డైలీ సీరియల్

పూలకుండీలు 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతసేపటికి తేరుకున్న శాంతమ్మ ‘‘పిల్లలు పదిలం’’ నేను పనికిపోయొస్తా’’ అంటూ గబగబా మైనింగ్ కాలేజీ కాలనీ దారి పట్టి సాగిపోయింది.
ముసలోళ్లిద్దరూ పిల్లల్ని వెంట తిప్పకుంటూ ఇంట్లో పనులు చక్కబెట్టసాగారు.
అట్లా మరో పది రోజులు గడిచిపోయాయి.
ఆ పదిరోజులూ రోజూ ఉదయం సాయంత్రం ఆసులోని కండె మాదిరిగా డబ్బులు డబ్బులంటూ శాంతమ్మ ఇంటిచుట్టూ కాబూలీవాలా తిరిగినట్టు తిరగసాగాడు ఆర్‌ఎంపి లింగయ్య.
అతని ధాటికి తట్టుకోలేక కోడలు పడుతున్న ఇబ్బందులు చూసీ చూసీ ఇంక ఓర్చుకోలేక ఆఖరికి ఓ రోజు ఇంటికొచ్చిన ఆర్‌ఎంపి లింగయ్యతో ‘‘చూడు కొడకా! నువ్ రోజు పొద్దు మాపు ఇంటిమీదికొచ్చి పైసలు, పైసలంటే యాడికెల్లొసె్తై చెప్పు?
మా కొడుక్కానుంచి పైసలు రాంగనే ఇస్తమని చెబుతున్నంగదా ఇన్పిచ్చుకోవేంది?’’ బరిశ చేతబట్టి వెంటబడి తరుముతుంటే ప్రాణభయంతో పరుగులు తీసి తీసి ఇంక తియ్యలేక వేటగాడి బారి నుండి తప్పించుకోలేనని తెలిసినప్పుడు సాధు జంతువైన లేడికూడా తెగింపుతో అటో ఇటో తేల్చుకోడానికి సిద్ధమై ఒక్కసారిగా చిరుతపులి మాదిరిగా ఎదురుతిరిగినట్టు మాట్లాడారు శాంతమ్మ అత్తమామలు.
ఆ ముసలి దంపతుల తిరుగుబాటుకు ఒక్కసారిగా విస్తుబోయిన ఆర్‌ఎంపి లింగయ్య ‘‘తీసుకున్నోళ్ళకు మీకే ఇంతగీరుంటే, ఇచ్చినోళ్ళకు మాకెంతుండాలి? అంత రోషముంటే వెంటనే మా డబ్బులు మాకు పారెయ్యండి. ఎవరైనా ఇంతే అవసరమున్నపుడు ఒక తీరుగా, అవసరం తీరినంక ఇంకో తీరుగా ఇట్లనే మాట్లాడతారు. అయ్యాల మీ కోడలు ఏమని చెప్పి బతిమిలాడిందో మీకు తెలుసా?’’ అంటూ అతను కూడా గట్టిగానే మాట్లాడాడు.
‘‘నువ్వు ఎంత అరిసి గీపెట్టినా ఇప్పుడు మాకాడ ఎర్ర నయాపైసా లేదు. అయినా అన్ని పైసలు ఒక్కసారి మాకాడ ఎట్ల దొరుకుతాయను కుంటున్నారు? ఇదంతా ఎందుగ్గాని ఆ ఫైనాన్సోలొచ్చి ఏదో రేటు గట్టి మా ఇంటి జాగా తీసుకొని వాళ్ళ బాకీ బోను వందో యాభయో మిగిలితే మా పైసలు మాకిచ్చిపొమ్మను. ఆ తరువాత మాదారిన మేం ఇంకెటన్న బొయ్యి బతుకుతాంగాని’’ ఇంటికి పెద్ద దిక్కుగా జరుగుతున్న విషయాలకు మనసు నొచ్చుకుంటుంటే చూస్తూ... ఊరుకోలేక తెగించి నిర్ణయాన్ని కుండబద్దలు గొట్టినట్లు తెలియజేశాడు శాంతమ్మ మామ మల్లయ్య.
మామ నిర్ణయాన్ని విన్న శాంతమ్మ ఔననలేక, కాదనలేక అలా మైనపు బొమ్మలా నిలబడిపోయింది.
