డైలీ సీరియల్

బంగారుకల- 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయలు అప్పాజీకి, అందరికీ అభివాదం జేసి సింహాసనం అధిష్ఠించాడు. రాయల దేవేరులు కూడా ఉచితాసనాన్ని అలంకరించారు.
పెద్దనామాత్యుడు రాయల కీర్తిని నుతిస్తూ...
‘‘ఉదయాచలేంద్రంబు ...........శ్రీకృష్ణదేవరాయాగ్రణ్యు’’
అని ఆశీర్వదించాడు. రాయలు చిరునవ్వుతో నమస్కరించాడు. నందితిమ్మన్నగారు రాయలను వినుతిస్తూ..
‘‘ఉదయా.............. శ్రీకృష్ణరాయవిభుడు’’
రాయలు అంజలి ఘటించి కృతజ్ఞతలు తెలిపాడు. సంగీత సాహిత్య కోవిదులున్న ఆ సభలో ఒకే ఒక వ్యక్తి రాయలకేసి కార్పణ్య దృష్టితో చూస్తున్నాడు. వీరేంద్రునికీ వైభోగం ఆనందం కల్గించటం లేదు.
విజయయాత్రలకు కారకులైన సేనానాయకులందరినీ ప్రభువు ఘనంగా సత్కరించాడు. అప్పాజీ సభనుద్దేశించి ప్రసంగించారు.
‘‘దక్షిణాన విలసిల్లుతున్న ఈ సువిశాల హైందవ సామ్రాజ్యం విద్యారణ్యులవారి ఆశీఃబలంతో ఏర్పడింది. మనవారి అనైక్యత, ఈర్ష్యాసూయలు, స్వార్థంవల్ల ఇంకా పరదేశీయులను ఆపలేకున్నాము. రాయలవారి గురించి నా కలలు నెరవేరాయి.
ప్రభువు పరాక్రమశౌర్యులు, వినయశీలురు, ఆదర్శనీయులు, యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు, వికలాంగులయిన వారికి తగిన పరిహారం, పారితోషికాలు ఇస్తున్నాం. నిద్రాహారాలు మాని విజయనగరం కోసం శ్రమిస్తున్న మన వీరులందరికీ అభినందనలు. విజయనగర కేతనం చిరకాలం వినువీధిలో రెపరెపలాడాలని అభిలషిస్తున్నాం’’ అని ముగించారు.
‘‘నా జీవనదాత, రాజ్యానికి మూలశక్తి మాకిన్ని విజయాలనందించి మమ్మల్నీ సింహాసనంపైన నిలిపిన మా అప్పాజీవారిని ఎలా గౌరవించినా తక్కువే అవుతుంది. అందుకే వారిని మా గౌరవప్రదమైన అభిమాన కౌగిలిలో బంధింపదలిచాము’’ రాయలు గంభీర వచనాలతో అప్పాజీని మనసార కౌగిలించుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీల మధ్య అతులితమైన ఆ ప్రేమానుబంధాన్ని చూసి సభ పులకించింది. కాని ఆ దృశ్యాన్ని చూసి కళ్ళ నిప్పులు రాలుస్తున్నది వీరేంద్రుడుడొక్కడే.
‘‘ఈ మైత్రి ఇంకెన్నాళ్లులే’’ అనుకున్నాడు. అప్పటికే అతని మనసులో ఒక విషపన్నాగం రూపుదిద్దుకుంది. రాజు అంగరక్షుడిగా వీరేంద్రుని ముఖ కవళికలు చురుగ్గా గమనిస్తున్నాడు చంద్రప్ప.
నాటి సభ కవి పండిత సత్కారంతో ముగిసింది.
***
తిమ్మరుసు మహామంత్రి ఆస్థాన జ్యోతిష్కులతో సమావేశమయ్యారు.
‘‘ఈ పరిస్థితుల్లో రాయలవారి జన్మకుండలి విశేషాలు సెలవీయండి జ్యోతిష్యవర్మా’’ తిమ్మరుసు గూఢంగా అడిగారు.
‘‘చిత్తం మహామంత్రీ’’ జ్యోతిష్యవేత్త తాళపత్రాలు చూసి రాయల జాతకం గణన చేసి నిట్టూర్చాడు.
‘‘ఏమయింది? రాయలవారి గ్రహస్థానాలు ఎలా ఉన్నాయి?’’ ఆందోళనగా అడిగాడు తిమ్మరుసు. ఆ వృద్ధుని వదనంలో రాయలపైన ప్రేమ పొంగిపొర్లుతోంది. రాజ్యభద్రత గురించిన బాధ్యత ప్రస్ఫుటంగా కన్పిస్తున్నది. జ్యోతిష్యవేత్త మంద్రస్వరంతో చెప్తున్నాడు.
‘‘చక్రవర్తి జన్మకుండలి ప్రకారం శని, సూర్య, మంగళ గ్రహాల కలయికవల్ల హాని జరిగే సూచనలున్నాయి’’.
‘‘దీనికి శాంతి లేదా’’
మనసులోని ఆందోళన బయపడనీయని ధీరుడు తిమ్మరుసు మంత్రి.
‘‘ఉంది మంత్రివర్యా! రాయలవారి రాజయోగానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి ఆ దోషం తొలిగేదాకా సింహాసనంపై కూర్చోరాదు’’.
‘‘సరే. మీరు వెళ్ళొచ్చు’’ జ్యోతిషవేత్తను పంపేసి తిమ్మరుసు ఆలోచనలో పడ్డారు. కాస్సేపట్లోనే ‘‘రాయలవారి మందిరానికి పల్లకీ సిద్ధం చేయండి’’ సేవకుల్ని ఆజ్ఞాపించారు.
తిమ్మరుసు అనుకోకుండా తమ మందిరానికి రావటం రాయలకు ఆశ్చర్యం కలిగించింది. అప్పాజీ వివరించిన విషయాలు సావధానంగా విన్నారు రాయలు. ఇద్దరూ గురుదేవులయిన వ్యాసరాయలవారి కుటీరానికి ప్రయాణమయ్యారు.
వ్యాసరాయలవారి కుటీర ప్రాంగణం మునివాటికలా ప్రశాంతంగా ఉంది. ఎతె్తైన వృక్షాలు, పూలచెట్లు, లేళ్లు, నెమళ్లు ఆ ఆశ్రమ వాతావరణంలోకి అడుగుపెడితేనే ఎవరికైనా వేదనలు, బాధలు తీరిపోతాయి. ఆవరణంతా శుభ్రంగా అలికి ముగ్గులు తీర్చి ఉంది.
విజయనగర మహా సామ్రాజ్యాధీశుడయిన శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు మహామంత్రితో వచ్చి వ్యాసరాయల ముంగిట యాచకుడై నిలిచారు.
గురుదేవులయిన వ్యాసరాయలు పరమ ఆదరంతో రాయలకు ఎదురేగి లోపలికి తోడితెచ్చాడు. భద్రాసనాలను అలంకరింపజేశారు.
‘‘రాయా! ఏమిటీ ఆకస్మికాగమనం?’’ వ్యాసరాయలి ప్రశ్నకు రాయలు తిమ్మరుసువైపు అర్థవంతంగా చూశారు.
‘‘గురువర్యా! కృష్ణరాయలి జన్మకుండలి రీత్యా యోగభంగం వుంది’’ తిమ్మరుసులవారు వ్యాసరాయలితో చెప్పారు. వ్యాసరాయలు కలవరంగా చూశారు.
దీనికి ఎన్ని జపహోమాలు చేయించినా ఉపశాంతి లేదన్నారు, తిమ్మరుసు తానే మళ్లీ చెప్పారు.
‘‘అయితే?’’ వ్యాసరాయలు ఆలోచనగా అన్నాడు.
‘‘అందుకే అర్థులమై వచ్చాము. కృష్ణరాయలకీ యోగభంగం కొద్దిరోజులు మాత్రమే ఉంది. మీరీ దోషకాలం రాయల సింహాసనం అధిష్ఠిస్తే ఆ దోష నివారణ జరుగుతుంది’’ అభ్యర్థనలోనే అధికారాన్ని మేళవించారు తిమ్మరుసు.
‘‘కానీ..’’ వ్యాసరాయలు సంకోచం వెలిబుచ్చాడు.
‘‘కాదనకండి గురుదేవా!’’ మీరు తప్ప దోషహరణం చేయగల సమర్థులు మరొకరు లేరు. నా ప్రార్థన మన్నించి విజయనగర సింహాసనంపై చక్రవర్తిగా కొన్ని దినాలు రాజ్యపాలన చేయండి. మేమంతా మీ వెంట దోయిలొగ్గి ఉండగలం’’ కృష్ణరాయలు అంజలి ఘటించారు.
విశాలమైన కనుదోయి, నిలువనామం, రాచఠీవి, జ్ఞాన తేజస్సుతో, భుజ పరాక్రమంతో వెలుగొందే కృష్ణరాయలు తన ఎదుట అలా కైమోడ్చి ప్రార్థిస్తుంటే వ్యాసరాయల మనసు శిష్యవాత్సల్యంతో కరిగిపోయింది.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి