డైలీ సీరియల్

యమహాపురి - 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వ్యక్తి బిచ్చగాళ్లనెవర్నీ పట్టించుకోకుండా వడివడిగా మెట్లు దిగుతున్నాడు.
‘‘వాటం చూస్తే ఎవరికీ పైసా విదిల్చేలా లేడు?’’ అనుకున్నాడు సుందరం.
సుందరం చూస్తుండగా ఆ వ్యక్తి వరుసగా మెట్లు దిగి చివరి మెట్టుకి వచ్చాడు. ఆ మెట్టు దగ్గిర ఉన్నాడు ఆఖరి బిచ్చగాడు. వాడా వ్యక్తిని చూస్తూనే ఆశగా ఏదో అన్నాడు.
‘‘ఇంతమందికి వెయ్యనివాడు వీడికి మాత్రం వేస్తాడా? ఈ పాటికే అర్థమయుండాలి. అయినా ఎవడి ఆశ వాడిది’’ అనుకున్నాడు సుందరం.
కానీ అంతవరకూ వేగంగా నడుస్తున్న ఆ వ్యక్తి బ్రేక్ వేసినట్లుగా ఆగిపోయాడక్కడ.
‘‘ఎందుకాగాడో?’’ అనుకున్నాడు సుందరం అనుమానంగా.
****
అక్కడ ఆగిన ఆ వ్యక్తి ఓ యువకుడు. వయసు ఇరవైకీ, పాతిక్కీ మధ్య ఉండొచ్చు. చదువుకున్న మధ్యతరగతివాడిలా ఉన్నాడు. అతడి భుజానికి ఓ సంచీ వ్రేలాడుతోంది.
‘‘చాలా ఆకలిగా ఉంది. కాసేపుంటే ప్రాణం పోయేలా ఉంది. నీ దగ్గిర ఏముంటే అది పెట్టు’’ అన్నాడు బిచ్చగాడు. ఆ గొంతులో ఆకలి స్వరం. ఏ శబ్దం చేసినా- అవే మాటలు వినిపించేలా ఉన్నదా ఆకలి స్వరం.
ఆ యువకుడు బ్రేక్ వేసినట్లు ఆగిపోయి ఆ బిచ్చగాణ్ణి చూశాడు.
చింపిరి జుట్టు, మాసిన గెడ్డం, మాటలు గొంతులోంచి కాక కళ్లలోంచి వస్తున్నాయా అనిపించేలా చూపులు.
‘‘పొద్దున్నించి ఉపవాసం. ఇంతవరకూ పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. నీ పరిస్థితే నాది. ఆకలితో నాకూ ప్రాణం పోయేలా వుంది’’ అన్నాడు యువకుతడణ్ణి జాలిగా చూస్తూ.
‘‘నీ ఆకలి ఈ రోజుది. నా ఆకలి నాలుగు రోజులది. నువ్వు వయసులో నాకంటే చిన్నవాడివి. నీ ఆకలిని వాయిదా వేయ్యొచ్చు. ఆకలి తీరకపోతే నా చావుని వాయిదా వెయ్యలేను’’ నీరసంగా అన్నాడతడు.
‘‘కానీ నా దగ్గిరున్నది మా అత్తయ్య చేసిచ్చిన ప్రసాదం. అది నేనే తినాలని నియమం. నీకు వేరే ఏమైనా కొనివ్వాలంటే దగ్గిర్లో ఎక్కడా తినుబండారాల దుకాణాలు లేవు’’ అన్నాడు యువకుడు.
‘‘ఆ ప్రసాదం మీద నా పేరు వ్రాసి ఉంది. అది నేనే తినాలి. నువ్వు నియమం తప్పు. నీకు మేలు జరుగుతుందని నాదీ హామీ’’ అన్నాడు బిచ్చగాడు.
‘‘చూడు. నీ ఆకలి నాకు అర్థవౌతోంది. కానీ నేను నా అత్తయ్యకిచ్చిన మాట...’’
అప్పుడు బిచ్చగాడు తన రెండు చేతులూ ముందుకి చాపాడు. వాడి కుడి చేతికి బంగారు వనె్న కంకణం ఒకటి ఉంది. ఎడమ చేత్తో ఆ కంకణాన్ని బయటికి తీసి, ‘‘ఇలా రా, ఈ కంకణం నీకిస్తాను. నీ దగ్గిరున్న ప్రసాదం నాకివ్వు’’ అన్నాడు.
యువకుడు తళ తళ మెరుస్తున్న ఆ కంకణం చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘నీ దగ్గిర ఇంత విలువైన బంగారు కంకణం ఉంచుకుని ఇక్కడ అడుక్కుంటున్నావా? తిండికోసం ఆ కంకణానే్న అమ్ముకుందుకు సిద్ధపడుతున్నావా? నాకు నీ కంకణం వద్దులే, ప్రసాదాన్ని ఫ్రీగానే ఇస్తాను’’ అన్నాడు.
‘‘నువ్విచ్చినా నేను ఉత్తినే ఏదీ తీసుకోను...’’ అన్నాడు బిచ్చగాడు.
‘‘కానీ గుప్పెడు మెతుకులకి బంగారు కంకణం తీసుకునే దారుణం నావల్ల కాదు’’ అన్నాడు యువకుడు.
‘‘అయ్యో! ఈ కంకణం బంగారంది కాదు. నకిలీది. కానీ దీని మహిమ నకిలీది కాదు. నేనిది నీ చేతికి తొడుగుతాను. ఆ క్షణం నుంచీ ఇది నీది. అన్నదానం చేసిన పుణ్యాత్ముడివి కాబట్టి- ఈ కంకణం ధరించేక నీ జీవితమే మారిపోతుంది. నువ్వు మాత్రం దీన్ని అన్ని వేళలా చేతికే ఉంచుకోవాలి’’ అన్నాడు.
యువకుడు ఎక్కువ ఆలోచించలేదు, ‘‘నేను నీ కంకణం కావాలనుకోలేదు. నీ మనసు నొచ్చుకోకూడదని తీసుకుంటున్నాను. అదైనా నకిలీ బంగారమని చెప్పావు కాబట్టి! స్వయంకృషిని నమ్ముకున్నవాణ్ణి కాబట్టి నాకు దీని మహిమతో పనిలేదు. కానీ నీ మాటలు వింటుంటే నువ్వు మామూలు బిచ్చగాడివి కాదనిపిస్తోంది. కాబట్టి నీ మాటల్ని గౌరవించి సదా దీన్ని చేతికే ఉంచుకుంటాను’’ అంటూ బిచ్చగాణ్ణి సమీపించాడు.
బిచ్చగాడు యువకుడి చేతికి కంకణం తొడిగాడు. యువకుడు తన భుజానికున్న సంచీలోంచీ ఓ ప్లాస్టిక్ డబ్బా తీశాడు. దానికి బిగిసి వున్న మూతని తొలగించాడు.
బిచ్చగాడు చటుక్కున ఆ డబ్బా లాక్కున్నాడు. లోపలున్న ప్రసాదాన్ని చూస్తూ, ‘‘ఇది నా ఒక్కడికే సరిపోతుంది’’ అంటూ కుడి చెయ్యి పెట్టి పిడికిలి నిండా తీసుకున్నాడు. ఆబగా నోట్లో కుక్కుకున్నడు. అది నమిలి తింటూనే ఇంకో ఇంత తీసుకుని మళ్లీ నోట్లో పెట్టుకున్నాడు. పొలమారిందో ఏమో, దగ్గు వచ్చింది.
యువకుడు తన చేతి సంచీలోంచి వాటర్ బాటిల్ తీసి, మూత కూడా తీసి బిచ్చగాడికి అందించాడు.
బిచ్చగాడు దగ్గుతూనే చెయ్యెత్తి అతణ్ణి దీవించాడు. బాటిలందుకుని పెదాల కంటేలా నీళ్లు తాగి గుటక వేశాడు.
బిచ్చగాడి ఎంగిలి నీరు తాగలేదు. బిచ్చగాడు ముట్టిన డబ్బాని మళ్లీ వాడలేదు. యువకుడు ఇస్సురని నిట్టూర్చి తన చేతి కంకణం వంక ఒకసారి చూసుకుని అక్కణ్ణిచి కదిలాడు.
ఈలోగా బిచ్చగాడు మరో గుప్పెడు ప్రసాదం తిని, నీళ్లు తాగబోతూ పెద్దగా కేక పెట్టాడు.
యువకుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగేసరికి బిచ్చగాడు వెనక్కి విరుచుకుని పడిపోయాడు.
‘‘ఏమయింది?’’ అంటూ యువకుడు బిచ్చగాణ్ణి సమీపించాడు.

ఇంకా ఉంది

వసుంధర