Others

బోలెడు ఖాళీలు.. భారీగా కొలువులు..!

  • 03/02/2012

నిరుద్యోగ యువతకు నిజంగా శుభవార్తే.. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు నోటిఫికేషన్లను ప్రకటించగా, సమీప భవిష్యత్‌లో ఖాళీల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. 2012లో 40,854 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. గత ఏడాది 37,158 మంది ఉద్యోగులు రిటైర్ కాగా, ఈ ఏడాది ఈ సంఖ్య భారీగా ఉంటోంది. ప్రభుత్వ శాఖల్లో 18,961 మంది, మండల పరిషత్‌ల్లో 3074 మంది, జిల్లా పరిషత్‌ల్లో 1745 మంది, వివిధ కార్పొరేషన్లలో 10931 మంది పదవీ విరమణ చేయనున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు, న్యాయశాఖ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకార సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, దేవాలయాలు, చట్టసభలు, వివిధ జిల్లా గ్రంథాలయ సంస్థలు, ఇతర విభాగాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైరవుతున్నారు. రాబోయే మూడేళ్లలో భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నందున ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఖాళీలను నింపేందుకు ఎ.పి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే పలు ప్రకటనలను విడుదల చేసి, పోటీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2014లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నందున ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే అవకాశాలున్నాయి. ఎన్నికలకు ముందు ఉద్యోగాల భర్తీకి మరిన్ని నోటిఫికేషన్లు వెలువడే పరిస్థితి కనిపిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో సైతం యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ‘రాజీవ్ యువకిరణాలు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇచ్చి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading