ఉత్తర తెలంగాణ

ప్రేమ ఎంత మధురం! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లని వెనె్నల కాంతి ఒకవైపు! బయట మల్లెల గుబాళింపు మరోవైపు! కొలీగ్ లాసిని తాలూకు మధుర భావాలు మదిని కవ్విస్తున్నాయి. ఫోన్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న శ్రీకాంత్ బెడ్‌పై బోర్లా పడుకుని.. ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు! జిలుగు వెలుగులో ఏదో దోబూచులాడినట్లు.. ఆయన అంతరంగ తరంగాలు ఆయనను గిలిగింతలు పెడుతున్నాయి. మనసంతా ఆమె అన్న చందంలా మారిన శ్రీకాంత్ తనతో పాటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న లాసినికి పెళ్లి విషయం ప్రపోజ్ చేసి.. తెల్లారితే ఫిబ్రవరి 14 ‘వాలంటైన్స్‌డే’ సందర్భంగా కలిసి సినిమాకు వెళ్దామని కోరాడు. ఏ విషయం ఈ రోజు రాత్రి చెబుతానన్నది లాసిని.. అందుకే.. ఎక్కడ లేని ఆనందం ఆయన మోముపై తాండవిస్తోంది.
ఇంతలో.. లాసిని నుండి ఫోన్ రానే వచ్చింది. ‘హలో శ్రీకాంత్’ అంది.
‘హలో ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిందా?’ అని సంభాషణ కంటిన్యూ చేసింది లాసిని.
‘హలో డియర్, అయింది. నీ డిన్నర్ అయిందా?’ అని అడిగాడు శ్రీకాంత్. ‘ఎస్ ఇప్పుడే పూర్తయింది’ అంది.
‘మరీ మనం రేపు సినిమాకు వెళ్లే విషయం ఏం చేశావ్?’ అని ఆసక్తిగా అడిగాడు.
‘శ్రీకాంత్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది. డైవర్సు తీసుకున్న నన్ను పెళ్లి చేసుకుంటే.. నీకేం భవిష్యత్తు ఉంటుంది? నా మాట విని నువ్వు పునరాలోచించుకో’ అనునయంగా చెప్పింది లాసిని.
‘అలా అనకు లాసిని.. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం..నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది. నీతోనే నా జీవితాన్ని పంచుకోవాలని ఉంది.. కళ్లు తెరిచినా నువ్వే.. కళ్లు మూసినా నువ్వే.. నా ధ్యాస.. నా శ్వాస.. అన్నీ నువ్వే’ అంటూ వేడుకోసాగాడు శ్రీకాంత్.
‘అది కాదు శ్రీకాంత్.. నువ్వన్నా.. నీ నడవడి అన్నా నాకూ ఇష్టమే.. కానీ నీ కన్నా ఒక సంవత్సరం పెద్ద దాన్నయిన నన్ను పెళ్లి చేసుకోవడం ఏం బాగుంటుంది.. పైగా డైవర్స్ తీసుకున్న దాన్ని. ప్లీజ్ నన్ను మరిచిపో’ అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది.
