డైలీ సీరియల్

బంగారుకల-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి పగ అంతటితో చల్లారలేదు. పటపట పళ్ళు కొరుకుతూ హుస్సేన్ నిజాం షా రామరాయల దగ్గరిగా వచ్చాడు.
‘‘కాఫిర్! ఇరవై ఏళ్లుగా ఈతలే మమ్మల్ని వేధించింది. నేనిప్పుడు పగ సాధిస్తున్నాను. ఇంక దేవుడు ననే్నం చేసినా చెయ్యనివ్వు’’అంటూ నిస్సహాయ స్థితిలో ఉన అసహాయశూరుడు తొంభై ఆరేళ్ళ వృద్ధుడు తండ్రిలాంటివాడయిన రామరాయల తలను నరికేశాడు. రామరాయల తెల్లని పండిన తల పట్టుకొని దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని తల తరిగి తృప్తి పొందనట్లే సుల్తాన్ కూడా నరికిన ఆతలను ఒక బల్లెంపై ఎత్తుగా హిందూ బలగాలకు కనిపించే విధంగా ప్రదర్శించి వికటాట్టహాసం చేశాడు. నలభై సంవత్సరాలకు పైగా ఘోరాతిఘోర సంగ్రామాల్లో పోరి,హిందూ సామ్రాజ్య రక్షకుడిగా రాజనీతి చతురుడిగా నిలిచిన అళియ రామరాయలు విజయనగర భానునిలా అస్తమించాడు. రాక్షసి తంగడి యుద్ధంలో రామరాయని మరణంతో విజయానికి చేరువగా ఉన్న ఆంధ్ర సైన్యం బెదిరిపోయి చెల్లాచెదురైంది. రాయల సోదరులు, నమ్మకస్తులైన దండనాధులు ప్రాణాలుకోల్పోయారు.
అలా పారిపోయే సైనికులను బహ్మనీ సైన్యం వెంటాడి వేటాడి ఊచకోత కోసింది. యుద్ధరంగానికి పక్కనే ప్రవహించే నది అరుణ వర్ణాన్ని పులుముకుంది. దాదాపు ఒక లక్షమంది హిందూ సైనికులు తలలు ఎగిరిపడ్డాయి. విజయనగర సైనికులు రాజధాని వైపు పారిపోయారు. వాళ్ళెంత దిగ్భ్రమ చెందారంటే నగరాన్ని చుట్టుముట్టి ఉన్న పర్వతాల మధ్య రక్షక వ్యూహాలు చేపట్టే ప్రయత్నాన్నిగానీ, నగర కుడ్యాలనుగానీ, ప్రవేశ మార్గాలనుగానీ రక్షించుకునే ప్రయత్నం చేయక సంపూర్ణ ఓటమి పాలయ్యారు.
తురక సైనికుల్లోని ప్రతి వ్యక్తీ బంగారం, నగలు, ఆయుధాలు, గుర్రాలు, బానిసలు ఎవరికేవి చిక్కితే దక్కించుకుని ధనవంతులై పోయారు. విజయనగరవాసులకు ప్రమాద స్పృహేలేదు. రామరాయలు అపార సైన్యాన్ని వెంటబెట్టుకు వెళ్ళటం వల్ల వారికి విజయం గురించి సంపూర్ణ విశ్వాసం ఉంది. కానీ పలాయనం చిత్తగించిన సైన్యం,చనిపోయిన నాయకుడు, అపార సంపదలతో భవనాలను వదిలి వెళ్ళిన రాజకుమారులను చూసినప్పుడు ప్రజలు భయభ్రాంతులయ్యారు. రాజభక్తులైన సైనికులతో లెక్కలేనంత బంగారం, వజ్రాలు, వంద మిలియన్ స్టెర్లింగుల విలువ చేసే విలువైన రాళ్ళను రాజచిహ్నం , రత్నఖచిత సింహాసనాన్ని ఐదువందల ఏనుగులపై వేసుకుని సదాశివునితో సహా తిరుమల రాయలు, రాచకుటుంబాలు,వారి అనుచరులు పెనుగొండకు పారిపోయారు. విజయనగరంలో మహావిపత్తు వాస్తవంగా కన్పించింది. నగరవాసుల్ని రక్షించేవాళ్ళు లేరు. దొంగల గుంపులు, ఆటవికులు నగరాన్ని అన్ని విధాలా ఆరుసార్లు ప్రణాళికాబద్ధంగా దోచి విపరీతమైన సంపదను మోసుకెళ్ళారు.
యుద్ధం ముగిసిన మూడోరోజున విజేతలయిన బహమనీలు నగరానికి వచ్చారు. అప్పట్నుంచి ఐదునెలల పాటు వారికి విశ్రాంతే లేదు. విధ్వంసమే లక్ష్యంగా దయలేకుండా ప్రజల్ని వధించారు. దేవాలయాలు, రాజభవనాలు పడగొట్టారు. శిలానిర్మిత దేవాలయాలు తప్ప మిగతావన్నీ శిథిలాలుగా మారిపోయాయి. విగ్రహాలు విరగ్గొట్టారు. ఉగ్రనరసింహుని చేతులు ఖండించారు. దసరా దిబ్బ మండపాన్ని ధ్వంసం చేశారు. భవనాలు తగులబెట్టారు. నిప్పు, కత్తులతో విలయం సృష్టించారు. ప్రపంచంలో మరెక్కడా జరగని ఇటువంటి విధ్వంసం వల్ల సంపన్నవంతమైన విజయనగరం భీభత్స దృశ్యంగా మిగిలింది. అలా దోచిన సంపదలో కోడిగుడ్డంత పెద్ద వజ్రాన్ని ఆదిల్‌షా స్వాధీనపర్చుకున్నాడు.
తర్వాతి కాలంలో ఆ వజ్రాన్ని తన గుర్రపు శిరస్త్రాణపు తురాయి కింద అమరింపజేసుకుని ఆనందించాడని కథనం. ఓ మహా సామ్రాజ్యం నేల కూలింది. విజయనగరం మరెప్పటికీ తన పూర్వ వైభవాన్ని పొందనంతగానిర్జన శిథిల దృశ్యంగా, వల్లకాడుగా మిగిలిపోయింది. శ్రీ కృష్ణదేవరాయల శౌర్యప్రతాపాలు, కళాపోషకత్వం విజయనగర సామ్రాజ్య వైభవం మాత్రం తరతరాలుగా అభిమానుల గుండెల్లో మరపురాని మధురకావ్యంలా మిగిలాయి.

ముగింపు
అభిషేక్, అమృతల కళ్ళనిండా నీళ్ళు. ఆవేదనతో ప్రతి భగ్న శిల్పాన్నీ చూస్తూ అలనాటి సౌందర్య జ్ఞపకాలను వెదుక్కుంటున్నారు. ‘‘చూశావా అభీ! అంతటి అధ్భుత నగరానికి విధి వేసిన శిక్ష. ఈ నిర్జన శిథిల దృశ్యాలను చూడటానికేనా మనం వచ్చాం. రాకముందుకన్నా ఇక్కడికొచ్చాక నా మనసు మరింత తీవ్రంగా కలవరపడుతోంది.’’ ‘‘అమ్మూ! ఇది చరిత్ర గతాన్ని మార్చలేం. గతంలోంచి పాఠాలు నేర్చుకొని వర్తమానాన్ని తీర్చి దిద్దుకొని భావితరాలకు బంగారు భవిష్యత్ అందించాలి.’’ అభిషేక్ ఉద్వేగంగా అన్నాడు. ‘‘ఈ చిన్న గ్రామాల మధ్య, మిగిలిన మట్టిగోడల మధ్య, పాత నీటి కాల్వ మధ్య మన నగరాన్ని వెదుక్కుంటున్నాను. అభీ!’’ కన్నీటిలో అంది అమృత. ‘‘బాధపడకు అమ్మూ! మనం ఇక్కడికి వచ్చి ఈ శిల్పారామంలో తిరిగాక మన బంధం జన్నజన్మల బంధంగా మరింత పెనవేసుకుంది. ఇలా చూడు.. ఈ ‘నవమోహిని’ శిల్పం ఈనాటికీ ఈ విఠల మందిరంలోచరిత్రకు సాక్ష్యంగా చెక్కుచెదరకుండా ఉంది.’’ అమృత ఆ శిల్పాన్ని ఆపాద మస్తకం ప్రేమగా స్పృశించింది. మనసులో శాస్ర్తీ మెదిలాడు. ‘‘ ఈ సంగీతకారుడు నీవే కదూ’’ వేణువూదుతున్న శిల్పాన్ని అభిషేక్‌కి చూపించింది. ఆమె మనసు కొంత తేలికపడింది. ‘‘అవును అమ్మూ! ఆనాడు మనం నిజమైన కళాకారులుగా మరణించాం. జన్మజన్మలకు కళాకారులుగానే పుడుతున్నాం. ఎవరెంత నాశనం చేసినా రూపుమాసిపోని ఈ శిల్పాలు మన ప్రతిరూపాలు. కళకు మరణముండదు అమ్మూ.’’ అభిషేక్, అమృతుల స్పర్శ సోకిన ఆ శిలలు మరింత సజీవ కళను సంతరించుకున్నాయి. ఆ కళాకారుల తలపుల్లో విజయనగర సామ్రాజ్య శోభ ఒక సుందర సువర్ణ స్వప్నంలా నిలిచిపోయింది. ఈ స్వప్నం కరిగిపోయేది కాదు. తరతరాల కళాప్రియులను గతంలోకి నడిపించి మురిపించే మధుర భావనాలోకం! మరపురాని మహనీయ దృశ్యకావ్యం!
ఇది ఆంధ్రభోజుడిలాతలంపై
నిర్మించుకున్న దివ్యస్వర్గ్ధామం
ఇది లక్ష్మీ సరస్వతుల అపూర్వమైత్రికి
రాయలు రచించిన రమణీయ శిల్పాలయం

-- అయిపోయింది

- చిల్లర భవానీదేవి