మంచి మాట
ఎన్నటికీ బండబారని హృదయం కలవారు, ఎప్పటికీ తగ్గని ఉత్సాహం కలవారు, ఎవరినీ బాధించని ప్రవర్తన కలిగి ఉన్నవారు ఉత్తములు అని పెద్దలంటారు. ఉత్తములకు ప్రేమించడానికి హృదయం ఉంటుంది. ఇతరుల ప్రేమ పొందడానికి వ్యక్తిత్వం ఉంటుంది. వారు మానవ సమాజంలో మంచిని ప్రోత్సహించడమే కాదు, చెడునీ నిరోధిస్తారు.
వారు తమ బాధలకు కారణాలు ఏవైనా ఎవరైనా కానీ ఆ బాధలు బాపుకొనేందుకు ఇతరులకు హాని తలపెట్టరు. ఉత్తములు మాట పడరు. మాట మీద నిలబడతారు. చల్లగా పిలుస్తారు. మెల్లగా పలుకుతారు. గంభీరమైన విషయాలగూర్చి అసందర్భంగా మాట్లాడరు. సామాన్యమైన విషయాల గూర్చి సాధికారికంగా మాట్లాడతారు. మాట ఇవ్వడానికి తొందరపడరు. ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనుకాడరు. చక్కగా వినడం నేర్చుకున్న తర్వాతే చక్కగా మాట్లాడతారు.
అన్యాయాన్ని భరించడంకన్నా, అన్యాయం చేయడం మరింత అవమానకరం అంటారు. జీవితం సంతృప్తిగా సాగాలంటే, సంపదలకన్నా, సంస్కారమే ముఖ్యమని భావిస్తారు. వాదన అజ్ఞానాన్ని పెంచుతుందని, చర్చవిజ్ఞానం పెంచుతుందని వారి నమ్మకం. వారు ఏమీ ఆశించరు. అందుకే వారికి ఆశాభంగం కాదు. వివేకవంతుల సాహచర్యంలో, వివేకవంతులుగా మసలుతారు. పనిచేయకుండా చెప్పే కబుర్లు వినడానికి వారు ఆసక్తి చూపరు.
వినడానికి బాగున్నా వాటివల్ల ప్రయోజనం శూన్యమని వారు భావిస్తారు. ఏదైనా ఒక పనిలో విజయం సులభంగా సాధించాలనే తలంపు వారికి కలుగదు. కఠోర పరిశ్రమ అనంతరం లభించే విజయమే వారికి సంతృప్తినిస్తుంది. కయ్యానికి కాలు దువ్వక భగవద్భక్తిని కలిగి ఉంటారు. దానం చేస్తే గర్వంతో, అహకారంతో, కీర్తి కాంక్షతో చేయరు. ఉచితంగా ధారాళంగా చేస్తారు. శాంతము అలవరచుకొని, దాని ద్వారా దేనినైనా సాధించగలమనే నమ్మకంతో ఉంటారు. కష్టాలకు గల మూల కారణాలను తొలగిస్తే శాంతమనేది మనలో ఉద్భవిస్తుందనే సూత్రాన్ని కనిపెట్టినవారు ఉత్తమ మానవులు.
ఒక సామాజిక ఉపయోగకరమైన కార్యం విజయం కావాలంటే నలుగురు రావాలి, కలవాలి, పని చేయాలి. అప్పుడే అది నెరవేరుతుంది అనే సందేశం వినిపిస్తారు. ఈ ప్రపంచంలో మేధస్సు, అనుభవం సమర్థత ఆధారంగా మాత్రమే మనుషులు పూర్తి భద్రత సాధించగలుగుతారని వారి నమ్మకం. ఉత్తములు తమ బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయములను దేవదేవుని స్మరణలోనే నిత్యం స్థిరంగా ఉంచుతారు. అందుకే వారు సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశిస్తూ తమ సందేహాలను పూర్తిగా తొలగించుకుంటారు.
తపోధనులైన సాధువుల దర్శనం పుణ్యమని, తమను వారు తాకితే పాపహరమని, వారితో సంభాషించడం తీర్థ్ఫలంతో సమానమని, వారికి వందనం చేయడం మోక్షసాధనమని వారు భావిస్తారు. ఉత్తములు ఇతరులకు చేసిన మేలును, ఇతరులు తమకు చేసిన కీడును మరచిపోతారు. ఇతరులు తమకు చేసిన మేలును జ్ఞాపకముంచుకొని జీవిస్తారు. పొరపాటున ఇతరులకు కీడు చేస్తే పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరుకుంటారు. కెరటాలు కాళ్ళదగ్గరకు వచ్చాయని, సముద్రాన్ని చులకనగా చూడడం ఎంత తెలివిహీనతో, సహనము వహిస్తున్నారు కదా అని ఉత్తములను తక్కువగా అంచనా వేయడం కూడా మన తెలివి తక్కువని గ్రహించాలి.
-కనె్నకంటి పెద సైదయ్యాచారి
Add new comment