రాష్ట్రీయం

వైభవంగా ముక్కోటి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జనవరి 24: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన పవిత్ర తీర్థాల ముక్కోటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించినట్లు టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలో ప్రముఖమైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు పాపవినాశనం డ్యాం చెంత అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ సప్తగిరులలో ముక్తిప్రదమైన సప్తతీర్థాల్లో శ్రీ రామకృష్ణ తీర్థం ప్రముఖమైందన్నారు. శ్రీ రామకృష్ణ మహర్షి తపోబలంతో సృష్టింపబడినట్లుగా ప్రాశస్త్యం ఉందని చెప్పారు. ప్రతియేటా మకర మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి పర్వదినంనాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందుకోసం టిటిడి అటవీ, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల సిబ్బందిని ముందుగా తీర్థానికి పంపి అక్కడ సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. వారి కోసం ముళ్లపొదలు తొలగించడం, లోయలో తాడు సాయంతో భక్తులు దిగేందుకు వీలుగా ఏర్పాట్లు, కర్ర నిచ్చెనలను ముందస్తుగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. పాపవినాశనం డ్యామ్ వద్ద సుమారు 10 వేల అల్పాహారం, ఆహారపొట్లాలు సిద్ధం చేసి భక్తులు తీసుకెళ్లేందుకు వీలుగా కవర్లలో అందించారు. దారి పొడవునా తాగునీటి పొట్లాలు అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు రెండు అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ రామకృష్ణ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరాముడు, శ్రీకృష్ణస్వామి వార్లను దర్శించుకున్నారని ఆయన తెలిపారు.
ప్రకృతి ఒడిలో ప్రయాణం
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేశారు. పాపవినాశనం డ్యామ్ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర అడవిలో కాలినడకన ప్రయాణించి తీర్థానికి చేరుకున్నారు. దారి పొడవునా పెద్దపెద్ద వృక్షాలు, ఎత్తయిన కొండలతో కూడిన ప్రకృతి రమణీయ దృశ్యాలు భక్తులకు కనువిందు చేశాయి. లోయలాంటి పల్లపు ప్రదేశంలో దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరం మేర నడక సాగించడం మరపురాని అనుభూతిని కలిగించింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు గోవింద నామస్మరణ చేసుకుంటూ నడక సాగించారు. తిరుపతి పరిసర ప్రాంతాల భక్తులతో పాటు తమిళనాడు వాసులు ఎక్కువగా విచ్చేశారు. అంతకుముందు వైభవోత్సవ మండపం నుంచి ఫలపుష్పాదులు, ఛత్రచామరాలు, ఇతర పూజాసామాగ్రి, మంగళ వాయిద్యాలతో బయలుదేరి ఉదయం 10 గంటలకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ నైవేద్యం వండి స్వామివార్లకు సమర్పించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుని విగ్రహాలకు పాలు, పెరుగు, తేనె, చందనం తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, అన్నప్రసాదం డిప్యూటీ ఇవో వేణుగోపాల్, శ్రీవారి ఆలయం పేష్కార్ సెల్వం, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్ర్తీ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.