ఉత్తరాయణం

‘రియల్’ మాఫియా దురాగతాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు నేడు అన్ని రంగాలలో చొచ్చుకొని వెళ్తున్నారు. మహిళలకు సాధికారత అంటూ ఒకవైపుపాలకులు, పౌర సమాజం మహిళల గురించి ప్రశంసిస్తూనే.. మరొకవైపు వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తున్నారు. మహిళలపై కొందరు అమానుషంగా దురాగతాలకు పాల్పడడం చూస్తుంటే నేటి సమాజం ఎటువైపు పోతున్నదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈనెల 4న హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ విజయారెడ్డిని నేరుగా ఆమె కార్యాలయంలోనే పెట్రోల్ పోసి ఓ ఉన్మాది హత్య చేయడం పట్ల యావత్ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాలుగునెలల కిందట తెలంగాణలోని అసిఫాబాద్ ప్రాంతంలో ఒక మహిళా ఫారెస్టు అధికారిపై కొందరు వ్యక్తులు అటవీ భూముల గొడవల నేపథ్యంలో విచక్షణారహితంగా దాడిచేసి కొట్టారు. ఈమధ్యనే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధి హోదాలో కొనసాగుతున్న ఎమ్మెల్యే ఒక మహిళా ఎడీవో ఇంటికి రాత్రి సమయంలో వెళ్లి దుర్భాషలాడి బెదిరించిన ఘటన వెలుగు చూసింది. ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా ముష్కరులు ఒక మహిళా తహసీల్దార్ మీద దాడి చేశారు. ఆ దాడి వెనుక ఆ ప్రాంత ఎమ్మెల్యే ప్రమేయం ఉందని అప్పుడు ఊరంతా కోడై కూసింది. దాదాపు రెండు దశాబ్దాల క్రిందట తమిళనాడులో ప్రతిపక్ష నాయకురాలిగా వున్న జయలలితను అసెంబ్లీలో ప్రత్యర్థి పార్టీ సభ్యులు చీరపట్టి లాగి అవమానపరిచారు. మహిళలపైన, ముఖ్యంగా ప్రజలకు సేవ చేసే స్థాయిలో వున్న ఉన్నతాధికారులపైన ఇలా దాడులు, అఘాయిత్యాలు జరుగుతుంటే ఏమనాలో తెలియడం లేదు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ కోణాలు, రియల్ ఎస్టేట్ మాఫియా వ్యూహాలు దాగి ఉన్నాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ దేశంలోని మిగతా అన్ని మెట్రో సీటీల కన్నా రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలు అనూహ్యరీతిలో విస్తరిస్తున్నాయి. భాగ్యనగరం బంగారు నగరంలాగా, విశ్వనగరంలాగా మారిపోయిందని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ విశ్వనగరానికి పట్టిన మాఫియా పీడను, రౌడీల అరాచకాలను, రోజురోజుకూ క్షీణిస్తున్న శాతిభద్రతల గురించి అటు పాలకులు, ఇటు ప్రతిపక్ష నాయకులు చిత్తశుద్ధితో ఆలోచించవలసి వుంది. హైదరాబాద్ నగరానికి నాలుగు శతాబ్దాల చరిత్ర వున్నందున నిజాం నవాబుల హయాంలోనే అనేక ప్రాంతాల ప్రజలు ఇక్కడ జీవించినందున కాలక్రమంలో కొంతమంది ఇక్కడి నుంచి వలస వెళ్లడం, వారి వారసులు ఇక్కడ ఎవరూ లేకపోవడం, అప్పట్లో వారు అతి చౌకగా కొన్ని భూములు ఇక్కడే వదిలేసి పోవడం గత చరిత్ర. నిజాం నవాబులకు చెందిన వేలాది ఎకరాలకు సరైన లెక్కలు లేకపోవడం వంటి అనేక కారణాలతో కబ్జారాయుళ్ళదే పైచేయిగా మారుతూ వస్తున్నది. భూములకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వంకలు, వాగులు, నాలాలు, చెరువులు అన్నింటినీ కబ్జా చేయడం సర్వసాధారణమైంది. ఈమధ్యకాలంలో గజం భూమికి సైతం వేలల్లో రేట్లు పలుకుతుండడం, అతి అడుగు నేల బంగారంలా మారడంతో ముంబయి తరహా రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నగరంలోను, శివారు ప్రాంతాలలో రెచ్చిపోతోంది. సమస్యను ఇలాగే వదిలేస్తే మున్ముందు పరిస్థితులు మరింత దిగజారిపోయే ప్రమాదం వుంది. రాష్ట్ర పాలకులతోపాటు కేంద్ర ప్రభుత్వం సైతం వెంటనే హైదరాబాద్ నగర శాంతి భద్రతల మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిన ఆవశ్యకత వుంది.
-తిప్పినేని రామదాసప్ప నాయుడు
అత్యంత అమానుషం
హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే పట్టపగలు అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడం ప్రజలందరినీ తీవ్ర కలవరానికి గురిచేసింది. రెవెన్యూ ఉద్యోగుల పనితీరుపై కొంత అసంతృప్తి ఉండవచ్చు. సకాలంలో పనులు కావడం లేదని, పలుసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదనే ఆవేదన ఉండవచ్చు. ఇలాంటి అసంతృప్తి, ఆవేదన చాలామందిలో ఉండడం సహజం. ఉత్తమ తహసీల్దార్‌గా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకొన్న విజయారెడ్డిపై పెట్రోదాడి చేసి ఆమెను చంపడం అత్యంత అమానుషం. మహిళా తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో గాయపడిన డ్రైవర్ సైతం మరణించడం మరింత విషాదకరం. సమస్యలు తీరడం లేదని ఉన్మాదానికి లోనై మహిళా అధికారిణిని అంతం చేయడం సరికాదు. ఇలాంటి కిరాతక ఘటనను ఏ సభ్య సమాజం అంగీకరించదు. హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరగడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భూకబ్జాలు, వ్యక్తిగత తగాదాలు, శాంతి భద్రతల సమస్యలు నిత్యకృత్యంగా మారాయి. రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి, రాజకీయ నాయకుల నుంచి అధికారులకు బెదిరింపులు, దాడులు తప్పడం లేదు. సమర్థత కలిగిన అధికారిణిగా పేరు తెచ్చుకొన్న విజయారెడ్డిని హతమార్చడం శాంతిభద్రతల సమస్యగా పరిణమించిన భూవివాదాలకు తార్కాణం. అధికారులు నిజాయితీగా, ధైర్యంగా పనిచేసే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట