డైలీ సీరియల్

బంగారుకల -15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతుల కుమార్తె విజయనగర ప్రభువుకు రాణిగా ఆహ్వానింపబడింది. ఈ శుభ సందర్భంగా ప్రభువులు తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని రాజ్యక్షేమానికి ప్రార్థించి వచ్చారు. తిరుమలేశుని కృపవలన విజయనగర రాజ్యం సుస్థిరమైంది. అవకాశం కోసం పొంచి వున్న శత్రువులెందరున్నా మసి చేయగల శక్తిని సముపార్జించింది.
ఈ సభలో ఆసీనులైన అందరికీ స్వాగతిస్తున్నాను. మన భువన విజయంలో కొలువుదీరిన అష్టదిగ్గజ కవుల గురించి ఎంత చెప్పినా తక్కువే!
‘‘స్తవ్యాంధ్ర కవితా పితామహ బిరుదాంకు
డలసాని వంశ పెద్దన మనీషి...............
రాయలకు నష్టదగ్గజ ప్రథిత కవులు’’
ఈ సరస్వతీ సభలో రాయలవారిని ఆశీర్వదించి ఆనందింపజేస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ముగించారు తిమ్మరుసు మంత్రి.
శ్రీకృష్ణదేవరాయలు అపర్ణవిష్ణువులా సభలోనివారితో ప్రసంగించారు.
‘‘శ్రీ విద్యారణ్యస్వామి ఆశీఃప్రభావంతో తేజరిల్లుతున్న విజయనగర సామ్రాజ్యం ధర్మరక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు సాహితీ, సాంస్కృతిక వికాసానికి, సకల కళాభివృద్ధికి కంకణం కట్టుకుంది. మమ్మల్ని పరిరక్షకులుగా ఎంచుకుంది. నిరంతర యుద్ధ వ్యహాలతో అలసి వేసారిన మాకు నేడీ భువన విజయసభ ప్రసన్నతను ప్రసాదించగలదని నమ్ముతున్నాను’’
సభలోని పండితులు హర్షాన్ని కరతాళ ధ్వనులతో ప్రకటించారు. మంజరి రసరమ్యంగా నాట్యప్రదర్శన చేసింది. ఆమె ఆలపించిన వీరగీతం రాయలనుత్తేజితుడ్ని చేసింది.
శ్రీ విజయనగర పరిపాలకా
దివిజన దివ్యార్జిత ఏలికా.....
నీకు నీవే సాటి మా దైవరాయా!
జరుూభవ! విజరుూభవ! ...............
జరుూభవ! విజరుూభవ!
నాట్యం ముగిసింది. నతశిరస్కురాలై నమస్కరించింది మంజరి.
ఆమె నాట్యానికి విజయనగర వైభవ ప్రశంసకు ప్రభువు ప్రసన్నుడయ్యారు.
‘‘బాగు బాగు! నర్తకీమణీ! నీ నాట్యం, గానం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. అందుకో ఈ సత్కారం’’ అంటూ అంగుళీయాన్ని బహూకరిస్తున్న ప్రభువుకేసి కృతజ్ఞతలో చూసింది మంజరి.
తిమ్మరుసు మహామంత్రి సాలోచనగా చూశాడు.
కంటకుడు పళ్ళు నూరుకుంటున్నాడు.
మంజరి వినయంగా ప్రభువుకు నమస్కరించి తిమ్మరుసు మంత్రికేసి ఓసారి అర్థవంతంగా చూసి నిష్క్రమించింది.
శ్రీకృష్ణదేవరాయలు కవులనుద్దేశించి ఇలా ప్రశంసించాడు.
‘‘మా అభ్యుదయం ధ్యేయంగా విజయ నిధులుగా భాసించే కవికదంబం మేము జైత్రయాత్ర సాగించినప్పుడు కూడా మాకు స్ఫూర్తినందించి వెంట నడిచారు’’ అంటూ అప్పాజీ కేసి చిరునవ్వుతో చూశాడు.
సేవకులు బంగారు పళ్ళెంతో గండపెండేరం తెచ్చి సభలో వుంచారు.
‘‘సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పినవారి పాదానికి ఈ గండపెండేరాన్ని స్వయంగా నేనే తొడుగుతాను. వారే దీనికి అర్హులు’’ అన్నాడు రాయలు.
ఎవరూ ముందుకు రాలేదు. రాయలు విచారించాడు.
‘‘ముద్దుగ గండ పెండియరమున్..........
యొక్కరు గోరగ లేరు లేరొకో’’
అని ప్రశ్నించాడు.
ఇంతలో పెద్దన కవీంద్రుడు తన ఆసనముపైనుండి లేచి-
.................పెద్దన కీదలంచినను పేరిమి
నాకిడు కృష్ణరాణృపా’’- అన్నాడు...
‘‘ఆంధ్ర కవితా పితామహా! మీరు అంతటి ఘనులే! పూర్వతరాల సంస్కృతాంధ్ర కవుల స్ఫూర్తిని గ్రహించి తెలుగు సంస్కృత సాహితీ మాలికను విన్పించండి కవిశేఖరా’’ కోరారు శ్రీకృష్ణదేవరాయ ప్రభువు.
పెద్దన అపర సరస్వంతి రూపుదాల్చినట్లు గళం విప్పాడు.
‘‘పూతమెఱుంగులుం బసరు పూపబెడంగులు జూపునట్టి .........................
గాతల దమ్మి చూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు .....................
రాతిరస ప్రసార రుచిర ప్రతిమంబుగ సారెసారెకున్’’
భువన విజయ సభాప్రాంగణం రసహృదయుల కరతాళ ధ్వనులతో మారుమోగింది. రాయలు పులకాంకితుడయ్యారు.
‘‘సంస్కృతాంధ్ర కవితా విశారదా! మీరు నిజంగా పెద్దనే! ఈ గౌరవాసనం అలంకరించండి. ఇదిగో! ఈ గండపెండేరాన్ని స్వయంగా మేమే మీ పాదానికి అలంకరిస్తాము. నేటి నుండి మీరు ‘ఆంధ్ర కవితా పితామహు’లన్న కీర్తిని గడించారు’’ అన్నారు రాయలు.
‘‘ఈ గౌరవం సంస్కృతాంధ్ర సరస్వతికి ప్రభూ’’ పెద్దన కవీంద్రుడు ప్రభువుకు నమస్కరించాడు.
ఈ సందర్భంగా ఒక కృతిని రచించి అంకితమిస్తానని పెద్దన సభాముఖంగా రాయలకు వాగ్దానం చేశారు.
సింహాసనాసీనులైన రాయలు ఆ విద్వత్సభలో తన సాహిత్యాభిమానాన్ని నిరూపిస్తూ తాను పూనుకున్న కావ్యరచన గురించి ఇలా వెల్లడి చేశారు.
‘‘మేము కళింగ దండయాత్రకు వెడలినపుడు కృష్ణాతీరంలో ఇంద్రకీలాద్రిని దర్శించి కానుకలర్పించి ముందుకు సాగాము.
కృష్ణాతీరంలోనే శ్రీకాకుళంలో ఆ రాత్రి సైన్యంతో విడిది చేశాము. ఆనాడు వైకుంఠ ఏకాదశి. మేము నిర్జలోపవాసంలో ఉన్నాము. సమీపంలో ఏదైనా వైష్ణవ దేవాలయం ఉందా అని అనే్వషించగా ఆంధ్ర నాయకుడైన శ్రీకాకుళాంధ్ర దేవుని ఆలయం వుందని తెలిసింది. ఆ రాత్రి ఆలయంలో విడిది చేసి కవిగోష్ఠి జరిపాము. మన ఆస్థానంలోని మహాకవులు తమ కావ్యాలనుండి రస గుళికల వంటి పద్యాలు వినిపించారు. రాత్రి అక్కడే నిద్రించాము. జాగరణ రాత్రి నిద్రలో అపూర్వ దివ్య స్వప్నంలో ఆంధ్ర నాయకుడు సాక్షాత్కరించాడు’’

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి