కాంపౌండర్లను 2 సంవత్సరాల నుంచి తొలగించినట్లుగా సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం తక్షణమే పర్మనెంట్ చేసి, తగినన్ని నిధులు మంజూరుచేసి ప్రతి నెలా జీతాలు ఇవ్వాలని విజయవాడలో సుమారు 250రోజుల పాటు ఆయూష్ సిబ్బంది నిరాహారదీక్ష ధర్నాలు నిర్వహించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు ఆయుష్ వైద్యులను, ఎస్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ కాంపౌండర్లను తక్షణమే విధులలోకి తీసుకొని, వారికి వేతన బకాయిలను కూడా చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అసలే వయోపరిమితి దాటిపోయి ఏ ఉద్యోగానికి పనికిరామని కుటుంబ పోషణ చాలా కష్టంగా వున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక రాష్ట్రాలలో ఆయుష్ సిబ్బందిని రెగ్యులర్ చేశారు. తెలంగాణలో కూడా ఆయుష్ శాఖకు పెద్దపీట వేసి నిధులు మంజూరుచేశారు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆయుష్ శాఖను నిర్వీర్యం చేసింది. ఉద్యోగులను వెంటనే సర్వీస్‌లోకి తీసుకొని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది.
-ఆర్.లలిత, పెళ్లకూరు