డైలీ సీరియల్

బంగారుకల - 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవరుల పౌరుష విన్యాసాలైన ఖడ్గం, బల్లెం, అశ్వారోహణం, గజారోహణం మొదలైన విద్యలన్నీ రాజసముఖంలో ప్రదర్శనకు సిద్ధమైనాయి. విజయనగరంలో రత్నాల వర్తకులంతా మరిన్ని మేలి రత్నాలను రాసులుగా పోసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. వివిధ రత్నాభరణాల భూషణాలు ధరించిన స్ర్తి పురుషులు ఆనందాతిరేకంతో నృత్యాలు చేస్తున్నారు.
క్రీడామైదానంలో వివిధ క్రీడాకారుల పాటవ ప్రదర్శనలు జరుగుతున్నాయి. కూచిపూడి మొదలైన నృత్య సమారాధనలతో రాజ్య జనాభా అంతా విజయనగరం చేరిందా అన్నట్లున్నది. పది లక్షల సైన్యం కవాతు చేస్తూ విజయనగర కీర్తి తోరణాన్ని వెలిగిస్తున్నది.
తోలుబొమ్మల కళాప్రదర్శనలు, యక్షగానాలు, కోలాటాలు ఒకటేమిటి, విజయనగరమే ఒక సుందర కళావేదికగా మారిపోయింది.
‘విజయమందిరం’ సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. ఈ వేదికను ‘సింహాసన వేదిక’ అని కూడా పిలుస్తారు. ఇది ప్రాచీన విజయనగర రాజుల వైభవాన్ని చాటటానికి ఆదర్శ ప్రాయమైన వేదిక. మూడు నాలుగు నెలల ప్రయాణం చేయవలసినంత దూర ప్రాంతాలనుండి, రాజ్యాలనుండి సామంత రాజ ప్రభువులు అక్కడ సమావేశం కావాలని విజయనగరాధీశుని ఆజ్ఞ.
విజయనగరానికి వచ్చే దారులన్నీ సముద్రాన్ని చేరే నదీ ప్రవాహాల్లా ఉన్నాయి. మేఘల్లా గర్జిస్తూ అంబారీలతో అలంకరించబడి ఏనుగులమీద గారడీ విద్యల వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు పైనుండి సుగంధ పరిమళాల జల్లుల్ని కురిపిస్తూ తమ వెంట వేల ఏనుగుల్ని తీసుకొస్తున్నారు. ఆ ఏనుగులన్నింటికి చెవులు, నొసట, తొండంమీద వివిధ రంగులతో అతి విచిత్ర సుందరమైన చిత్రాలను చిత్రించారు. అవి చూసేవారికి ఆసక్తికరంగా ముగ్ధుల్ని చేస్తున్నాయి.
‘విజయమందిరం’ అని పిలిచే దసరా దిబ్బ మందిరం ముందు తొమ్మిది అంతస్తుల శిలాస్తంభాలతో కూడిన భవనాలున్నాయి. మహారాజు సింహాసనం తొమ్మిదవ అంతస్తులో విరాజిల్లుతున్నది. విదేశీ రాయబారులు, యాత్రికులకు ఏడవ అంతస్తు కేటాయించబడింది.
ఈ భవనానికి విజయ భవనానికి మధ్యలో వున్న విశాల మైదానంలో కథకులు, గాయకులు తగినంత అభ్యాసం చేసుకోవటానికి వీలుంది. గాయకులలో చాలామంది యువతులే ఉన్నారు. ఆ రోజు చంద్రప్ప గానం ప్రత్యేక ఆకర్షణ అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గాయనులంతా మహారాజు ఎదురుగా ఒక జలతారు తెర వెనుక ఆసీనులై ఉన్నారు. రెండువైపులా ఉన్న తెర తొలగించినపుడు బంగారంతో తాపడం చేసిన అమూల్య రత్న ఖచిత సింహాసనంపైన కూర్చుని ఉన్న ప్రభువు వీరిని చూడటం జరుగుతుంది.
వైభవోపేత విజయభవనం ముందు భాగంలో గోపురంతో వున్న ప్రవేశ ద్వారముంది. దీని బయట రాజమందిరం చుట్టూ చాలా ఎత్తయిన ప్రహరీ గోడ ఉంది. సింహద్వారంలో సాయుధులైన భటులు కాపలా కాస్తున్నారు.
దీని తర్వాత కొంతదూరంలో మరో ద్వారముంది. ఆ దారిలో ప్రవేశిస్తే విశాలమైన ఆరుబయలు ప్రాంతం. దాని పక్కన ఒక పెద్ద మండపముంది. అక్కడ ముఖ్యమైన అధికారులు, నగర ప్రముఖులు కూర్చుని వినోదాలు చూస్తున్నారు. ఈ ఆరుబయలు ప్రాంతానికి ఉత్తరంగా మరో పెద్ద పలు అంతస్తుల భవనం కన్పిస్తోంది.
ఏనుగు, గుర్రం వంటి ఆకారాలతో ఎతె్తైన స్తంభాల మీద ఈ కట్టడాలు కట్టారు కాబట్టి విశాలంగా ఉండి పైకి ఎక్కటానికి రాతిమెట్లు కన్పిస్తున్నాయి.
ద్వారానికెదురుగా రెండు వృత్తాకార రంగస్థలాలున్నాయి. వాటిలో నాట్యగత్తెలు రత్నఖచిత సువర్ణ్భారణ భూషితలై నృత్యాలు చేస్తున్నారు.
ఈ రంగస్థలాలకెదురుగా సింహద్వారానికి తూర్పున విజయ భవనం లాంటి మరో రెండు మందిరాలున్నాయి. వాటిలో ఒకటి మధ్యలో ఇంకొకటి చివరిలో వున్నాయి. ఇవి అమూల్య వస్త్రాలచే అలంకరింపబడి ఉన్నాయి. ఆ వస్త్రాలమీద ఆసక్తికరంగా వివిధ చిత్రాలు కన్పిస్తున్నాయి. ఈ భవనాలలో రాజకుమారులు అభిరుచుల కనుగుణమైన విందులు ఆరగిస్తూ మిత్రులతో కలిసి ప్రదర్శనలను చూస్తున్నారు.
నవరాత్రి విజయోత్సవ ప్రారంభ సూచికగా ధర్మఘంటరావం విన్పించింది. అది నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు. శ్రీకృష్ణదేవరాయలు వియమందిరానికి విచ్చేశారు. అక్కడే నిర్మితమై ఉన్న దేవ మందిరంలోకి ప్రవేశించారు.
బలమైన అవయవ సౌష్టవంతో మంచి ముఖవర్చుస్సు గల్గిన శ్రీకృష్ణదేవరాయల వదనంలో ప్రత్యేకత అందరినీ ఆకర్షిస్తోంది. పట్టుపంచ, అంగరఖా, ఉత్తరీయం ధరించి తలలేని నవరత్న ఖచిత ఆభరణాలతో, కిరీట భుజకీర్తులతో, రాచకరవాలంతో నిలువెత్తు వీరత్వానికి ప్రతీకగా భాసిల్లుతున్న రాయలు దేవమందిరంలోని విగ్రహాన్ని పూజించారు.
బయట ఉత్సవం కోలాహలంగా జరుగుతున్నది. ప్రభువు బంధువులు, ఆప్తులు, కళాకారులు అంతా నృత్యగానా విశేషాదుల్ని ఆనందిస్తున్నారు. బయట మండపాల్లో దండనాథులు, ఉన్నతాధికారులు, పౌర ప్రముఖులు ఉత్సవాన్ని దర్శించాలని వచ్చి వేచి చూస్తున్నారు.
కింద ఆరుబయలు ప్రాంగణంలో నానా విధాలుగా పుష్పాది సుగంధ ద్రవ్యాలతో అలంకరింపబడిన పదకొండు అశ్వాలు నాలుగు పట్టపుటేనుగులు వచ్చాయి.
శ్రీకృష్ణదేవరాయప్రభువు లోపలి నుండి సద్బ్రాహ్మణ సమేతుడై అక్కడికి వచ్చారు. బ్రాహ్మణులు గజాశ్వాలను వైదిక సంస్కార ప్రకారం మంత్ర జలంతో ప్రోక్షణచేసి పూలమాలలతో వాటిని అలంకరించారు. ఆ తర్వాత జాజ్వలమాన వజ్ర ఖచిత కనక సింహాసనం మీద విజయనగర సామ్రాజ్యాధీశుడయిన శ్రీశ్రీశ్రీ కృష్ణదేవరాయల ప్రభువు ఆసీనుడయ్యారు.
ఆనవాయితీ ప్రకారం కొన్ని పొట్టేళ్ళు దున్నపోతుల్ని బలి ఇవ్వటం పూర్తయింది. మహారాజు బ్రాహ్మణుల వేద మంత్రయుక్త ఆశీర్వాదం అందుకుని మరలా తొమ్మిదవ అంతుస్తుకు వెళ్లి కిరీటం తీసి దేవుని ఎదుట ఉంచి దేవునికి సాష్టాంగ ప్రణామం చేసి లోనికి వెళ్లిపోయాడు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి