ఉత్తరాయణం

అనైతిక రాజకీయాలకు పరాకాష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టలో సుమారు గత నెల రోజులుగా సాగుతున్న పదవీ రాజకీయాలు దేశ ప్రజలకు జుగుప్సను కలిగిస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న భారతీయ జనతాపార్టీ, శివసేన కూటమికి వోటర్లు మెజారిటీ ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు కావడంలో అంతులేని జాప్యం జరిగింది. ముఖ్యమంత్రి పీఠం తమకంటే తమకని కొట్లాడుకున్న భాజపా, శివసేన పార్టీలు ఓటర్ల తీర్పును గంగలో కలిపాయి. తమకు మెజారిటీ లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ మొదట్లో చేతులెత్తేసిన భాజపా వారు గుట్టుగా తెరవెనుక రాజకీయాలు నడిపారు. ఎవరూ ఊహించని రీతిలో భాజపా నేత ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మహారాష్టలో రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ రాజకీయంగా బేరసారాలకు తెరపడలేదు. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల కలయికతో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. పదవుల పంపకానికి సంబంధించి ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని కూడా వార్తలొచ్చాయి. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి కావడం ఖాయమనుకున్న సమయంలో భాజపా అగ్రనేతలు పావులు కదిపి శివసేన, కాంగ్రెస్‌లకు షాక్ ఇచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జరిగిన అనూహ్య పరిణామాల పర్యవసానంగా శనివారం ఉదయం ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆగమేఘాలపై అర్ధరాత్రి వేళ రాష్టప్రతి పాలనను ఎత్తివేసి, ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ తన వంతు సాయం చేశారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని ఉదయానే్న టీవీల్లో చూశాక అందరూ ‘ఇది కలా? నిజమా??’ అని విస్మయం చెందారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు ప్రకటించడం వల్లే ఫడ్నవీస్ మళ్లీ సీఎం పదవిని పొందగలిగారు.
మతతత్త్వ పార్టీ అని ముద్రపడిన ‘శివసేన’తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు కాంగ్రెస్,ఎన్‌సీపీలు బరితెగించడం అనైతికం తప్ప మరొకటి కాదు. శివసేనకు అండగా నిలిచేందుకు మాత్రమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవులను, మంత్రిపదవులను పొందేందుకు కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఒప్పందాలు చేసుకోవడం విలువల పతనానికి తిరుగులేని నిదర్శనం. భాజపాకు మద్దతు ఇచ్చిన అజిత్ పవార్‌ను తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించడం మరో విడ్డూరం. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన అనంతరం భాజపాకు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం, ఫడ్నవీస్ మళ్లీ సీఎం కావడం ఎవరూ ఊహించని నాటకీయ పరిణమాలు. ఎన్‌సీపీలో నిజంగా చీలిక వస్తే ఫడ్నవీస్ బలపరీక్షకు మద్దతుగా ఎంతమంది ఎమ్మెల్యేలు నిలబడతారు. తమది ‘కిచిడీ ప్రభుత్వం’ కాదని చెబుతున్న ఫడ్నవీస్ శాసనసభలో జరిగే బలపరీక్షలో విజయం సాధిస్తారా? బలపరీక్షలో గెలిస్తే ఆయన ఎంతకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉంటారు? ఫడ్నవీస్‌కు అండగా నిలిచిన తన పార్టీ ఎమ్మెల్యేలపై శరద్ పవార్ బహిష్కరణ వేటు వేస్తారా? వ్రతం చెడ్డా ఫలితం దక్కని శివసేన, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? శరద్ పవార్ పార్టీలో చీలిక వస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే జవాబు చెప్పాలి. పదవుల కోసం ‘కప్పల తక్కెడ’లా మారిన శాసనసభ్యులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారన్నది గ్యారంటీ లేకుండా పోయింది. అధికార వైభోగం కోసం జరుగుతున్న ఈ అనైతిక రాజకీయాలకు అడ్డుకట్ట వేసేదెవరు? ఫిరాయింపుల నిరోధక చట్టం కాని, న్యాయస్థానాలు కాని ఈ దిగజారుడు రాజకీయాలను నిరోధించే అవకాశం లేదా?
-పీజే చంద్రశేఖర్, విజయవాడ