డైలీ సీరియల్

బంగారుకల - 48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మంజూ! మనకింక ఎడబాటు ఉండదు. మధురమైన జీవితంలో కష్టసుఖాలు కలిసి అనుభవించటం మధురంగానే ఉంటుంది సుమా’’
‘‘చంద్రా! నీ కోసం నేను, నా కోసం నువ్వు’’
‘‘అంతేకాదు మంజూ! నా గానం నీ కోసం, నీ నాట్యం...’’
‘‘నీ కోసం...’’ గల గలా నవ్వింది మంజరి. ప్రవహిస్తున్న సెలయేరు ఒకసారి ఆగి ఆమె నవ్వుల్ని విని పరవశించి మళ్లీ ముందుకు సాగిపోయింది.
***
అన్నపూర్ణాదేవి చిక్కి శల్యగతమై కనిపిస్తున్నది.
తిరుమలదేవి కూడా అదే మందిరంలో అస్వస్థుడుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలకు సపర్యలు స్వయంగా చేస్తున్నది.
‘‘ప్రభూ! ఈ ఔషధం సేవించండి’’ తిరుమలదేవి ఔషధ పాత్ర అందించింది.
‘‘దేవీ! ఔషధ సేవనంతో నా వ్యాధి తీరేది కాదు. మనోవ్యాధిని ఏ రాజవైద్యులు తీర్చగలరు’’ కృష్ణరాయలులో మునుపటి ఠీవికి బదులు నైరాశ్యం కన్పిస్తున్నది.
అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చి రాయలవారి చేయి పట్టుకుంది.
‘‘ప్రభూ! నావల్లనే మీకీ స్థితి కలిగింది. ఆనాడు నన్ను వివాహమాడకుంటే ఇలా...’’ కన్నీరు మున్నీరయింది.
‘‘అలా అనకు దేవీ! ఇది పూర్వజన్మ ప్రారబ్దం! లేకుంటే ముద్దులు మూటగట్టే చిన్నారి రాకుమారుడు మేము అతి సురక్షితమని నమ్మిన అంతఃపురంలోనే విషప్రయోగంతో మరణించటమేమిటి? ఆ జీవితాంతం మేము తండ్రిలా గౌరవించిన అప్పాజీకి మేమే కళ్ళు పొడిపించటమేమిటి? హా విరూపాక్షా! నేటితో కృష్ణరాయల ప్రభ అంతరిస్తున్నది గాబోలు’’ దుఃఖించారు రాయలు.
‘‘ప్రభూ! చింతించకండి. అన్నిటికీ ఆ వేంకటేశుడే ఉన్నాడు. మీరు త్వరగా కోలుకుని ప్రజలు బాగోగులు చూడాలి. మీ కోసం అన్ని ఆలయాల్లో వ్యాసరాయలవారు పూజాదికాలు జరిపిస్తున్నారు’’ తిరుమలదేవి ప్రభువుకు ఉత్తేజాన్నిచ్చే ప్రయత్నం చేసింది.
‘‘అప్పాజీవారు కూడా మీ ఆరోగ్య పరిస్థితి గురించి కబురు చేశారు ప్రభూ’’ అన్నపూర్ణాదేవి ఊరటగా చెప్పింది. అప్పాజీ పేరు వింటూనే రాయలు ఆవేదన మరింత పెరిగింది.
‘‘అయ్యో! అప్పాజీ! ఇంకా ఈ విశ్వాసఘాతకునిపై కనికరం చూపిస్తున్నారా!
అప్పాజీ! మీకు అన్నం, నీళ్ళు లేకుండా చేసి కనుచూపు రూపుమాపిన దురాత్ముడ్ని. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. రాబోవు తరాల ప్రజలు కృష్ణరాయలింతటి కృతఘు్నడని చరిత్రలో లిఖిస్తారు కాబోలు.
రాయా! అని మమ్మెవరు ఆదరంగా పిలుస్తారు. ప్రజల యోగ క్షేమాల గురించి మమ్మెవరు హెచ్చరిస్తారు. జయభేరీ నినాదాలకు సంతోషించి ఆశీస్సులందించే వారెవరు? రాయచూరు గెలిపించి, గజపతుల నోడించి, కొండవీడును అల్లాడించి, మ్లేచ్ఛుల సంపదల్ని విద్యానగరానికి బండ్లకెత్తించిన సామదాన భేద దండోపాయ ప్రవీణుడైన అప్పాజీ మా పుత్రుని హత్య చేశారంటే మేం ఎలా నమ్మగలిగాం? ఏ శని మానెత్తిన నాట్యమాడిందారోజు!
