డైలీ సీరియల్

బంగారుకల -20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీవన్నదానిలో అణుమాత్రమయినా అసమంజసం లేదు. రేపు తిమ్మరుసులవారిని కలిసి నీ కోరిక విన్నవిద్దాం’’ ఒప్పుకున్నాడు చంద్రప్ప.
‘‘మన వివాహం విరూపాక్ష మందిరంలో జరగాలి’’ ఆమె కోరింది.
‘‘ఎంత చక్కని యోచన చేశావు మంజూ! విజయనగర సామ్రాజ్య రక్షకుడా ప్రభువు. అతని కృపతోనే మనం ఒకటవుదాం’’ అతనూ సంతోషించాడు.
‘‘చంద్రా! ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. ఆహార ధాన్యాలకు కొదవలేదు. విజయనగర వీధుల్లో కెంపులు వజ్రాలు, నీలాలు, పచ్చలు, ముత్యాలు, రత్నాలు అమ్మటం చూసి పరాయి మూకలు ఈ రాజ్యంపై కనే్నస్తున్నారు ముఖ్యంగా బహమనీలు’’.
‘‘అవును. రాయచూర్‌ని రాయలవారు జయించాక ముసల్మానులకు కనె్నర్ర అయింది. వర్తకం పేరుతో శత్రు గూఢచారులు విరివిగా విజయనగరంలోకి ప్రవేశిస్తున్నారని సమాచారం’’.
‘‘ఈ వ్యాపకంలో నీ నృత్యసాధన కూడా మర్చిపోతున్నావు’’ ఆమె ధ్యాస మళ్లించటానికి అన్నా అంతకుముందు మంజరి నోట వెలువడినవి చంద్రప్ప మనసులోని ఆలోచనలే.
‘‘తెలుగు భాషను అందలం ఎక్కించిన రాయలవారు దేవేరుల కోసం మూడు మందిరాలు నిర్మించారు కదా! వాటిని చూశావా మంజూ!’’
‘‘చూశాను! తిరుమలదేవి శివాలయం, చిన్నాదేవి కృష్ణ మందిరం, అన్నపూర్ణాదేవి జగన్నాథ మందిరం. ఏమా దేవాలయాల వైభవం! ఎవరెన్ని మందిరాలు ఏర్పాటుచేసుకున్నా వారి హృదయ మందిరంలో కొలువైంది శ్రీకృష్ణదేవరాయలవారే గదా!’’
‘‘మరి మా హృదయరాణి మందిరంలో ఎవరో!’’
‘‘ఇంకెవరూ’’ అనివైపు చూపింది. నాట్యం లాంటి నడకతో నునుసిగ్గుతో అతని చేతుల్లో వాలిపోయింది మంజరి.
అప్పటిదాకా రాజ్యశ్రేయస్సు గురించి గంభీరంగా చర్చించిన మంజరి పెళ్లి ప్రసక్తి రాగానే సిగ్గుపడటం చూసి ‘ఆడవారి మనసు ఆర్ణవం లాంటిది’ నవ్వుకున్నాడు చంద్రప్ప.
***
ఆ రోజు విజయనగరం నిజంగానే విద్యానగరమై సరస్వతీ నిలయమైన సత్యలోకంలా భాసిల్లుతున్నది. ప్రభువు మందిరం నుండి ఎదురుగా ఉన్న రాజమార్గం ఇరుప్రక్కలా మంత్రులూ, రాజోద్యోగులు, సేనానాయకులు, రాజబంధువులు, ప్రజలు, అష్టదిగ్గజ కవులు నిలబడి తిలకిస్తున్నారు. ప్రభువు మందిరంలోంచి అందమైన బంగారు పల్లకీ బయటికి వచ్చింది పల్లకీలో ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన ఆసీనులై ఉన్నాడు.
రాజమార్గానికిరువైపులా మామిడి తోరణాలు, మార్గమధ్యంలో రంగవల్లులు అలంకృతమై వున్నాయి.
శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సర్వలంకార భూషితుడై తెల్లని పట్టువస్త్రాలు ధరించి అప్పాజీతో మందిరం వెలుపలికి వచ్చారు.
పల్లకీ వెనుక కొమ్ము పండివర్యులు పట్టారు. సాహితీ పిపాసి, భువన వజియాధిపతి, ఆంధ్రభోజుడు, తెలుగు లెస్స అని పల్కిన కళావాచస్పతి, హిందూ సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజితుడు. మూరురాయర గండడైన శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సంస్కృతాంధ్రాలలో సమానంగా కవితా మాలిక నల్లిన వేళ కాలికి గండపెండేరము తొడిగించుకొన్న ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన అధిరోహించిన బంగారు పల్లకీని తన భుజాన మోయటం తెలుగువారి చరిత్రలోనే అపూర్వ సంఘటనగా నిల్చింది. నాడు చూసిన వారి కన్నులదే అదృష్టం.
హర్షధ్వానాలతో విజయనగర రాజమార్గం మారుమ్రోగించింది. ప్రభువు భాషానురక్తి, కవులపట్ల వారికున్న గౌరవం భావితరాలవారికి ఆదర్శప్రాయమై నిలిచిన శుభవేళ అది.
***
ప్రధాన శిల్పాచార్యుడు శిల్పులందర్నీ సమావేశపరిచాడు. హంపీ విజయనగరంలో నిర్మితమవుతున్న దేవాలయాల నిర్మాణానికి ఎందరో శిల్పులను విభిన్న ప్రాంతాలనుండి రప్పించటం జరిగింది. వారందరితో ప్రధాన శిల్పాచార్యుడు ఇలా ప్రస్తావించాడు.
‘‘దక్షిణ భారతదేశంలో అచిరకాలంలో ఏకైక చక్రవర్తిగా కీర్తిగడించి హిందూ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన ఆంధ్రభోజుడు కృష్ణరాయ ప్రభువుల వారు అటు కదనరంగంలోనూ ఇటు కవన రంగంలోనూ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సాధించారు. రాయలవారు దైవభక్తి, కళాపోషణ, ప్రజాసేవానురక్తి, దయ, మానవీయత, వీర పరాక్రమం పెద్దలయందు గౌరవం గల గొప్ప రేడు. మహామంత్రి తిమ్మరుసు ప్రభువుకు మంత్రి కావటం వారికే కాదు మనందరి అదృష్టం.
ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ప్రభువు, మహామంత్రి, వారికి హృదయాన్నర్పించి సేవ చేసే సేనావాహిని, న్యాయాధికారులు, దండనాయకులు, రాజ్యక్షేమం కోరే కవి పండితులున్న రాజ్యం మన విజయనగరం. రాత్రింబవళ్ళు ఆడా మగా తేడా లేకుండా నిర్భయంగా తిరగగలిగే పరిపాలన ప్రభువు మనకిచ్చారు. వీధుల్లో రత్నాలు అమ్ముతున్న రాజ్యం ఇది. కొత్తవారొస్తే మర్యాదలు చేసి గౌరవించే పౌరులున్న రాజ్యం మనది. కక్షలు, కార్పణాలు మచ్చుకైనా కానరాని ఈ శాంతి సామ్రాజ్యంలో మనలాంటి కళాకారులు మనస్ఫూర్తిగా కళాసేవలో తరించగల అవకాశం వుంది.
కళాకారునికి ఎక్కడైతే రాజాశ్రయం దొరుకుతుందో, ఎక్కడైతే కళాకారులు అన్నవస్త్రాలకు కష్టపడక మనశ్శాంతిగా సంపూర్ణంగా కళారాధనలో నిమగ్నవౌతారో ఆ రాజ్యంలో సిరిసంపదలు విలసిల్లుతాయి. శారదాదేవి కొలువుతీరుతుంది. తిరుమలేశుని, విరూపాక్షుని సమానంగా అర్చిస్తూ హరిహరతత్వాన్ని ఆరాధించే రాయలవారు అనేక ఆలయాలు, కళామందిరాల నిర్మాణాలను తలపెట్టడం మనందరికీ తెలుసు.
మనలాంటి శిల్పులందరినీ పోషించి రాళ్లలో రాగాలు పలికింపజేసే ప్రభువాయన. మనందరం ఐక్యభావనతో ఈ హంపీని శిల్పారామంగా తీర్చిదిద్దుదాం.
నిన్ననే తిమ్మరుసు మహామంత్రి నిర్మిస్తున్నవి, సంకల్పిస్తున్నవి, మరెన్నో వివరించారు. ఈ ఆలయాల సృష్టికి విశ్వకర్మ అబ్బురపడేట్లు మన ఉలులతో శిలలకు ప్రాణం పోయటానికి కంకణం కట్టుకోవాలి. ఏమంటారు?’’
శిల్పాచార్యులు సుదీర్ఘ గంభీర వాక్కుకు శిల్పులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

- ఇంకా ఉంది

- చిల్లర భవానీదేవి