చిన్నప్పుడే పెళ్లయి.. తన భర్త వ్యసనపరుడైనందున కాపురానికే వెళ్లకుండా.. నేరుగా డైవర్సు తీసుకున్న లాసిని.. బ్యాంకులో అందరితో కలివిడిగా వుంటుంది. అదే బ్యాంకులో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్‌తో సన్నిహితంగా ఉంటూ.. పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లివరకు వెళ్లింది. కానీ.. లాసిని చాలా సున్నితమైన మనస్తత్వం కలది కనుక ఏ నిర్ణయం తీసుకోలేక మనసు దోబూచులాడుతుంటే శ్రీకాంత్‌తో పెళ్లికి అప్పుడే ‘ఎస్’ అంటుంది.. వెంటనే ‘నో’ అంటుంది. ఎటూ తేల్చుకోలేక పోతోంది.
‘ఏంటి లాసినీ.. ఈ విషయంలో మనం చాలాసార్లు చర్చించే నిర్ణయానికొచ్చాం కదా.. ప్లీజ్.. నిర్ణయం మార్చుకోకు.. ప్లీజ్’ అంటూ ప్రాధేయపడసాగాడు శ్రీకాంత్..
‘ఓకే ఓకే శ్రీకాంత్ ఈ రాత్రికి బాగా ఆలోచించుకుని రేపు ఉదయానే్న నీకు వాట్సాప్‌లో మెసేజ్ పెడతాను సరేనా’ అంది లాసిని..
‘అలాగే థ్యాంక్స్ గుడ్‌నైట్’ అంటూ ఫోన్ కట్ చేశాడు. ‘గుడ్‌నైట్’ అని ముక్తసరిగా చెప్పి లాసిని కూడా ఫోన్ పెట్టేసింది.
శ్రీకాంత్ మనసు మనసులో లేదు. ఒకవైపు వలపుల తలపులు మదిని గిలిగింతలు పెడుతుంటే.. మరోవైపు లాసిని నుండి ఏం రిప్లయ్ వస్తోందన్న భయాందోళన ఆయనను వెంటాడసాగింది. లాసిని గురించే ఆలోచిస్తూ.. తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు.
ఉదయం ఐదు గంటలకే నిద్రలేచాడు. లాసిని మెసేజ్ కోసం.. స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేశాడు. ఇంకా ఏమీ సందేశం రాకపోవడంతో.. వాట్సాప్‌ను ఆన్‌లోనే పెట్టి కళ్లార్పకుండా.. చూస్తూ ఉండిపోయాడు. పదిహేను నిమిషాలు గడిచి పోయాయి! అంతలోనే లాసిని నుండి మెసేజ్ రానే వచ్చింది.
‘గుడ్ మార్నింగ్ డియర్ శ్రీకాంత్.. హ్యాపీ వాలైంటైన్స్‌డే.. ‘ఐ లవ్ యూ’ అని వచ్చిన లాసిని సందేశాన్ని పెదాలతో ముద్దాడాడు.. శ్రీకాంత్. ఆయన ఆనందానికి అవధుల్లేక..వెంటనే ‘గుడ్ మార్నింగ్ లాసిని.. థ్యాంక్స్ ఏ లాట్.. ఐ లవ్ యూ టూ, పదకొండున్నరకు శాంతి సినిమా టాకీస్ వద్ద కలుద్దామని’ మెసేజ్ పంపాడు.
‘ఓకె’ అని రిప్లయ్ ఇచ్చింది లాసిని.
‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంతే మధురం’ అని పాటను తనకు అనుకూలంగా మార్చుకుని దాన్ని హమ్ చేస్తూ.. బాత్‌రూం వైపు అడుగులు వేశాడు శ్రీకాంత్.
‘వాలంటైన్స్ డే’తో పాటు ఆదివారం కావడం ఇద్దరికీ ఓ వరమైంది.

- హనుమాండ్ల రమాదేవి, బెల్లంపల్లి
ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9959835745

పుస్తక సమీక్ష

కపిలవాయి ప్రతిభకు ప్రతిబింబం.. సహమాన శతకం!
పేజీలు: 30, వెల : 40/-
ప్రతులకు:
కపిలవాయి ఆనందవర్ధన
17-110
వాణీసదనం, విద్యానగర్ కాలనీ
నాగర్ కర్నూలు-509209
మహాబూబ్‌నగర్ జిల్లా

ఆధునిక కాలపు కొలతలతో ముస్తాబైన ‘సహమాన శతకం’ డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారి ప్రతిభకు ప్రతిబింబంగా నిలువగలదు. ప్రాచీన కాలం నుండి నేటి వరకు వచ్చిన మార్పులను ఇందులో పొందుపరిచి కవి పాఠకులను మెప్పించ యత్నించారు. 1950 ప్రాంతంలో డాక్టర్ కపిలవాయి గారికి రంగయ్య పంతులుతో ఉన్న అనుబంధంతో ఈ శతకానికి ఆనాడే అంకురార్పణ జరిగినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ముద్రణకు నోచుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పదిలంగా దాచిపెట్టిన ఆ పద్యాలను పరిష్కరించి.. అవసరమైన మార్పులు చేర్పులు చేసి.. చక్కని కూర్పుతో విజ్ఞానదాయకమైన అంశాలతో డాక్టర్ కపిలవాయి తమ కుటుంబ సభ్యుల సహకారంతో పాఠకలోకానికి ఓ గ్రంథ రూపంలో అందించడం అభినందనీయం! ‘ప్రాచీన మానం’, ‘నవీనమానం’ శీర్షికలతో కాలాన్ని చక్కగా విశే్లషించారు. వీటితో పాటు ‘దేశమానం’, ‘మనుష్యమానం’ అంశాలను చక్కగా విశదీకరించారు.
అంతేగాక ‘గృహమానం’, ‘పొలం’ల గురించి ప్రస్తావించారు. ‘పొడవు కొలత’, ‘దారం కొలత’ ప్రస్తుత మానం తదితర అంశాలను చక్కగా ప్రస్తావించారు. ధాన్యం కొలతలను సోదాహరణంగా చర్చించారు. కొలతలకు సంబంధించి ‘జందెం’ ఎలా ఉండాలో ‘గాయత్రి లక్షణం’లో వివరించారు. మాలలక్షణం, మాత్రాది లక్షణం, వేద విభాగం మరియు తూకాలను క్షుణ్ణంగా విశదీకరించారు. ఔషధాలను, స్పూను, కప్పు, ఔన్సు, ద్రవమానంలో ఎలా తూకం వేస్తారో ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఇక ఆంగ్ల మానాలను ప్రస్తావిస్తూ.. కేలరీ శక్తి, స్క్వేర్‌మీటర్ తదితర అంశాలను ఇందులో చేర్చారు. వీటితో పాటు కాలం కొలత, చదరం కొలతలను ఇందులో చూస్తాం. ఆటల కోర్టుల లెక్కలనూ వీక్షిస్తాం. రాజమార్గాలు, రైల్వే ట్రాక్, విమానాశ్రయాలు, ప్రాచీన, ఆధునిక సేవా విభాగాలు, చాళుక్యుల కాలం నాటి పైకం లెక్క, కాకతీయుల కాలం నాటి లెక్క, తెలంగాణ లెక్క తదితర అంశాలను పక్కాగా ఈ గ్రంథంలో చెప్పారు. ఆంగ్ల నాణాలు, విదేశీ నాణాలు, రూపాయల పేర్లు, తెలంగాణ నాణాలను ఈ గ్రంథం ద్వారా తెలుసుకుంటాం.. ఏకార్థ మకుటంతో సాగే ఈ కావ్యం విజ్ఞానదాయకంగా మలచబడింది.

- సాన్వి. కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

వౌనం వీడి..!
గున్న ఏనుగుల్లా హుందాగా అందంగా
కన్నుల కింపుగా ఉన్న మేము
దగుల్బాజీ దళారుల కనుసైగలతో
తల్లడిల్లుతూ తరలించబడుతున్నాము
పల్లెకు పెట్టని కోట గోడల్లా ఉంటూ
పిల్లల ఆట పాటలకు అనుకూలంగా మారిపోతూ
పెద్దల కులాసా కబుర్లకు వేదికలౌతూ
పెద్ద దిక్కుగా పేరెన్నికగన్న మా వీపులన్నీ
కిరాతకుల గోళ్ల రక్కులతో
చీల్చబడుతూ నెత్తురోడుతున్నాయి!
తనువంతా ఖండ ఖండాలుగా నరకబడి
వికృత రూపంతో సాక్షాత్కరిస్తున్నాయ..
అధునాతన కట్టడాలకు ఆకర్షణీయంగా
పునాదులుగానో నునుపైన అరుగులుగానో
పర్యావరణ సమతౌల్యాన్ని పటాపంచలు చేసి
పతనవౌతూ పయనమై పోతున్నాము..
పచ్చని పరిసరాలన్నీ బావురుమంటూ
బిచ్చగాళ్లలా బతిమాలుతున్నా
కాళ్లకడ్డంబడి కనికరించండంటూ వేడుకుంటున్నా
నియంతలకు వంతపాడుతున్న నాయకులు
న్యాయ మార్గాన్ని వీడి అధర్మ పథంలో తిరుగాడుతున్నారు
ఓ వైపు సహజ వనరుల సత్తువ సన్నగిల్లుతుంటుంటే..
మరోవైపు శహభాషుగ రాష్ట్రం ఉందంటూ
బహురూపుల మాయగాళ్లు చంకలెగరేసుకుంటున్నారు..
మా గుండెల్లో గునపాలు దింపుతూ
నిట్టనిలువునా బాంబులతో పేల్చేస్తున్నారు!
కబ్జాగాళ్ల కబంధ హస్తాల్లో నలుగుతూ..
కమనీయ అందాలకు దూరంగా కనుమరుగైపోతున్నాము!
మహానీయుల్లారా వౌనం వీడి మహోద్యమం సాగించండి!
చారిత్రక ఆనవాళ్లకు సార్థకత కల్పించండి!!

