ఉత్తరాయణం

అయోధ్యపై అపోహలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలోని మందిర్-మసీదు వివాదంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు దశాబ్దాల సమస్యకు శాశ్వత ముగింపు పలికే విధంగానే ఉంది. అయోధ్యలో శ్రీరాముడి పుట్టుకపై, బాబర్ కట్టడంపై వాదనలు ఎలా ఉన్నా, అయోధ్య హిందువులకు పవిత్రమైనదిగా అందరూ అంగీకరిస్తారు. శ్రీరాముడిని నమ్మేవారైనా, నమ్మనివారైనా తమ బిడ్డలు అలా ఆదర్శంగా ఉండాలనుకుంటారు. ఇక, పురావస్తు శాఖ పురాతన కట్టడంపై మసీదు నిర్మించినట్లు తన అధ్యయనంలో తేల్చింది. కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పద మసీదును ప్రార్థనలు చేయకుండా వదిలేశారట. ఐతే కరసేవకులు దుందుడుకుగా బాబ్రీ మసీదును కూల్చడం అక్రమమని సుప్రీం కోర్టు పేర్కొంది. అక్కడే రామాలయం, మసీదు నిర్మాణాలకు స్థలం కేటాయిస్తే భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి సమస్యలు తలెత్తే ప్రమాదమున్నదని భావించి, సుప్రీం కోర్టు ముస్లింలకు మరోచోట స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించి వుండవచ్చు. గతంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన వేలాదిమంది అమాయకులు బలైపోయిన విషయం విదితమే. ఇక ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ వంటి కొందరు నేతలు బాబ్రీ మసీదు కట్టడం చట్టవిరుద్ధమైతే, దాన్ని కూల్చిన అద్వానీ వంటి వారిపై కేసులెందుకు పెట్టారని సందేహం వెలిబుచ్చుతున్నారు. అయితే నాటి ప్రభుత్వం వివాదంలోని న్యాయాన్యాయాల జోలికి పోకుండా ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా, శాంతిభద్రలకు భంగం కలిగించారని అరెస్టులు చేశారు. సుప్రీం కోర్టు కూడా అలానే ప్రస్తుత, రాబోవు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తీర్పునిచ్చిందని భావించాలి. మెజారిటీ ప్రజల మనోభావాలను కూడా మనం గౌరవించాలి. ఈ విషయంలో వివాదాలు కొనసాగితే అవి పాకిస్తాన్‌కు మేలు చేస్తాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా ఎన్నో దేవాలయాలను కూలగొట్టారు. ఆ ప్రభుత్వం ఎన్నింటిని పునర్‌నిర్మించింది? పాకిస్తాన్‌లో మైనారిటీలైన హిందువులకు రక్షణ, సంక్షేమ పథాకాలు వంటివి లేవు. వారు ఎప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులే. అందుకే మన దేశంలోకి అవకాశమున్నపుడు ఉగ్రవాదుల రూపంలో వలసలు వస్తుంటారు. కశ్మీర్ గురించి పాకిస్తాన్ ప్రభుత్వం నిత్యం గొంతు చించుకుంటోంది. ఆ దేశంలో అత్యధిక శాతం ప్రజలు పేదరికంపై ఆందోళన చెందుతున్నారు. మన దేశం పరిస్థితి కూడా ఇంతే. ఇరు దేశాలకూ పేదరికమే ప్రధాన శత్రువు. అభివృద్ధి చెందిన బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలైతే- ‘లక్షల కోట్ల రూపాయల ఆయుధ ఖర్చులు, వేలాదిమంది వీర సైనికుల ప్రాణ త్యాగాలకు’ ఆస్కారం లేకుండా, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేవి. ఇకనైనా ఇరు దేశాల ప్రభుత్వాలు, మతపెద్దలు ఇటువంటి సున్నిత విషయాలపై రచ్చచేయకుండా పేదరికం పారద్రోలేందుకు తమవంతు కృషిచేయాలి.
-టీసీ సాంబశివరావు, నర్సరావుపేట
ఆర్టీఐపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థించడం చరిత్రాత్మకం. అయోధ్య వివాదంపై తీర్పు ఇచ్చిన నాలుగు రోజుల వ్యవధిలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం మరో సంచలనమైన తీర్పును ఇవ్వడం భారత పౌరులందరిలో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం పెంచింది. సమాచార హక్కు ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిది. పాలనలో పారదర్శకతను పెంచి జవాబుదారీతనం కల్పించే ‘సమాచార హక్కు, గోప్యత హక్కు’ ఒకే నాణానికున్న రెండు ముఖల్లాంటివని, ఒకదానిని మరొకటి అధిగమించలేదు అని కోర్టు వ్యాఖ్యానించడం హర్షణీయం. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా అడిగినపుడు, కొలీజియం కారణాలను అభ్యంతరంగా పేర్కొనరాదని చెప్పడంతో సమాచార హక్కు చట్టానికి బలం చేకూరింది. ప్రముఖ సమాచార హక్కు కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్- ‘సుప్రీం కోర్టులో జడ్జిలుగా నియమితులైన వారు తమ ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పిస్తారా?’ అంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో, వాదోపవాదాలు జరిగి ఈ సంచలనమైన తీర్పురావడానికి దోహదం చేసింది. సుప్రీం తాజా తీర్పు ద్వారా ఇది తమకు కూడా వర్తిస్తుందని తెలియజేసి స.హ. చట్టం పరిధిని సుప్రీం మరింత విస్తృతం చేసింది. పారదర్శకత అంశంలో రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు మూడు వేర్వేరు తీర్పులు ఇచ్చినా ఆ మూడు ఏకాభిప్రాయంతో ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు పారదర్శకతకు ప్రాణం పోసిందని అభివర్ణించవచ్చు. ఈ తీర్పు రావడానికి ముఖ్య కారకుడైన ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్ కృషి ఎనలేనిది. ఆయన పట్టుదల వల్లే ఈ తీర్పు వెలువడింది. ప్రతిఒక్కరూ సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించాల్సిందే. న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచుకోవాల్సిందే.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట