ఉత్తరాయణం

పాఠశాలల్లో అసాంఘిక కలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయి. కొన్ని తరగతి గదులను కొందరు ఊరిపెద్దలు తమ నిర్మాణ సామగ్రిని దాచుకోవడానికి ఉపయోగిస్తుండగా, మరికొన్ని గదులలో పేకాట ఆడుకోవడం, తాగడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రహరీ గోడలు లేక పశువులు హాయిగా సంచరిస్తూ శుభ్రతను పాడుచేస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు. బహిరంగ మూత్ర విసర్జన, గ్రామస్థులు వంటలు చేసుకోవడం లేదా సామాన్లు భద్ర పరచడం, నేతల రచ్చబండ కార్యక్రమాలు ఇక్కడి బడుల్లో సర్వసాధారణం.
- సి. ప్రతాప్, శ్రీకాకుళం

రవాణాసదుపాయాలు కల్పించాలి
శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి చరిత్రకెక్కిన ఉద్దండరాయునిపాలెం ఇటీవల రాజధాని నిర్మాణ శంకుస్థాపన తర్వాత నిత్యం సందర్శకులతో కళకళలాడుతోంది. అయి తే ఈ ప్రాంతానికి ఆర్టీసీ సర్వీసులు లేకపోవడంతో సందర్శకులు నానా అవస్థలు పడుతున్నారు. జీపులు, ఆటోలు, వంటి వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. అట్లాగే లేళ్లాయిపాలెంలో ప్రాచీన శైవక్షేత్రానికి సందర్శకుల తాకిడి తీవ్రంగా ఉన్నా సరైన రవాణా సదుపాయం లేదు. రాజధాని ప్రాంతంలో రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అక్కడ మాత్రం యాత్రికులకు కనీస సౌకర్యాలు లేవు. ప్రతి వీధికి ఒక మద్యం దుకాణం వెలసినా అధికారులు పట్టించుకోవడం లేదు. పర్యాటకశాఖ వారు ఈ ప్రాంతంలో కనీస వసతుల రూపకల్పనపై దృష్టి సారించాలి.
-ఎం. కనకదుర్గ, తెనాలి

మాతృభాషపై మమకారమంటే ఇదేనా?
ఇంగ్లీషు సంవత్సరాదికి ఏలాగూ అదే భాషలో గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాం. మన ఉగాదికి కూడా అదే ఆంగ్లాన్ని పట్టుకుని వేళ్ళాడుతున్నాము. ‘హేపీ తెలుగు న్యూఇయర్ డే’అని మాకు ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంత తెలుగులో మాట్లాడదామనుకున్నా కొన్ని ఆంగ్ల పదాలు రాక తప్పదు. అందుబాటులోవున్న నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అనే సమాచారం ఫోన్లద్వారా తెలపొచ్చుగా. తెలుగులో పంపితే నామోషి అనుకొనేవారు కూడా లేకపోలేదు. చిన్నపిల్లల చేత ఇంట్లోకూడా ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నిబంధనలు విధించే తల్లిదండ్రులనేకమందున్నారు. మమీ, డాడీలను అమ్మానాన్నలను చేయలేకపోతున్నాం. ఇది మన మాతృభాష మీదున్న తెలుగువారి ‘మమకారం’.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
రాష్ట్ర ఎం.ఆర్.పి.ఎస్.వారు, ఎస్సీ వర్గీకరణ గురించి గత 20 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు చేపట్టినా ఎస్. స. వర్గీకరణను ప్రభుత్వంవారు చట్టబద్ధత కల్పించలేదు. అందువలన మాదిగ దాని ఉప కులాలవారు నిరాశ చెందుతున్నారు. ఎ.పి. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర సిఎంగారు మాదిగలను అన్నివిధాల ఆదుకుంటానని హామీఇచ్చారు. తమరు ఇచ్చిన హామీప్రకారం సిఎంగారు జస్టిస్ ఉషామెహ్‌రా వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టించి ఎస్.సి వర్గీకరణ చట్టబద్ధత కల్పించే ఏర్పాటుచేయగలరని ఆశిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్.సి.వర్గీకరణను పార్లమెంటులో ప్రవేశపెట్టేవరకు మాదిగ సోదరులు సహనం వహించి, ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలు, ధర్నాలు, స్టేటుమెంట్లు ఇవ్వకూడదని చట్టబద్ధత జరిగేవరకు సంయమనం పాటించాలని మాదిగ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
- యం.బులిసత్తియ్య మాదిగ, రామచంద్రపురం

ఎవరేంటో ప్రజలకు తెలుసు
ఇషత్ జహాన్ ఉగ్రవాది అన్న నిజాన్ని మొదటి అఫిడవిట్‌లోంచి తొలగించి సుప్రీంకోర్టుకి రెండో అఫిడవిట్‌ని ఆనాటి మంత్రి చిదంబరం సమర్పించడంలో సోనియా, రాహుల్ ప్రమేయంలేదంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అనడం కేవలం నయవంచన. త్యాగమయిగా భుజకీర్తులు తగిలించుకొని కీలుబొమ్మ ప్రధానిని ప్రతిష్టించి వెనకనుంచి సూపర్ ప్రధానిగా సోనియా అధికారం చలాయించడం దేశం అంతా తెలుసు. మంత్రివర్గ నిర్ణయాన్ని నిండు సభలో చించివేసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేట్టు చేసిన మహానుభావుడు రాహుల్. నిజమే వీళ్లిద్దరూ యుపిఏ పాలనలో అస్సలు జోక్యంచేసుకోలేదు(ట)!
- చంద్రిక, రాజేంద్రనగర్

నీటి సమస్య
ఈ వేసవిలో మండుటెండలకు భూగర్భజలాలు అడుగంటాయి. ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల బాధలు వర్ణనాతీతం. అధికారులు చొరవ తీసుకొని గ్రామాలలో నీటికొరత లేకుండా నీటి సరఫరాచేయాలి. పట్టణ ప్రాంతాలలో నీటి వృథాను అరికట్టాలి. ప్రతి గ్రామంలోనూ ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్