- రాకుమార, గోదావరిఖని
సెల్.నం.9550184758

చిత్రం..్భళారే విచిత్రం..!
చిత్రం..్భళారే విచిత్రం..!
వేసవిలో..
తుఫాను వర్షపు గాలులు!
వర్షాకాలంలో..
మండే ఎండలతో భగ భగలు!
మంచు ముత్యాలు కురిస్తే..
శీతాకాలంలో..
ఎండాకాలంవోలే
ఆరుబయటే పడుకునే అవకాశం!
వీటికి తోడు
వాహనాలు వెదజల్లే కాలుష్యం!
పరిశ్రమలు..
పంచి పెట్టే వ్యర్థపదార్థాల రసాయనికం!
జనారణ్యంలో
ఆకాశ హర్మ్యాలు..
ఇక వాతావరణ సమతుల్యతకు
లేదు స్థానం!
చెట్లను పెంచడంతోనే
సాధించగలం శుద్ధ పర్యావరణం!
ప్రకృతిని అనుకూలంగా మలచుకుంటేనే..
జీవితం ఆనందమయం!

- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్
సెల్.నం.7702261031

లోకం నాడూ - నేడు
అలనాడు
పాండవులు అయిదు మందైనా
న్యాయం, ధర్మం వారి పక్షానే్న
ఉన్నాయనీ,
కౌరవులు నూరుమందైనా
వారి సంఖ్యకు భయపడకుండా
లోకం - పాండవుల విజయానే్న కోరి,
యుద్ధంలో వారు సాధించిన
దిగ్విజయానికి
హర్షాన్ని ప్రకటించింది!
కానీ..నేడు -
ఇప్పటి లోకానికి
ఆ న్యాయం, ధర్మం అక్కరలేదు!
సంఖ్యలో తక్కువగా ఉన్న
మంచివాళ్లనూ, అమాయకులనూ
క్రూరమైన విధికి నిర్ధాక్షిణ్యంగా
వదిలేసి
సంఖ్యలో ఎవరు ఎక్కువగా ఉంటే
వారికీ,
ఎవరి దగ్గర పుష్కలంగా
అర్ధబలం, అంగబలం ఉంటే వారికీ..
‘దాసోహం’ అంటూ
నిర్లజ్జగా లొంగిపోయి,
వారు అడగకుండానే
వారి పక్షాన భజనలు చేస్తూ
వారికే వంత పాడుతోంది ఈ లోకం!!

- రఘువర్మ, జగిత్యాల
సెల్.నం.9290093933

నవ్య గీతం
చూడాలి మనము, చూడాలి మనము
భావి భారత భవ్య రూపం!
పాడాలి మనము పాడాలి మనము
పల్లవించిన నవ్యగీతం!! ‘చూడాలి’
వెన్ను కడుపు ఏకమైన
వెన్నుపూస చలికి వణికె
వలువ లేక విలువ లేక
వీధి జీవనం వెక్కిరించగా
వెక్కి వెక్కి ఏడ్చువారి
బాధలన్ని తీరువేళను ‘చూడాలి’
వరద బురద వానలోన
ఒళ్లు మరిచి పంటలేసి
కాయ కష్టం చేసి మనకు
బ్రతకడానికి మెతుకు పంచి
కడుపు నిండా తిండి పెట్టి
పస్తులుండి బాధపడిన
రైతు మోమున వెలుగు రేఖను ‘చూడాలి’
మానవత్వం మరిచిపోయి
రాతి యుగమును గుర్తుచేయు
మారణాయుధమ్మించినట్టి
మతం కులం అడ్డు గోడలు
ఫెళ్లు ఫెళ్లున పగిలిపోగా ‘చూడాలి’

- ఎం.్భక్షపతి నాయక్
లక్సెట్టిపేట, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9492540770

నిత్య సత్యాలు!
కొందరిని మనం ఎంతగానో ఇష్టపడతాం
వాళ్లు మనలా కాదు
కొందరు మనల్ని ఎంతగానో ఇష్టపడతారు
మనం వాళ్లలా కాదు
ఎవరిదీ నేరం కాదు!
మనం ఓడిపోయినప్పుడు
గెలిచేస్తారనుకున్నవాళ్లే
అండగా నిలబడి మన మనసుల్ని
గెలిచేయవచ్చు
ఏమో గుర్రం ఎగరావచ్చు!
సంపద
ఒక స్థానాన్నివ్వవచ్చు కానీ
ఉన్నత స్థానాన్నివ్వగలిగేవి
నీ చేతలే
చూసి నడువు బాబూ!
నమ్మకం విషయంలో
యుగమూ క్షణమూ సమానమే...
కలిగించడానికి మొదటిది
చెరిపివేయడానికి రెండవది
జాగ్రత్త సుమా!

- సరస్వతి యశస్విని
ఎంబిబిఎస్ (ద్వితీయ)
కరీంనగర్
సెల్.నం.9963499137్ప

చిగురించని వసంతం!
మొదలుపెట్టిన చోటికే తిరిగి వచ్చినప్పుడు
దీపం కింద చీకటిని వెక్కిరిస్తూ...
ఒకడెవరో తెరవెనుక నీడలా కదలుతున్నాడు!
గతం తప్పిదాలను - అనుభవం నేర్పిన పాఠాలను
ఎన్ని ఒంటబట్టించుకుంటున్నా..
భవిష్యత్తు సోపానాలు -
ఇసుకలో కూరుకుంటున్న పాదాలు!
గ్లోబల్ కాటేజీలో అలజడి జన!
కొన్ని నమ్మకాల మూటలు
కొన్ని అమ్మకాల సరుకులు
విశ్వాసం తకరారు తక్కెడ కట్టుబాట్లలో..
ఎటూ మొగ్గుచూపని ఆలోచనలు!
ఉనికి ఎక్కడో రాతిగుహల్లో..
ఆదిమ శిలాజాల ప్రాదుద్భవాల్లో..
నీటి గీతల్లో.. నిప్పుమంటల్లో..
ఆవాసాలను లుప్తపరుస్తూ,
చేజిక్కిందే మేలిమైనదన్న విభ్రమ మోహపు వలల్లో...
శలభంలా మాడుతూ..
ఆవల తీరంలో..అత్యాశ నావపై
జీవన పయనం నేటిది!
ఎండమావుల్లో..
జాలి చూపని కర్కశ హృదయాల్లో...
చిగురించని వసంతం రేపటిది!!

- బి.కళాగోపాల్, నిజామాబాద్
సెల్.నం.9441631029

యువతరం
లక్ష్యం లేక
లౌక్యం ఎరుగక..
వ్యసనాల గుండాల్లో చిక్కి
బయటపడలేక..
విల విలలాడుతూ
కన్నవారికే కాదు..
అందరికీ భారమైపోతున్న
నేటి యువతరం..
ఇప్పటికైనా మేల్కోవాలి!
ఒక మంచి మాట కాదా
సన్మార్గపు పూదోట!
సజ్జన సాంగత్యంతో
పట్టండి సౌభాగ్యపుబాట!
చెల్లని పైసలా..
చెదిరిన కలలా
కారాదు యువత భవిత!
విద్యాదీపంతో
గమ్యం వైపు అడుగులేస్తూ..
మార్చుకోవాలి వారి తలరాత!!

- రాజమల్లు యాలల, కోహెడ
సెల్.నం.9908724156

సిరిశాల!
సిరిశాలగా భాసిల్లిన
సిరిసిల్ల..
నేడు ‘ఉరిశాల’యింది!
పేగులు ఎండి
పోగులు తెగి...
నేతన్నల బతుకులు
పిడికెడు
మెతుకులకు నోచక..
ఒక్కొక్కరు
నేలకొరుగుతుంటే..
మనసు తరుక్కుపోతోంది!
అగ్గిపెట్టెలో ఇమిడే..
చీరను నేసి అందరి
మనసుల్ని దోచిన వారు
ఆకలి మంటలతో..
మర మగ్గాన్ని వీడి..
చావుకు చేరువవుతుంటే..
హృదయం
కకావికలమవుతోంది!
ఇకనైనా..
పాలకులు
వారికందించాలి చేయూత!
బదికించాలి
సృజనాత్మక చేనేత!!

- గరిశకుర్తి రాజేంద్ర
కామారెడ్డి
సెల్.నం.9493702652

నిరీక్షణ
ఎండమావుల్ని చూస్తున్నాను
కొండంత ఆశతో..
నీళ్లు తాగాలని ఉంది!
ఇసుక తప్ప ఏమీ కనబడడం లేదు
ఇదొక ఎడారి
మేఘమా! దయతలుస్తావా?
నా దాహం తీరుస్తావా?
నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను!
ఎన్నాళ్లైనా, ఎనే్నళ్లైనా
ఒంటరిగా
కంటిపై కునుకు లేకుండా!

- డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net
నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- హనుమాండ్ల రమాదేవి