డైలీ సీరియల్

యమహాపురి -15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్ చదువుతూ బంగారు భావికై కలలు కనేది.
ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరి అమెరికాలో తేలాలని ఆమె కోరిక.
ఆమె తండ్రికి ముగ్గురు పిల్లలు. అంటే శశికి ఓ అన్న, తమ్ముడు ఉన్నారు. అందర్నీ ఇంజనీరింగ్ చదివించే స్తోమతు తనకి లేదన్నాడాయన. ఎలాగోలా తల తాకట్టు పెట్టయినా మగ పిల్లల్ని ఇంజనీరింగు చదివిస్తానన్నాడు. శశి కూడా ఇంజనీరింగ్ చదవాలనుకుంటే స్కాలర్‌షిప్ తెచ్చుకోవాలన్నాడు.
శశి తెలివైనదే కానీ, స్కాలర్‌షిప్ తెచ్చుకునేంత కాదు. ఆమె డీలా పడింది.
ఇంగ్లీషు వాళ్లు ఆడవాళ్లని లేడీసని గొప్పగా అన్నారు. మన దేశంలో ఆడపిల్లలకి సంబంధించి ఈ సమాజమొక జనారణ్యం. ఆమె లేడి ఐతే మగాళ్లు వేటగాళ్లు.
శశి పరిస్థితి తెలుసుకుని ఆమె కోసం వల పన్నాడు ప్రదీప్.
అతడామెని మొదటిసారిగా ఓ సినిమా థియేటరు దగ్గిర పలకరించాడు. తన్ను తాను పరిచయం చేసుకుని తానొక బ్యాంకు ఉద్యోగినని చెప్పాడు. లేత ప్రాయంలో ఉన్న ఆడపిల్ల ఎలాంటి మాటలకు ఆకర్షితురాలౌతుందో- అలాంటి మాటల జల్లులో ఆమెను తడిపి మెత్తబర్చాడు.
ఇద్దరికీ పరిచయమైంది. ప్రదీప్ తెలివిగా పావులు కదిపాడు.
‘‘నా పెళ్లి విషయంలో నేను సర్వ స్వతంత్రుణ్ణి. కట్నం తీసుకోరాదని నా నియమం. ఖర్చు లేకుండా పెళ్లి చేసుకోవాలని నా పట్టుదల. ఇంటర్ చదివే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. నా భార్య గృహిణిగా నాలుగు గోడలకూ పరిమితం కాకుండా, చదువు కొనసాగించి ఇంజనీరో డాక్టరో కలెక్టరో అవాలని నా ఆశయం. ఆమె విదేశాలకు వెడితే ఆమెను అనుసరించి వెళ్లాలని నా కల. ఆర్థికంగా, మానసికంగా నా భార్య కెరియర్‌కి నేనే దోహదం చెయ్యడం నా తృప్తి’’ అంటూ తన గురించి ఊరించే మాటలు చెప్పాడు.
శశి ఆ మాటలు నమ్మింది. స్కాలర్‌షిప్ ఉంటే తండ్రి తనని ఇంజనీరింగు చదివిస్తానన్నాడు. ఆ స్కాలర్‌షిప్ భర్తే ఇస్తాననడం తనకి గొప్ప అవకాశమనుకుంది. అతడి వలలో పడిపోయింది. అతడితో సాన్నిహిత్యం పెంచుకుంది. అతడి మాటని కాదనలేని బలహీనతని సంతరించుకుంది. అతణ్ణి ప్రేమించడం మొదలెట్టింది.
ప్రదీప్ ఆమెను లోబర్చుకుందుకు రకరకాల పన్నాగాలు వేశాడు. ఒకసారి ఆమెని సినిమాకి తీసుకెళ్లి హాల్లో పక్కన కూర్చున్నప్పుడు తాకకూడని ప్రాంతాలు తాకాడు. ఆమె విదిలించింది. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే మధ్యలో హాల్లోంచి లేచి వెళ్లిపోయింది. ఒకసారి ఆమెని పొరుగూరు తీసుకెళ్లి హోటల్లో మకాం పెట్టాడు. ఆమె అతడితోపాటు ఒకే రూంలో ఉండడానికి ఒప్పుకోకపోవడంతో వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు.
ఒకసారామెని తనింటికి పిలిచాడు. ఇంట్లో ఇంకెవరూ లేరని ఆమెని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె రెచ్చిపోలేదు. మర్నాడు పార్కులో కలిసినపుడు, ‘‘ఏమిటీ నీ ఉద్దేశ్యం?’’ అని నిలదీసింది.
‘‘నేనెంత చొరవ చేసినా, నాతో స్నేహం కొనసాగిస్తూనే ఉన్నావు. సహకరిస్తావని ఆశ పుట్టింది’’ అన్నాడతడు. శశి దెబ్బతింది. అతడి చిలిపి చేష్టలు ఆమెకీ సరదాగా ఉన్నాయి. కానీ ఆడపిల్లగా తన హద్దుల్లో ఉంటోంది.
‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నీ స్నేహం వదులుకోలేకపోతున్నాను. కానీ పెళ్లయ్యేదాకా స్నేహితురాలిగా మాత్రమే ఉంటాను. ఇష్టమైతే సరే, లేకపోతే ఈ రోజుతో మన స్నేహానికి స్వస్తి’’ అందామె.
ప్రదీప్ ప్లేటు ఫిరాయించాడు. ‘‘పెళ్లి, స్నేహం విషయంలో నా అభిప్రాయం, నీ అభిప్రాయం ఒకటే. చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడు.
శశి నమ్మలేదు. అప్పుడతడు ‘‘నిజంగా నేను తలచుకుంటే- హోటలుకెళ్లినపుడో, మా ఇంటికొచ్చినపుడో- నిన్ను లొంగదీసుకోవడం అసాధ్యం కాదు. బలవంతంగా కాదు- మాటలతోనే నిన్ను నాదాన్ని చేసుకోగలను. కాస్త ఆలోచిస్తే ఆ విషయం నీకూ అర్థవౌతుంది. నేనలా చెయ్యలేదు. పెళ్లికి విలువిస్తాను కాబట్టి!’’ అన్నాడు.
శశికి నిజమేననిపించింది. ఆమెకి అతడిమీద ప్రేమ పెరిగిపోయి- మత్తులా ఆవహించింది.
‘‘నిన్ను విడిచి నేనుండలేను. మనం పెళ్లి చేసుకుందాం’’ అన్నాడతడు ఓ రోజున.
‘‘మీ వాళ్లని తీసుకుని మా ఇంటికిరా. మా వాళ్లని నేనొప్పిస్తాను’’ అంది శశి.
‘‘నా చెల్లి కూడా నీకులాగే భ్రమపడి- తను ప్రేమించినవాణ్ణి ఇంటికి తీసుకొచ్చింది. మావాళ్ళొప్పుకోలేదు. మైనర్ని పెళ్లి చేసుకుంటే కిడ్నాప్, రేప్ కేసులు పెడతామని బెదిరించారు. వాడు హడిలిపోయి పారిపోయాడు. నా చెల్లి ప్రేమ భగ్నమైంది’’ అన్నాడు ప్రదీప్.
‘‘నాకు పద్దెనిమిది నిండడానికింకా ఆర్నెల్లుంది. అయినా ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి వయసు పదహారుకి దించారుగా. అంటే నేను మైనర్ని కాదుగా’’ అంది శశి.
‘‘పదహారు నిండినా నువ్వు మైనరువే. ఎటొచ్చీ తల్లిదండ్రులు ఒప్పుకుంటే నువ్విప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. కానీ మైనారిటీ తీరడానికి పద్దెనిమిది నిండాల్సిందే’’ అని- ‘‘పెద్దలతో ఎందుకీ గొడవ? మనమిప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకుందాం. రహస్యంగా సంసారం చేద్దాం. నువ్వు మేజరువి కాగానే- మన పెళ్లి గురించి అందరికీ చెబుదాం. ఎవరేమంటారు? అన్నా ఏం చేస్తారు? ఆ తర్వాత నువ్వు ఇంజనీరింగులో చేరి నా కలలు సాకారం చేద్దువుగాని’’ అన్నాడు ప్రదీప్.
వయసు మత్తు. ప్రేమ మత్తు. ప్రియుడి మాటల మత్తు. భవిష్యత్తుపై ఆశల మత్తు.

ఇంకా ఉంది

వసుంధర