ముసలాయన దూకుడికి ఒకింత విస్తబోయినా అంతలోనే తేరుకున్న ఆర్‌ఎంపి లింగయ్య ఎలాగైతేనేమి ఆఖరికి తన అంచనా ఫలించబోతుందన్న ఆనందాన్ని లోలోపలే అణచుకుంటూ ‘సరే మీ ఇష్టం, మీకెట్లా బాగుందనుకుంటే అట్లాగే కానివ్వండి. కానీ ఒక్కమాట, ఆర్‌ఎంపి లింగయ్య మాకు డబ్బులిప్పించి ఇంటి స్థలం కాజేశాడని తరువాత నన్ను బదనాం జెయ్యొద్దు. ఇప్పటికైనా మించిపొయ్యిందేం లేదు మీరు ముగ్గురూ కూర్చొని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి’’ అవసరమైతే మీ కొడుక్కి కూడా మళ్ళోసారి ఫోన్ చేసి విషయం చెప్పండి. నేను మళ్లా ఎల్లుండొస్తా, అప్పటికల్ల ఏదో ఒకటి తేల్చుకోండి’’ అంటూ అప్పటికి తోక జాడించి వెళ్లిపోయాడు.
అతను వెళ్లిపోయిన తరువాత కోడలి ముఖం వంక చూస్తూ ‘‘వాడు నిన్ను అన్నన్ని మాటలంటుంటే చూడలేక ఏదో కోపంలో నోటికొచ్చినట్లు మాట్లాడాను బిడ్డా! నా మాట నీకేం పాటిగాని నీ మనుసుల ఉద్దేశం ఎట్లుంటే అట్లజెయ్యి’’ అంటూ కోడలికి సంజాయిషీ ఇస్తున్నట్లుగా మాట్లాడాడు మల్లయ్య కళ్ళనీళ్ళు తీసుకుంటూ.
‘‘లేదు మామా! నేను చేసిన తప్పుకు మీరంతా ఇబ్బంది పడాల్సొస్తుందే అన్న బాద నన్ను ఒక్కచోట కాలునిలువనియ్యడంలేదు’’ అంటూ కన్నకూతురులా మామను పట్టుకొని వలవలా ఏడ్చింది శాంతమ్మ.
‘‘నీ కడుపుల అట్టాంటి రందేం పెట్టుకోకు బిడ్డా! నువ్వు రంది పెట్టుకొని ఆరోగ్యం పాడుజేసుకుంటే నీ బిడ్డలు ఆగమైతరుగాదు. అయినా గోసికంటే దరిద్రమేముందిలే తియ్? ఎట్టయ్యేది అట్టనే అయ్యిద్ది’’ అంటూ కోడలిని ఊరడించారు మల్లయ్య, కమలమ్మ దంపతులు.
ఆలోచించుకోడానికి మూడు రోజులు గడువిచ్చి వెళ్లిన ఆర్‌ఎంపి లింగయ్య వారం రోజుల దాకా మళ్లా వెనక్కి తిరిగి చూడలేదు.
వారం రోజులవుతున్నా అతనెందుకు రావడంలేదో అర్థంగాక ఎదురుచూడసాగారు శాంతమ్మ వాళ్ళు.
ఇంతలో...
‘కాలం కలిసిరానప్పుడు పైమీద కండువానే పామై కరిసినట్టు?’ అప్పులవాళ్ళ గొడవలో బడి ఇండ్లల్లో పనికి కూడా సరిగా వెళ్ళలేకపోతున్న శాంతమ్మను ఆ మైనింగ్ కాలేజీ కాలనీ వాళ్ళంతా కూడబలుక్కున్నట్టుగా ‘‘మేం ఇల్లు గట్టుకుంటున్నాం సాయం చెయ్యండమ్మా! అంటూ మా కాళ్ళా వేళ్ళాబడి ప్రాధేయపడితే పోనే్ల పాపం పేదముండ యాడికి పోద్ది, పొద్దున లేస్తే మన కళ్ళముందే పడి ఉంటుందిగదాని వడ్డీ వడ్డీ లేకుండా డబ్బులిస్తే ఇచ్చిన కాణ్ణుండి సరిగ్గా పనికే రాకపోతుంటివి.
పనిమనిషి రాకపోతే మాకు ఒక్క క్షణం గూడా గడవదు. ఆ విషయం నీగ్గూడా తెలుసు. తెలిసి కూడా ఇలా మాటిమాటికీ పనెగ్గొడుతున్నావంటే మేమేమనుకోవాలి? ఇక నువ్వొద్దు నీ పనొద్దుగాని లెక్క జూసి మా డబ్బులు మాకియ్యి’’ అంటూ ఓ రోజు గట్టిగా నిలేశారు.
‘‘మీరట్లంటే ఎట్లమ్మా!? నా పరిస్థితి బాగలేకనే పనికి రాలేకపోతున్నగాని వేరే పనికిపోట్లేదుగా? అయినా ఇగనుంచి రోజూ నాగా లేకుండా పనికొస్తాగాని ఎప్పటిమాదిరిగానే నెల నెలా నా జీతంలో నుంచే ముదరాజూసుకోకండమ్మా! అయ్యాల నాకాడ డబ్బుల్లేకనే మీకాడ అప్పు తీసుకుంటినిగదా?

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు