ఉత్తరాయణం

భాషోద్యమాలు మళ్లీ వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమంతటా ఒకే భాష సాధ్యమేనా? పలు ప్రాచీన భాషలకు, విభిన్న సం స్కృతులకు నిలయమైన మన దేశంలో అది సాధ్యం కాదు. ‘ఒకే దేశం-ఒకే భాష’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో జాతీయభాషపై మరోసారి చర్చకు తెర లేచింది. ‘యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం హిందీ భాషకు ఉంది. అంతర్జాతీయంగా మనకు విశిష్ట గుర్తింపు ఉండేలా ఒకే భాష ఉండాలి. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా హిందీకి మంచి గుర్తింపు తీసుకొస్తాం’ అన్న అమిత్ షా మాటలను వామపక్షాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, కొందరు సినీనటులు తప్పుపట్టారు. ఈ విషయమై ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, లేదంటే మరో భాషా ఉద్యమానికి సిద్ధమవుతామని డిఎంకే హెచ్చరించింది. కర్నాటకలో కన్నడ భాషాభిమానులు నిరసన ప్రదర్శనలు జరిపారు. ‘ఒకే దేశం-ఒకే భాష’ ఆర్‌ఎస్‌ఎస్ అజెండా అని సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆరోపించారు.
దేశమంటే కేవలం హిందీ, హిందుత్వ కాదని.. వాటికంటే భారత్ ఎంతో విశాలమైందని మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ పేర్కొన్నారు. భారతీయులందరి భాష హిందీ కాదని, ఇక్కడ ఎన్నో సంస్కృతులు, ఎన్నో మాతృభాషలు ఉన్నాయని, ముందు వాటి అందాన్ని, భిన్నత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. హోం మంత్రి వ్యాఖ్యలు జాతి ఐక్యతకు ప్రమాదాన్ని తెస్తాయని డీఎంకే నేత స్టాలిన్, హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం మూర్ఖత్వమని ఎండీఎంకే అధ్యక్షుడు వైగో అన్నారు. తమిళనాడులో జల్లికట్టుపై ఆందోళన కేవలం ఓ నిరసనలా సాగిందని, భాషాపోరాటం దానికంటే మహోగ్రంగా ఉంటుందని సినీనటుడు కమల్‌హాసన్ వ్యాఖ్యానించారు.
పరిపాలనా సౌలభ్యం కోసం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని అంశాలు ఒకేలా ఉంటే అనేక ప్రయోజనాలున్నాయి. పాలనాపరమైన అంశాలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటే వ్యయం తగ్గుతుంది. జమిలీ ఎన్నికలైతే ప్రభుత్వానికి, పార్టీలకు ఖర్చు తగ్గుతుంది. విద్యాపరంగా కామన్ ఎంట్రన్ టెస్ట్‌లు వంటివి ఒకటే ఉంటే విద్యార్థులకు ఖర్చుతక్కువ, సౌలభ్యంగా ఉంటుంది. చట్టాలు, పన్నులు, గుర్తింపుకార్డులు, కొన్ని ధ్రువపత్రాలు ఒకే రకంగా ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ‘ఏక్త్భారత్’ భావన నెలకొంటుంది. అయితే మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు విషయంలో అది సాధ్యం కాదు. మన దేశంలో 122 భాషలు, 19,500 రకాల మండలికాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని సామాజిక వర్గాలు, మతాలు, భాషలు, సంస్కృతులకు నిలయం భారత్. ఈ పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని రాజ్యాంగం రూపకల్పనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌తోపాటు సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయకోవిదులు కృషి చేశారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ పూర్తిస్థాయి రాజ్యాంగం కోసం మరో మూడేళ్లపాటు ఆగవలసి వచ్చింది. భావితరాలకు కూడా సమన్యాయం అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ మూడేళ్లకాలం అవిశ్రాంతంగా శ్రమించారు. ఆయన కృషి ఫలితంగా 12 షెడ్యూల్స్, 25 భాగాలు, 448 ఆర్టికల్స్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమమైన అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దేశంలోని 22 షెడ్యూల్ భాషలకు రాజ్యాంగంలో తగిన ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 పౌరులు తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతి సంప్రదాయాలు పాటించేందుకు స్వేచ్ఛను కల్పించింది. రాజ్యాంగ రూపకల్పనలో పెద్దలు తీసుకున్న జాగ్రత్తలకు విఘాతం కలిగించే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని అనేకమంది విమర్శిస్తున్నారు.
దేశంలో హిందీ భాషతోపాటు ప్రాచీనంగాఉన్న అనేక భాషలు ఉన్నాయి. దక్షిణాధి భాషలు అంతకంటే ఎక్కువ ప్రాచీనంగా ఉన్నాయి. భాష, సంస్కృతి చాలా బలీయమైనవి. హిందీ రాజభాషగా గుర్తింపుపొందినా ప్రాంతీయ భాషలకూ తగిన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరిగితే గతంలోమాదిరి మాతృభాషా ఉద్యమాలు జరుగుతాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.

-శిరందాసు నాగార్జున 94402 22914