దేవీ! చూశావా! ఈ శరీరంలో ప్రతి రక్తపు బొట్టు అప్పాజీ పెంచి పోషించిందే! మా తండ్రిగారు చనిపోవునప్పుడు మమ్మల్ని అప్పగించింది మమతామూర్తి అప్పాజీకే! నేడీ విజయనగర మహాసామ్రాజ్య స్థాపనకు మూలస్తంభం అప్పాజీయే! మేము అన్నపూర్ణాదేవిని పరిణయమాడటానికి కారకులు అప్పాజీయే! రాత్రింబవళ్లు సంగీత సాహితీలోకంలో మేము విహరించగలిగామంటే రాజ్యభారాన్నంతా అప్పాజీవారే మోశారు గదా!
అయ్యో!ఎంతపని జరిగింది! చేతులారా తొందరపాటుతో నా తండ్రినిట్లా చేశాను. దేవీ! ఇంక నేనెట్లా జీవించాలి?
కృష్ణరాయల దుఃఖానికి అంతులేదు.
నిరంతరం తిమ్మరుసు పట్ల తానుచేసిన అపకారాన్ని తల్చుకొని మరీ మరీ కుంగి కృశించిపోతున్నారు. రాయలు దేవేరులిద్దరూ రాయలను సమాధానపరచలేని నిస్సహాయులయ్యారు. వ్యాసరాయలవారు చేసిన బోధ కూడా రాయలను సాంత్వనపరచలేకపోతున్నది. రోజురోజుకు కృష్ణరాయలు నీరసించిపోతూ శయ్య కంటుకొనిపోయాడు. రాచకార్యాలన్నీ మూలపడ్డాయి. రాజ్యంలో సంక్షోభ పరిస్థితి అలుముకుంది.
***
‘‘మహారాణీ! అతిముఖ్యమైన సమాచారం ప్రభువుల వార్కి తెలియజేయాలి’’ రామలింగనాయకుడు, గండమనాయకుడు కలిసి రావటంతో తిరుమలదేవి ఆందోళన చెందింది.
‘‘ప్రభువులవారి ఆరోగ్యం అంత బాగాలేదు. ఈ సమయంలో వారి మనసు నొప్పించే విషయమైతే చెప్పకపోవటమే మంచిది. ఏమి వార్త రామలింగనాయకా?’’ మహారాణి అడిగింది. ‘‘మహారాణి! రాయలవారి అనారోగ్య విషయం శత్రువులకి పాకింది. ఆదిల్‌షా మనం జయించుకున్న భూభాగాల కోసం యుద్ధానికి సిద్ధవౌతున్నాడు. మనం కూడా పోర్చుగీసు వారి నుండి కొన్న ఆరువందల గుర్రాలతో పెద్ద సైన్యంతో షా ఆధీనంలోని బెల్గాం మీద దాడికి సిద్ధవౌతున్నాం. ఈ విషయంలో గోవాలోని పోర్చుగీసువారి సాయాన్ని కూడా అడిగాం. ఇంకా రాయబారి వెనక్కి రాలేదు. ప్రభువుల వారి అనుమతి కోసం...’’
‘‘మీరు చెప్పిన అంశాలు సబబుగానే ఉన్నాయి. ఆ రాయబారి వెనక్కువచ్చాక పూర్తి వివరాలతో ప్రభువుకి విన్నవిద్దాం’’ వారిని నిరోధించింది తిరుమలదేవి.అప్పాజీని అంధుడ్ని చేశాక ఈ అయిదేళ్ళలో రాయల పరిస్థితి మరింత విషమంగా మారిందని వాళ్లు అర్థం చేసుకున్నారు.
‘‘మహారాణి! అప్పాజీ వారి కుమారుడు గోవిందరాయలు కొందరు దుర్గ్ధాపతులను కూడగట్టి తిరుగుబాటు చేశాడు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి