జాతీయ వార్తలు

న్యాయ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం నిర్ణయించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు, వివక్షతను కఠినంగా అరికట్టేందుకు మనవ వనరుల శాఖ పలు నిర్ణయాలను ప్రకటించింది. ఈ వర్గాలకు చెందిన విద్యార్థులకు తోడ్పడేందుకు మెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించటంతోపాటు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు, సీనియర్ పరిపాలనాధికారులు, ఇతరులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. న్యాయ విచారణ కమిషన్ తమ నివేదికను మూడు నెలల్లో అందజేయవలసి ఉంటుంది. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆదేశం మేరకు హైదరాబాద్ వెళ్లి కేంద్ర విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్యపై దర్యాప్తు చేసి వచ్చిన ద్విసభ్య సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం పరిణామాలపై జుడీషియల్ విచారణ జరపాలని నిర్ణయించారు.న్యాయ విచారణ సంఘం రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేయటంతోపాటు విశ్వవిద్యాలయంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకోవలసిన చర్యలను కూడా సిఫార్సు చేయవలసి ఉంటుంది. స్మృతి ఇరానీ శుక్రవారం రోహిత్ తల్లితో టెలిఫోన్‌లో మాట్లాడి ఆత్మహత్య పట్ల తమ విచారాన్ని వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యలాంటి సంఘటనలు ఉన్నత విద్యా సంస్థల్లో ఇక మీదట జరగకుండా చూడటం కూడా ఈ న్యాయ విచారణ లక్ష్యమని మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను ఉన్నత విద్యా సంస్థల పరిపాలకులు అర్థం చేసుకునేందు కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది. కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన అందరు వార్డెన్లు, పరిపాలన శాఖ సిబ్బంది, రిజిష్ట్రార్లు తప్పని సరిగా ఈ కార్యక్రమాలకు హాజరు కావలసి ఉంటుందని తమ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఓరియంటేషన్ కార్యక్రమం కోసం ఒక ప్రత్యేక మాడ్యూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. దళిత, బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల నుండి వచ్చే ఫిర్యాదులు, మనో వేదనలను వెనువెంటనే పరిశీలించి పరిష్కరించేందు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో అన్ని రకాల వివక్షతల పట్ల జీరో సహనం విధానాన్ని అవలంభిస్తారని ప్రకటించారు. ఈ విషయంలో అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక చార్టర్‌ను విడుదల చేస్తామని మానవ వనరుల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఉన్న ఐఐటిలో అమలు చేస్తున్న పీర్ గ్రూప్ ఆసిస్టెడ్ లర్నింగ్ (పిఏఎల్) విధానాన్ని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు వర్తింపజేయాలని మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఈ పథకం కింద దళిత, బడుగు, బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు, ఇతర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లను ఏర్పాటు చేస్తారు. మెంటర్లు ఈ వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్య తదితర రంగాల్లో సహాయ సహకారాలు అందజేస్తారని మానవ వనరుల శాఖ ప్రకటించింది.