డైలీ సీరియల్

పూలకుండీలు - 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చెబితే పోనియ్యదుగాని చెప్పకుంటనే పోతే నాలుగు రోజులు ఏడ్చి అదే వూకుంటది’’ అన్న ఆలోచన చేసిన ఎల్లయ్య ‘‘సర్లే కానియ్యి నువ్వు చెప్పినట్టే రేపు కంపెనీకి బొయ్యి ఆర్‌ఇ సార్‌తో నేను రావట్లేదని చెప్పొస్తాలే’’ అంటూ నిద్రలోకి జారుకున్నవాడిలా నటించాడు ఎల్లయ్య.
మరునాడు పొద్దునే్న కంపెనీ దగ్గరికెళ్లి ఆర్‌ఇని కలిసిన ఎల్లయ్య ‘‘సార్! మీరు చెప్పినట్టే మీతోపాటు బొంబాయికి వస్తా’’ అంటూ తన సమ్మతిని తెలయజేశాడు.
‘‘వస్తానంటే వస్తానుగాదు. వస్తే మాత్రం అక్కడి సైట్లో పని పూర్తయ్యేదాకా వుండాలి మరి’’ అన్నాడు ఆర్.ఇ సుధాకర్ ఎల్లయ్య వంక చూస్తూ.
‘‘ఎన్నాల్లు పడ్తుంది సార్!’’ ఆర్‌ఇని వినయంగా అడిగాడు ఎల్లయ్య.
‘‘ఎంత లేదన్నా రెండేండ్లు పడుతుంది’’ ఆలోచిస్తూ చెప్పాడు ఆర్.ఇ.
‘‘సరే సార్! వుంటా’’ అన్నింటికీ సిద్ధపడుతూ బదులిచ్చాడు ఎల్లయ్య.
దాంతో వెంటనే రెండు వేలు తీసిచ్చిన ఆర్‌ఇ ‘‘ఎల్లుండి పొద్దునే్న మిషన్ ఎక్కించుకొని ట్రక్స్ బయలుదేరుతాయి. ఈలోగా నువ్వు మీ ఇంట్లో చెయ్యాల్సిన ఏర్పాట్లు చేసుకునిరాపో...’’ అంటూ పంపించాడు.
కంపెనీ నుండి ఇంటికి వెళుతూ వెళుతూ బజార్లో ఓ వెయ్యి రూపాయల వెచ్చాలు కట్టించుకొని వెళ్లాడు ఎల్లయ్య.
ఆ వెచ్చాలను చూసిన శాంతమ్మ ‘‘ఇయ్యెక్కడదెచ్చావ్!’’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది.
‘‘ఎల్లుండి మా కంపెనీ బండ్లు సామానె్లత్తుకొని బొంబాయి బోతున్నై ఆ బండ్లెమ్మటి బొయ్యి సామాన్లు దించిరమ్మని మా ఆర్‌ఇగారు రెండు వేలిచ్చిండు. అంత పెద్దాయిన డబ్బులు చేతిలో బెట్టి కొంచెం పోయిరమ్మంటే కాదనలేక ఒప్పుకున్నా. నేను పొయ్యొచ్చిందాకా ఈ వారం రోజులు చేతి ఖర్చులకుంచు’’ అంటూ తన దగ్గర మిగిలిన వెయ్యి రూపాయల్లోనుండి తన ఖర్చుల కింద ఐదొందలు వుంచుకుని మిగిలిన ఐదొందలు తీసి శాంతమ్మకిచ్చాడు ఎల్లయ్య.
భర్త అసలు ఆలోచన తెలియని శాంతమ్మ ‘‘నిజమే కాబోలు’’ అనుకుని గుడ్డిగా నమ్మింది.
భార్య నమ్మకాన్ని చూసిన ఎల్లయ్య అంతరంగంలో ‘‘నేను బొంబైపోతూ తప్పు చెయ్యడం లేదు గదా?’’ అన్న సందిగ్ధతకు లోనౌతూ శాంతమ్మ వంక చూడసాగాడు
‘‘ఏంది ఎన్నడు జూడనోనిలెక్క నాకెల్లి అట్ల జూస్తున్నావ్?!’’ భర్త వారంరోజులపాటు తనను వదిలిపెట్టి పోలేక అలా చూస్తున్నాడన్న భావన మనసు వీణను మృదువుగా మీటుతుంటే అదో విధమైన సంతోషంతో ముఖం ఎర్ర మందారంలా విప్పారుతుంటే ముసి ముసిగా నవ్వుతూ అంది శాంతమ్మ.
‘‘ఔనట్లనే జూస్తా నా సొత్తు నా ఇష్టం. కాదనేదెవరిక్కడా?’’ భార్య వంక మురిపెంగా చూస్తూ అన్నాడు ఎల్లయ్య.
ఆ మాటలు విన్న శాంతమ్మ కొత్త పెళ్లికూతురులా సిగ్గుపడుతూ బుర్రుపిట్టలా గుడిశలోకి తుర్రుమంది.
ఇవన్నీ అర్థంగాని పిల్లలు నలుగురూ తండ్రితెచ్చిన జిలేబీ వూరించుకుంటూ తినడంలో లీనమైపోయారు.
కొడుకు కోడలు ఇద్దరూ చాలా రోజుల తరువాత ఆనందంగా కన్పించడంతో ముసలివాళ్లిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ సంతోషంగా ఇంటిబైటికి తప్పుకున్నారు.
అనుకున్న ప్రకారం మూడవ రోజు పొద్దునే్న కంపెనీ వాళ్ళతోపాటు ముంబై బయలుదేరిపోయాడు ఎల్లయ్య.

7
వారం రోజుల్లో తిరిగొస్తానని చెప్పి ముంబై వెళ్లిన ఎల్లయ్య ఆ వెళ్ళడం వెళ్ళడం మూడు నెలలైనా ఇంటి ముఖం చూడకపోవడంతో పాటు ఫోన్లు కూడా చెయ్యడంలేదు. దాంతో శాంతమ్మ వాళ్ళు భయాందోళనలకు లోనౌతూ కంపెనీ దగ్గరికి వెళ్లి తెలిసినవాళ్ళనల్లా ముంబై వెళ్లిన కంపెనీని గురించి, ఎల్లయ్యను గురించి ఆరా తియ్యసాగారు.
అయితే ఓ రోజు ఎల్లయ్యను ముంబై తీసుకుపోయిన ఆర్‌ఇ సుధాకర్ శాంతమ్మకు ఫోన్ చేసి ‘‘మీ ఆయన ఇంకో వారం పది రోజుల్లో ఒకసారి పాల్వంచ వచ్చి వెళతాడుగాని మీరేం కంగారు పడకండి! అతను మా దగ్గరే వున్నాడు’’’ అంటూ వెంటనే ఫోన్ పెట్టేశాడు.
డబ్బులకు ఇబ్బందిగా వున్నప్పటికీ ‘సర్లే ఆయనైతే మంచిగున్నాడని తెలిసింది అంతే చాలు’ అనుకుంటూ అప్పటికి సంతృప్తిపడింది శాంతమ్మ.
ఎంత సంతృప్తిపడినా ముసలివాళ్ళతో, పిల్లలతో నానా అవస్థలు పడుతుండడంతో అప్పుడప్పుడూ ‘‘ఈ సంసారాన్నంతా కంప తొడుగు మాదిరిగా నా నెత్తినేసి పొయ్యి జబ్బరకొండ అనుకుంట బొంబాయిల కూసోని కులుకుతుండు’’ అనుకుంటూ అతని కోసం కొండకు ఎదురుచూసినట్టు చూడసాగింది.
ఇక్కడ శాంతమ్మ పరిస్థితి ఇలా వుంటే అక్కడ ఎల్లయ్య పరిస్థితి ఇంతకన్నా అధ్వాన్నంగా వుంది.
ముంబై వెళ్లిన నెల రోజులకే ‘దూరపు కొండలు నునుపు’ అన్న నిజం ఎల్లయ్యకు పూర్తిగా అర్థమైపోయింది.
ముంబైలో వెల్డర్‌గా తనకు వస్తున్న జీతానికీ అవుతున్న ఖర్చులకూ లెక్క చూసుకుంటే పాల్వంచలో హెల్పర్‌గా చేసినప్పుడొచ్చిన తక్కువ జీతంతోనే కలో గంజో తాగి భార్యా పిల్లలతో హాయిగా బ్రతికాడు. నెల రోజులకే కుటుంబమంటే ఏంటో దాని విలువేంటో పూర్తిగా తెలిసొచ్చిన తను ‘ఇంటికెప్పుడు పోయిరావాలిరా దేవుడా’ అన్నట్టు ఎదురుచూడసాగాడు. ఎంత ఎదురుచూసినా సైట్లో పని ఒత్తిడి ఎక్కువగా వుండడంతో ఎవ్వరికీ శెలవన్నమాట ఇవ్వడంలేదు.
తన ఇంటి పరిస్థితులు వివరించి తప్పనిసరిగా ఒకసారి వెళ్లిరావాలని చెప్పుకుందామంటే పాల్వంచ నుండి తనను తీసుకొచ్చిన ఆర్‌ఇ సుధాకర్ వచ్చిన రెండవ రోజే అర్జెంట్ అవసరం మీద ఢిల్లీ సైట్‌కి వెళ్లిపోయాడు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు