మెయిన్ ఫీచర్

ఓటెందుకు వేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు ‘ఓటర్స్ డే’

జనాభీష్టాన్ని ప్రతిఫలించినపుడే ప్రజాస్వామ్య వ్యవస్థకు సార్థకత ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు. తమ మనోభావాలను ప్రకటించేందుకు జనం చేతిలో ఉన్న పదునైన ఆయుధం ‘ఓటు’. రాజకీయ పార్టీల జాతకాలను మార్చే సత్తా తమకు ఉందని మన దేశంలో ఓటర్లు ఇప్పటికే పలుసార్లు నిరూపించారు. మహామహానేతలను మట్టికరపించి, ఓటు ద్వారా మార్పు తథ్యమని జనం తమ వివేకాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో. ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమంటే పెద్ద యజ్ఞమే. పాలనావ్యవస్థపై అసంతృప్తి పెల్లుబికినపుడు అధికారంలో ఉన్న నేతలను గద్దె దింపిన ఘనత మన ఓటర్లకు ఉంది. అయినా, ఇప్పటికీ మన దేశంలో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతోంది. కొన్నివర్గాల వారు మాత్రమే పోలింగ్ పట్ల ఉత్సాహం చూపుతున్నారు. ‘ఓటు వేయడం కనీస బాధ్యత’ అని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రచారం చేస్తున్నప్పటికీ పట్టణ వాసుల్లో మాత్రం పూర్తిస్థాయిలో మార్పు రావడం లేదు. పల్లె నుంచి పార్లమెంటు వరకూ ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న నినాదం ఇపుడు మార్మోగుతోంది. ఓటుహక్కుపై అన్ని వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు ఏటా జనవరి 25న ‘జాతీయ ఓటరు దినోత్సవం’ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆడియో, వీడియో ప్రదర్శనలతో పాటు క్విజ్, వ్యాసరచన, ఆటల పోటీలు, వీధి నాటికలు, పాటల పోటీలు, పలు కళాప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం) వినియోగంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.స్థానిక సంస్థలు, చట్టసభలకు ఎన్నికలు జరిగినపుడు ఓటర్లంతా పోలింగ్‌కు వెళ్లాలన్న ఉద్దేశంతో పోలింగ్ రోజును సెలవుదినంగా ప్రకటిస్తున్నారు. విద్యాధికులు, పట్టణ వాసుల్లో చాలామంది పోలింగ్ రోజును విశ్రాంతి దినంగా భావిస్తూ ఓటు వేసేందుకు మాత్రం సుముఖత చూపడం లేదు. ఈ ధోరణిలో మార్పు తెచ్చేందుకే ‘ఓటరు దినోత్సవం’ పేరిట పలు అవగాహన కార్యక్రమాలను ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఓటర్లుగా నమోదైన వారికి గుర్తింపు కార్డులను ఈరోజున అందజేస్తారు.
అధికారంలో ఉన్న నేతలు పాలనలో విఫలమైనపుడు మార్పు రావాలని జనం కోరుకుంటే అందుకు ఏకైక సాధనం ఓటు. తమకు నచ్చిన వారికి అధికారం కట్టబెట్టి తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఓటు మాత్రమే అవకాశం కల్పిస్తుంది. పాలకులపై అసంతృప్తి ఉన్నపుడు, మార్పు అనివార్యమని భావించినపుడు ఓటర్లంతా విధిగా పోలింగ్ బాట పట్టాలి. ‘మనం ఓటు వేయకపోతే ఏం?..’ అన్న అలసత్వం పనికిరాదు. ఎన్నికల వ్యవస్థలో ప్రతి ఓటూ విలువైనదే. మన అభిప్రాయాలను తెలియజేసేందుకు విధిగా ఓటు వేయాలన్న చైతన్యం ప్రతి వ్యక్తిలో రావాలి. ఓటుహక్కు కలిగి ఉండడం ఈ దేశ పౌరుడిగా ఒక గౌరవం, ఓటు వేయడం కనీస బాధ్యత అని ఓటర్లంతా గుర్తించాలి. ప్రజల గళం వినిపించాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ఓటర్లుగా నమోదై, ఓటు వేయడం తప్పనిసరి అని అందరూ ప్రతిజ్ఞ చేయాలి. విజ్ఞత కలిగిన భారతీయ ఓటర్లు పలుసార్లు చారిత్రక నిర్ణయాలు తీసుకుని విదేశాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. పరిపాలన సజావుగా సాగాలన్నా, సరైన నేతలకు పగ్గాలు ఇవ్వాలన్నా- అది ఓటు ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని ‘ఓటరు దినోత్సవం’ సందర్భంగానైనా అందరూ మననం చేసుకోవాలి.

పోలింగ్ బాటలో మగువలు..

‘ఓటమి గుణపాఠంతో తప్పులు సరిదిద్దుకొని విజయం సాధించు.. విజయం ఇచ్చిన అనుభవంతో మరిన్ని శిఖరాలు చేరేందుకు ప్రణాళికాబద్ధంగా నడుచుకో..’-అన్న మాటలు అనేక దేశాల్లో మహిళలు ఓటు హక్కు సాధించుకోవడం ద్వారా ఆచరణ సాధ్యమని తేటతెల్లమైంది. పురుషాధిక్యత కారణంగా ఇన్నాళ్లూ వివక్షకు గురైన మహిళల విషయంలో ఇపుడు ప్రపంచం దృష్టి మారుతోంది. మత ఛాందసవాదానికి ఆలవాలమైన ముస్లిం దేశాల్లో సైతం మహిళలకు ఇపుడు ఓటుహక్కు కల్పిస్తున్నారు. కరడుకట్టిన మత విశ్వాసాలకు నిలయమైన సౌదీ అరేబియాలో ఇటీవల మహిళలకు ఓటు హక్కు కల్పించడమే గాక, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా తొలిసారిగా అవకాశం కల్పించారు. గత నెలలో సౌదీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 978మంది మహిళలు పోటీ చేయగా, 18మంది వివిధ పదవులకు ఎన్నికయ్యరు.
ఆ ఘనత ఇంగ్లాండ్‌దే..
ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటుహక్కు కల్పించాలన్న ఉద్యమం ఇంగ్లాండ్‌లో పుట్టింది. స్ర్తిలకు ఓటు హక్కు కల్పించాలని బ్రిటీష్ పార్లమెంట్‌లో 1867లో జాన్ సువార్ట్‌మిల్ ప్రతిపాదించగా 194 మంది ఎంపీలు వ్యతిరేకించారు. 73 మంది ఎంపీలు మాత్రమే మద్దతు తెలపడంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. 1893లో బ్రిటీష్ వలస రాజ్యమైన న్యూజిల్యాండ్ తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించి యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. మహిళలకు ఓటుహక్కు కల్పించాలన్న డిమాండ్‌తో 1897లో ‘నేషనల్ యూనియన్ ఆఫ్ ఉమెన్స్ సఫ్రంజ్ సొసైటీస్’ పేరిట మిలిసెంట్ పౌసెట్ అనే మహిళ ఒక సంస్థను ఏర్పాటుచేశారు. ఓటుహక్కు సంపాదించేందుకు ఉద్యమాలే శరణ్యం అంటూ 1903లో ఎమ్మిలీనె ఫంకృస్ట్ అనే మహిళ ‘ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్’ను ఏర్పాటు చేశారు. ఆమె నుంచి స్ఫూర్తి పొందిన అమెరికా మహిళలు ఓటుహక్కు సాధనకు 1914లో ‘కాంగ్రెషనల్ యూనియన్’ను ఏర్పాటుచేసి, రెండేళ్ల తరువాత దానిని ‘నేషనల్ ఉమెన్స్ పార్టీ’గా మార్చారు. తమ ఉద్యమంలో భాగంగా మహిళలు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్‌హౌస్’ ముందు ఆందోళనలు చేపట్టారు.
1918లో ఆస్తి కలిగి, 30 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు బ్రిటన్‌లో తొలిసారిగా ఓటు హక్కు కల్పించారు. 1928లో 21 ఏళ్లు నిండిన స్ర్తిలందరికీ ఓటుహక్కు కల్పించారు. మహిళల ఆందోళనల ఫలితంగా అమెరికా ప్రభుత్వం 1920లో 19వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఓటుహక్కు కల్పించింది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2020 సంవత్సరంలో ప్రముఖ మహిళ ఫొటోతో పది డాలర్ల కరెన్సీ నోటు విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకూ అమెరికా కరెన్సీ నోట్లు లేదా నాణాలపై మహిళా నేతల చిత్రాలు లేకపోవడం గమనార్హం. 1929లోనే జర్మనీ, డెన్మార్క్,కెనడాలో మహిళలకు ఓటుహక్కు కల్పించారు.
1944లో ఫ్రాన్స్‌లో, 1950లో భారత్‌లో మహిళలకు ఓటుహక్కు కల్పించారు. ఒకప్పుడు భూటాన్‌లో ఇంటికి ఒక ఓటు మాత్రమే ఉండేది. పురుషులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనేవారు. 2008లో లింగభేదం లేకుండా వయోజనులందరికీ అక్కడ ఓటు హక్కు కల్పించారు. కువైట్‌లో 2005లో మహిళలకు ఓటు హక్కు కల్పించగా, 2009 ఎన్నికల్లో తొలిసారిగా నలుగురు స్ర్తిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన మయన్మార్ పార్లమెంటు ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అధినేత్రి అంగ్‌సన్ సూకీ ఓటర్లలో చైతన్యం రగిలించి భారీ మెజారిటీ సాధించారు.

-పి.హైమావతి