డైలీ సీరియల్

బంగారుకల-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానిని అణిచేసి గోవిందరాయలును కారాగారంలో బంధించాము’’.
సేనానాయకుని మాటలకు మహారాణి మొహం వివర్ణమైంది.
‘‘రామలింగనాయకా! ప్రభువుకీ వివరాలు తెలిపే సమయం ఇదికాదు. మంత్రిగారితో చర్చించి నిర్ణయాలు తీసుకొండి. మీరిక వెళ్ళవచ్చు’’ మహారాణి ఆజ్ఞను అనుసరించి వాళ్ళు తిరుగుమొహం అయ్యారు. రాజదర్శనం కాకపోవటం వల్ల నిరుత్సాహంగా ఉంది. సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకున్నాడు అలసటగా.

13
చంద్రప్ప దుఃఖంతో నిలువెల్లా తడిసిపోయాడు. విజయనగర ప్రభువు అస్తమించాడన్న వార్తకు రాజ్యమంతా కన్నీటిలో మునిగిపోయింది. తెలుగుతేజం అస్తమించింది.
ప్రధానమంత్రి పరిషత్తులో ఆంధ్రభోజుని మరణశాసనం తెలియజేయటం జరిగింది. చంద్రగిరి కోటలో బందీగా ఉన్న సదాశివరాయలను రాజును చేయమని కృష్ణరాయని కోరిక. అతనికి తగిన వయసులేనందున రాజ్యభారాన్ని అల్లుడు రామరాయలు, తమ్ముడు అచ్యుతరాయలు నిర్వహించాలనీ రాయలు వారసత్వ రాజపత్రం రాశాడు.
రాయచూర్‌ను జయించటం చాలా అవసరమని కూడా రాయలు మరణశాసనంలో పేర్కొన్నాడు. విధిచూపు మరోరకంగా ఉంది. తండ్రి మరణంతో సదాశివరాయలు తాతగారి ఇంటికి వెళ్ళిపోయాడు. అధికారం కోసం తపిస్తున్న కృష్ణరాయల తమ్ముడు అచ్యుతరాయలు సింహాసనమెక్కాడు. కానీ పెత్తనం మాత్రం రామరాయలదే!
అచ్యుతరాయలు మదిరాపానంతో వళ్ళు తెలీకుండా పడి ఉంటున్నాడు. చుట్టూ మదవతులున్నారు. రామరాయలు అచ్యుతరాయలికి చాలాసార్లు నచ్చజెప్పాడు.
‘‘ప్రభు! విజయనగర సామ్రాజ్యం కృష్ణరాయల కీర్తికిరీటంగా వెలుగొందింది. దీనిని కళంకితం చేయకూడదు. మీరు రాజ్యశ్రేయస్సు కోరి పరిపాలనా విషయాలు పట్టించుకోవాలి’’.
అచ్యుతరాయలు తల కొంచెం పైకెత్తి ఎరుపెక్కిన కళ్ళతో రామరాయల్ని చూశాడు.
‘‘మాకు అవన్నీ అవసరం లేదు. అవన్నీ చూసేపని మీకే అప్పగించాం కదా’’ అచ్యుతరాయల మాటలు తడబడుతున్నాయి.
‘‘నిజమే! మేం దేశాన్ని రెండు వందల విభాగాలుగా ఏర్పాటుచేసి సామంతులకు కప్పం వసూలుచేసే బాధ్యతనిచ్చాం. సైన్యాన్ని బలోపేతం చేశాం. తలెత్తిన శత్రువుల్ని అణిచేశాం. కానీ మీ సరదాలకు ఖజానా వ్యయం...’’
‘‘ష్.. ఇది మా స్వంత విషయం. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరాదు’’ అచ్యుతరాయలు మత్తులో మునిగిపోయాడు.
చేసేదేమీలేక రామరాయలు వెనుదిరిగాడు. తన మందిరానికి వచ్చి వాణిజ్యమంత్రిని పిలిపించాడు.
‘‘మంత్రివర్యా! మనం వసూలుచేసే ధనం నిల్వ చేయటానికి వేరే ప్రత్యేక ఖజానా ఏర్పాటుచేయండి.’’
‘‘చిత్తం ప్రభూ! మరో ముఖ్య విషయం మీతో మనవి చేయాలి. అచ్యుతరాయలవారి బావమరది, వరదాంబికాదేవిగారి సోదరులు సకలం తిమ్మయ్యగారిని విజయనగర ప్రధానామాత్యులుగా అచ్యుతరాయలువారు నియమించారట ప్రభూ’’
‘‘సరే మీరిక వెళ్ళవచ్చు’’ అతనిని పంపేసి రామరాయలు తనలో తాను వితర్కించుకున్నాడు.
ఇలా ఎందుకు జరుగుతున్నది? మాకు మాటమాత్రం చెప్పకుండా
అచ్యుతరాయలు తన బావమరది సకలం తిమ్మయ్యకు అధికారం కట్టబెట్టటం మాకు అవమానం కాదా! అచ్యుతరాయలతో తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం పరస్పర చర్యలు సంప్రదింపులతోనే అన్నీ జరగాల్సి ఉంది. కానీ అలా జరగటం లేదు. అచ్యుతరాయలను ఎదుటపడి ప్రశ్నింపలేడు. తిమ్మయ్యను కట్టడిచేయలేడు. ఇప్పటికే దండనాధులు దుర్గ్ధాపత్యాల ఆశతో తిమ్మయ్యకు లోబడ్డారు. కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండడమే మేలు.
ఇలా ఆలోచించిన రామరాయలు కొంతకాలం రాజ్యం గురించి పట్టించుకోవటం మానేశాడు. తిమ్మయ్యను అందలం ఎక్కించిన అచ్యుతరాయలు వినోద కాలక్షేపాలలో మునిగిపోయాడు. రామరాయలను తిమ్మయ్య చులకన చేయటం మొదలయింది. అంటే తిమ్మయ్య అసలు స్వరూపం బయటపడుతోంది. సైన్యం పట్ల దురుసుగా ప్రవర్తించటం, వారికి తగిన వేతనాలు చెల్లించకపోవటంతో ప్రజలకు రాజుపైన, పరిపాలన పైన వ్యతిరేకత మొదలైంది. చేసేది లేక రామరాయలు అచ్యుతరాయ మందిరానికి మళ్ళీ వెళ్లాడు.
వ్యసనాలతో దుర్బలుడై రోగగ్రస్తుడై ఉన్న అచ్యుతరాయలు రామరాయలను గౌరవింపలేదు.
‘‘విజయనగర రక్షకులా! ఏం ఇలా వేంచేశారు?’’ వ్యంగ్యంగా నవ్వాడు అచ్యుతరాయలు.
‘‘అర్హతలేనివారికి అధికారాలీయటం వల్ల విజయనగర సామ్రాజ్యం పతనదిశకు ప్రయాణిస్తోంది. తిమ్మయ్య ప్రవర్తన పలువురికి అభ్యంతరకరంగా ఉంది’’ అంటూ రామరాయలు తిమ్మయ్య ఆగడాల గురించి తెలియజేశాడు. అచ్యుతరాయలు బలహీనంగా నవ్వాడు.
‘‘తిమ్మయ్య మా దేవేరి వరదాంబిక సోదరుడు. ఆయన్ని ప్రధానమంత్రిని చేయటం అనుచితం కాదు. పైగా తిమ్మయ్య మాకు ఎప్పుడైనా ఎంత కావలసివస్తే అంత ధనం ఇస్తున్నాడు. మీరు కూడా అలా ఇవ్వగలిగితే మునుపటి మీ అధికారాలు మళ్ళీ మీకు అందుతాయని గ్రహించండి’’
‘‘ప్రజాధనాన్ని వ్యసనాలకు దుర్వినియోగం చేసే మీలాంటి రాజుకు నేను సహాయపడలేను’’ రామరాయలు ఖచ్చితంగా చెప్పేశాడు.’’

- ఇంకా ఉంది