డైలీ సీరియల్

బంగారుకల 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడప్పుడు వచ్చే మంజరి కోసం కృష్ణసాని ఎదురుచూడటం జరిగేది కాదు. అందులోనూ మంజరిని రాజభవనానికి చేర్చాక కృష్ణసాని మరింత హాయిగా నిద్రపోతున్నది.
తల్లి గాఢ నిద్ర చూసి నిట్టూర్చి తన కక్ష్యలోకి ప్రవేశించిన మంజరి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి వుండటం చూసి నిర్ఘాంతపోయింది. ఎవరో తన గదిలో దేనికోసమో వెదికారన్న వాస్తవం అర్థం అయింది. తన గదిలోని భద్రపేటికలో తనపైన అతి నమ్మకంగా చంద్రప్ప దాచిన రహస్య పత్రాలు మాయమ్యాయని గుర్తించిన మంజరి వణికిపోయింది. రాజాగ్రహానికి గురికావలసి వస్తుందనే భయంతో ఆ రాత్రంతా జాగారమే చేసింది.
****
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీతో సమావేశ మందిరంలో దీర్ఘ చర్చల్లో మునిగి ఉన్నారు.
‘‘అప్పాజీ! మీరు చెప్పిన విషయాలకు మా మనసు కల్లోలపడుతున్నది. మనమేం చేయలేమా?’’
‘‘రాయా! రాజ్యక్షేమం రాజు వ్యక్తిగత అంశాలకన్నా ముఖ్యమైంది. అన్నపూర్ణాదేవిగారు సకల సద్గుణశీల. గజపతుల ఇంటి ఆడపడుచుగా తగిన మర్యాదలు కోరటం సహజం.
‘‘మనమూ ఏ విషయంలోనూ తీసిపోనివారమే!’’ రాయలు పౌరుషంగా అన్నాడు.
‘‘నిజమే! రాయా! కానీ చెప్పుడు మాటలు ఎంతటివారలకైనా చేటు చేస్తాయి. మీరు అన్యథా భావించకపోతే ఆ వీరేంద్రుని.. అదే.. అన్నపూర్ణాదేవి వెంట ఈ రాజ్యానికి వచ్చిన ఆమె బంధువు. అతనిని ఓ కంట కనిపెట్టడం మంచిది’’ సాలోచనగా అన్నాడు తిమ్మరసు మంత్రి.
‘‘నిజమే గజపతులకు మనమీద ప్రేమాభిమానాలుంటాయని ఎప్పటికీ అనుకోలేము. మన సైన్యాధికారులందరినీ అప్రమత్తుల్ని చేయండి అప్పాజీ. చిన్నపామైనా పెద్ద కర్రను ఉపయోగించాల్సిందే’’
‘‘మంచిది రాయా! నేనిక వెళ్లివస్తాను’’
తిమ్మరుసు వెళ్లిపోయాక కృష్ణరాయలు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
***
మంజరి కంగారుగా హాజారా రామ దేవాలయ ప్రాంగణంలో కదంబం చెట్టునీడలో ఎదురుచూస్తున్నది చంద్రప్ప కోసం! అతను ఎంతకీ రాలేదు. మనసును సమాధానపరచుకొని ఆలయానికి ప్రదక్షిణం చేస్తున్నది.
హజారామ దేవాలయం పేరుకు తగ్గట్టు రామాయణ కాలం నాటి కిష్కింధాపురిలో నిర్మించబడినందున ప్రాకారాల గోడమీద లోపలివైపు రామాయణ గాధంతా శిల్ప చరిత్రగా లిఖించబడి వుంది. వెలుపలివైపు ఐదారు వరుసలుగా వీర సైనికులు, అశ్వాలు, ఏనుగులు, విజయనగర సైన్య శక్తిని చెబుతున్నట్లున్నాయి. ప్రధాన దైవమయిన విష్ణువు, బుద్ధునిగా కన్పించడం ప్రత్యేక ఆకర్షణ. ఇది రాజవంశీకులు దర్శించే ఆలయం కావటాన ఎక్కువగా జనం లేరు.
ఎన్నోసార్లు చూసిన దేవాలయమైనా ఆనాడు మంజరి ప్రత్యేకంగా ప్రతి శిల్పాన్ని శ్రద్ధగా చూస్తూ పరిశీలిస్తూ ముందుకు నడిచింది. ఎంతటి నిష్ణాతులైనా శిల్పులయితేనే ఇది చెక్కగలుగుతారు! చంద్రప్ప ఎంతకీ రాడేం? జరిగింది చెప్పాలని తనెంత ఆతురతతో ఉంది.
దేవాలయ శిల్పాలమీద మనసు నిలవడంలేదు. ఇంతలో దూరంగా చంద్రప్ప కనిపించాడు. ఆ నడకలో మునుపటి చురుకుదనం లేదు.
‘‘చంద్రా! ఎదురెళ్లి కౌగిలించుకుంది. అతనామెను దగ్గరకు తీసుకొని దేవాలయం ప్రాంగణంలో అరుగుమీద కూర్చుండబెట్టాడు.
‘‘ఎలా జరిగింది? ఎవరి పని?’’ అడిగాడు.
‘‘తెలియటంలేదు. కంటకుని పనేమో! మొన్న రాత్రి జరిగిన సంఘటనలు రెండూ జోడించి ఆలోచిస్తే మనమీద కాదు, విజయనగరం మీదే ఏదో కుట్ర జరుగుతున్నట్లనిపిస్తుంది’’
‘‘రహస్య పత్రాలు దొంగిలించబడినట్లు తిమ్మరుసులవారికి తెలియాలి’’
‘‘వారు చారచక్షువు. వారికీపాటికి తెలిసే వుంటుంది. నన్ననుమానిస్తే ఎలాగా అనే ఆలోచిస్తున్నాను’’
‘‘నువ్వే వెళ్లి తిమ్మరుసు మహామాత్యుల వారికి జరిగింది విన్నవించు. అమాత్యులు ప్రజ్ఞావంతులు. విచక్షణతో వ్యవహరిస్తారని నా నమ్మకం’’.
ఆమె విశ్వాసాన్ని అతను ఖండించలేదు.
‘‘సరే! నేను తిమ్మరుసులవారిని కలుస్తాను. అంతా విరూపాక్షుని దయ’’
విచారంగా వెళ్లిపోతున్న చంద్రప్పను అలాగే చూస్తుండిపోయింది మంజరి.
అతను తిమ్మరుసును కలవలేదనీ వీరేంద్రుని కుట్రవల్ల దారిలోనే రాజభటులు రాజద్రోహం నేరం కింద అతన్ని బందీని చేసి చెరసాలలో పెట్టారనీ మరో నాలుగు దినాలదాకా మంజరికి తెలిసే అవకాశమే లేదు.

4
శ్రీకృష్ణదేవరాయలవారు చాలాకాలం తర్వాత భువన విజయ సభా మండపాన్ని అలంకరించబోతున్నారన్న వార్తతోపాటు ఆహ్వానాలు అందుకున్న కవి పండితులంతా ఆనందాతిరేకంతో విచ్చేశారు.
అప్పాజీ అత్యున్నతంగా ఏర్పాట్లు చేయించాడు. కవులతోపాటు సామంతులు, దండనాయకులు, నగర ప్రముఖులు ఆసీనులైనారు. అంతఃపుర స్ర్తిలు ఆ ప్రతిష్ఠాత్మక దృశ్యాన్ని చూడటానికి ఏర్పాట్లు చేశారు.
శ్రీకృష్ణదేవరాయ ప్రభువు అప్పాజీతో కలిసి సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారిరువురు కృష్ణార్జునుల్లా తేజరిల్లుతున్నారు.
సభ యావత్తూ లేచి నిలబడి వారికి స్వాగత వచనాలు, జయజయధ్వానాలు పలికింది.
కృష్ణరాయలు అందరికీ ముకుళిత హస్తాలతో వందనమాచరించి సింహాసనమలంకరించారు. రాయలవారి వామపక్షాన కూర్చున్న తిమ్మరుసు మంత్రివర్యులు నిలబడి సభనుద్దేశించారు.
‘‘ఈ విజయనగర సామ్రాజ్యం వైభవోపేతమైన హిందూ రాజ్యంగా మీ అందరి ఆదరాభిమానాలను చూరగొని విలసిల్లుతున్నది. పరస్పర కలహాల కారణంగా కల్లోలపడిన హిందూజాతి విద్యారణ్యులవారి ఆశీస్సులతో సామ్రాజ్యరూపంలో స్థిరపడింది.
శ్రీకృష్ణదేవరాయలవారి బహుపరాక్రమంతో అవిచ్ఛిన్నంగా దక్షిణాపథానికి కూడా విస్తరించిన విజయనగర సామ్రాజ్యం నేడు కటకం దాకా ఏలుబడి సాధించింది.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి