ఉత్తరాయణం

నవ్యాంధ్ర సాధ్యమయ్యేది ఎప్పటికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, కొంతమంది అధికార్లు చెప్పే మాటలు వింటుంటే వాళ్ళు ప్రజలను తమకు ఓట్లు వేసే అమాయకులుగానే భావిస్తారని అర్ధమవుతుంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రిగారు కరువు రహిత రాష్ట్రాన్ని సాధిస్తానని అంటారు. ఏ ఊరు వెళితే ఆ ఊరుని ‘స్మార్ట్’గా చేసేస్తాను ‘అలా ముందకు పోతున్నామని’ అంటాడు. మరొక ప్రక్క ప్రతిపక్ష నాయకుడు జగన్ ‘చంద్రబాబును విమర్శించినా నోరుమెదపలేని స్థితిలో ఉన్నారు. ఈమధ్య ముఖ్యమంత్రిగారు విజయవాడ- మచిలీపట్నం నాలుగు లేన్ల రోడ్డును 18 నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించినట్లు మన పేపర్లో చదివాను. ఇప్పుడు కలెక్టరుగారు ఆ రోడ్డును పుష్కరాల లోపు పూర్తిచేస్తామని అంటున్నారు. అది సాధ్యం కాని పని అని అందరికీ తెలుసును. కనకదుర్గ ఫ్లైఓవర్‌ను పుష్కరాల లోపు పూర్తిచేస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేశారు. ఇటువంటి అధికార్లతో ‘నవ్యాంధ్రప్రదేశ్’ ఎప్పుడు అభివృద్ధి చెందునోకదా!
- డి.రామకృష్ణయ్య, పెనమలూరు, కృష్ణా జిల్లా

గరికపాటికి దక్కని గౌరవం
భారత, రామాయణ, భాగవత పురాణాలను, కాళిదాసాది కవుల కావ్యాలకు ప్రజల భాషలో భాష్యం చెప్పిన, చెబుతున్న కవి, నేటి కవులకు గురుతుల్యులు, సమకాలీన సమాజాభివృద్ధికి అనేక సూచనలను యిస్తూ, ప్రబలిన మూఢత్వాన్ని పారదోలుతూ నవ జీవన వేదాన్ని నవనవోనే్మషం చేస్తూ ప్రజలకు దగ్గరైన మహా సహస్రావధానిగా కీర్తింపబడిన గరికపాటి నరసింహారావుగారికి ఏనాడో ‘జ్ఞానపీఠ’ అవార్డు దక్కవలసింది. ఆయనకున్నంత విషయ పరిజ్ఞానం, ఆశుకవిత్వం లేనివారికి, అవార్డులెలా యిస్తున్నారు? అవధానిగారికి ‘జ్ఞానపీఠం’ యిస్తే, యిచ్చి న వారికి గౌరవం కలుగుతుంది. జనపీఠం ముందు జ్ఞానపీఠమెంత అని సంబరపడే సామాన్య జీవి ‘సాగరఘోష’.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

దిగజారిన ప్రతిష్ఠ!
ఉత్తరాఖండ్ ప్రభుత్వం విషయంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వ చర్య రసాభాస అయింది. పూర్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేది. ఐతే తాము చేసిన పనిని సమర్ధించుకొనేది. కాని కోర్టుల, ప్రజలచే మొట్టికాయలు వేయించుకొన్న సందర్భాలు తక్కువ. బి.జె.పి. సామాన్య ప్రజల బ్రతుకులు బాగుచేయాలి కాని కొరివితో చేతులు కాల్చుకోరాదు.
- గర్నెపూడి వెంకట రత్నాకర్‌రావు, హనుమకొండ

ఫోన్ బిల్లు మాటేంటి?
నెల క్రితం వరకు సిలిండర్ బుకింగ్ కోసం ఫోన్ చేస్తే ఒక నిమిషం, ఒక రూపాయి లోపు ఖర్చుఅయ్యేది. ఇప్పుడు ఫోన్ చేస్తే ప్రభుత్వ ఆదేశం అంటూ సంవత్సర ఆదాయం పది లక్షలు మించిన వారికి సబ్సిడీ ఉండదు. గ్యాస్ డీలర్‌వద్ద ఆదాయం డిక్లేర్ చేయమని ప్రకటన వినిపిస్తుంది. తర్వాత డీలర్ ఫోన్ నంబరు, కన్ఫర్మేషన్ అడుగుతున్నారు. తర్వాత కస్టమర్ ఐడెంటిటి నంబరు, కన్ఫర్మేషన్ అడిగి బుకింగ్‌కోసం ఒకటి నొక్కండి అంటున్నారు. ఇదంతా అయేసరికి 3 నిమిషాలు, 3 రూపాయలు పైగా ఖర్చవుతోంది. ప్రభుత్వ ప్రకటన వినిపించిన కాలానికి కూడా డబ్బు వసూలు ఏమిటి? సబ్సిడీ మాట దేవుడెరుగు. సిలిండర్ బుక్ చేసినప్పుడల్లా ఫోన్ బిల్లు మాత్రం అదిరిపోతున్నది.
- ప్రసాద్, గొడారిగుంట