ఉత్తరాయణం

మానసిక ఆరోగ్యంపై అశ్రద్ధ తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్’ సంస్థ తొలిసారిగా 1992 అక్టోబర్ 10వ తేదీన ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినం’ నిర్వహించింది. 1994 నుండి ప్రతి సంవత్సరం మానసిక ఆరోగ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని లక్ష్యంగా ప్రకటిస్తున్నారు. మన ఆలోచనలు, ఆచరణలు అన్ని మెదడుపైనే ఆధారపడి వుంటాయి. మెదడు గనుక లేకుంటే ఇంజన్ లేని రైలులా, దారం లేని గాలిపటంలా మానవ శరీరం ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి వుంటాయి. దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిమార్లు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. 150 దేశాల మానసిక ఆరోగ్య కేంద్రాల సభ్యుల సహాయ సహకారాలతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. వైద్య పరిభాషలో ఒత్తిడి, యాంగ్జయిటీ, బైసోలార్ డిజార్డర్, ఫోబియా, మానియా, స్కిజోఫ్రెనియా, ఆత్మన్యూనతా భావం, అడిక్షన్ లాంటి మానసిక వైకల్యాలు అనేకం వున్నాయి. ప్రతి ఒక్కరూ మానసిక ఉద్రేకాలను నిగ్రహించుకోలేకపోవడమే రుగ్మతలను తెచ్చిపెడుతుంది. మానసిక ఒత్తిడికి గురవకుండా సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తే మంచి ఫలితాలు ఉంటాయని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి ఏకాగ్రతగా ఉండాలని వారు సూచిస్తున్నారు. మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఒత్తిడిని అయినా అధిగమించవచ్చునని అనేక అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. చేతినిండా పని, మనసునిండా మంచి ఆలోచనలు ఉంటే ఇక లేనిపోని వత్తిళ్లకు తావులేదని చెపుతున్నారు. తగు మోతాదులో పౌష్టికాహారం, రోజులో కనీసం గంటసేపు వ్యాయామం, రిలాక్సేషన్ ఎక్స్‌ర్‌సైజులు, తీవ్ర ఉద్రేకాలకు లోనుకాకుండా కుంగిపోకుండా వుండాలి. మానసిక రుగ్మతలకు మెరుగైన చికిత్స అందజేయాలి. వృద్ధాప్యం మరో బాల్యం లాంటిది గనుక ముసలివారికి, పసిబిడ్డలకు పెద్దగా తేడా వుండదు. వృద్ధులతో సున్నితంగా వ్యవహరించాలి. మన దేశంలో వద్ధుల సంఖ్యతోపాటు మలి వయస్సులో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మానసిక చికిత్సా విభాగానికి వస్తే ప్రతి వందమందిలో 30 మంది వృద్ధులు వుంటున్నారు. వీరిలో అధికంగా డిప్రెషన్, నిద్రలేమి, డిమెన్షియా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది తదేకంగా ఆలోచించి మానసిక రోగులుగా మారుతున్నారు. పుస్తకాల పిచ్చి, తిండిపిచ్చి, డబ్బుపిచ్చి, నగలపిచ్చి, సినిమాల పిచ్చి, అతివాగుడు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మంచి స్నేహితులు, విందులు, వినోదాలలో పాల్గొనడం, నిత్యం చలాకీగా ఉండడం, ముఖంపై చిరునవ్వు చిందించడం తదితరాలవల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
రాజద్రోహం చట్టం ఇంకానా?
ఎప్పుడో భారతీయుల్ని అదుపులో పెట్టడానికి ఆంగ్లేయులు తీసుకువచ్చినది ‘రాజద్రోహం’ చట్టం. నాడు బాలగంగాధర తిలక్ మొదలుకొని స్వాతంత్య్ర సమరయధులపై బనాయించబడి, నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 49 మంది ప్రముఖులపై ప్రయోగింపబడేలా ఆ క్రూరమైన చట్టం ఇంకా బతికే ఉంది. ప్రజాస్వామ్యంగా దేశం మారిన పిమ్మట ఆ చట్టం అవసరం ఎంతమాత్రమూ లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుండి సుప్రీం కోర్టువరకూ ఇదే అభిప్రాయం. చట్టం ఉండడమే తప్పు అనుకుంటే, అది దుర్వినియోగం అవ్వడం మరింత పెద్దతప్పు. దేశభద్రత పేరుతో పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించగల అవకాశం వున్న ఈ చట్టాన్ని కొనసాగించినా- దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. ఒక వ్యక్తి చర్యవల్ల దేశంలో హింస, అలజడి రేగుతుందన్నా, భద్రతకు ముప్పు అనుకున్నా ఈ చట్టం ప్రకారం కేసు వస్తే ఒక అర్థముంది. కానీ ఒక వ్యక్తి తాను కేవలం ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కేసులు ఎదుర్కోవాల్సి వస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అయినా మనది రాజరికమూ కాదు.. ప్రభుత్వం అంటే రాజు, ప్రభువు కాదు కదా. ప్రజలకు సేవలందించే ఒక ఏర్పాటు. అంతే. ప్రభుత్వానికి ఇందులో పాత్ర లేకపోవచ్చు కానీ ఇలాంటివాటిలో చెడ్డ పేరు దానికే. ప్రభుత్వాన్ని లేఖ ద్వారా తప్పుపట్టిన, ఆ 49 మంది ప్రముఖులపై ఒక ప్రయివేటు వ్యక్తి కేసు వేసి ఉండొచ్చు. ఆయన ఉద్దేశం ఏదైనా కావొచ్చు. కానీ చట్టాన్ని తప్పుగా అన్వయించి కేసు విచారణకు తీసుకున్న కింది కోర్టు, తప్పులో కాలేసినట్టే కదా. ఇప్పటికే తలకుమించిన పనిభారంతో వున్న న్యాయవ్యవస్థ ఇలాంటి తప్పుల్ని సమర్థించకూడదు. ఉన్నత న్యాయస్థానం ఆ కింది కోర్టును ప్రశ్నించాలి. చర్యలు తీసుకుంటే నిలువరించాలి. అతి స్పందనలతో దేశం పరువు తీస్తున్నందుకు బాధ్యుల్ని చెయ్యాలి. రాజద్రోహం చట్టం వల్ల ప్రజాస్వామ్యానికి ద్రోహం జరగరాదు.
-డి.వి.జి.శంకర్‌రావు, పార్వతీపురం