డైలీ సీరియల్

యమహాపురి - 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేరస్థులకి ఆయన సింహస్వప్నమే. కానీ నేను నేరస్థుణ్ణి కాదు కదా!’’ అన్నాడు యువకుడు.
‘‘కాకపోవడమేమిటి? నువ్వు నేరస్థుడివే? నేరస్థులనాయన క్షమించడు’’ అన్నాడు పెద్దాయన.
‘‘నేరస్థుణ్ణి నేరస్థుణ్ణి అని పదే పదే అంటున్నారు. ఇంతకీ నా నేరమేమిటో చెబుతారా?’’
‘‘చెబుతాను. నీకు అర్థమయ్యేలా విడమర్చి మరీ చెబుతాను. ఇప్పుడు నువ్వు మా కాలనీకొచ్చావు కదా! నేను కనపడగానే, నన్ను పలకరించి- కెజె రావు అంటే మీరేనా అనడిగావనుకో- నేనేం చేస్తాను?’’
‘‘ఏం చేస్తారు? ఐతే అవునంటారు? కాకపోతే కానంటారు?’’ అన్నాడు యువకుడు.
‘‘మరి నా పేరు బిఏ ముత్యాల్రావు. నువ్వడిగిందానికి ఔననాలా, కాదనాలా?’’ అన్నాడు పెద్దాయన.
యువకుడు ఆయన్నదోలా చూసి ‘‘కాదనాలి’’ అన్నాడు.
‘‘కానీ నేను కాదనను. అడిగింది నీలా చిన్నవాడైతే సాచి లెంపకాయ కొడతాను. నాలా పెద్దవాడైతే నానా తిట్లూ తిడతాను. ఆడపిల్లనుకో- సిగ్గుతో తలొంచుకునేలా అసభ్యంగా మాట్లాడతాను’’ అన్నాడు పెద్దాయన.
యువకుడు తెల్లబోయి, ‘‘మీరేమంటున్నారో నాకర్థం కావడంలేదు. పేరడితే ఔననాలి, కాదనాలి. కానీ కొట్టడమెందుకు?’’ అన్నాడు.
‘‘ఎందుకంటే నా పేరు బిఏ ముత్యాల్రావే కావచ్చు. కానీ జనాలు నన్ను చాటుగా పిల్చుకునే పేరు కెజె రావు. ఆ పేరుకి ఎంత ప్రచారముందంటే- చాలామంది అదే నా పేరనుకుంటారు..’’ అన్నాడు ముత్యాల్రావు.
‘‘మీ పేరొకటైతే జనాలకి మరో పేరెందుకండీ! కాని ఏ మాట కామాటే చెప్పుకోవాలి. బిఏ ముత్యాల్రావుకంటే కెజె రావు పేరే సింపుల్‌గా బాగుందండీ’’ అన్నాడు యువకుడు. ఇందాకట్నించి ఆయన మాట తీరు చూసి ఆయనపై ఓ విసురు విసరాలన్న అతడి తహ తహ అలా తీరింది.
‘‘ఓహో, అలాగంటావా- ఇంతకీ, నీ పేరేమిటి?’’ అన్నాడు ముత్యాల్రావు.
‘‘యోగి’’
‘‘కుర్రాడివి. పెళ్లి కావాల్సినవాడివి. పిల్లా పాపలతో కలకాలం సుఖంగా బ్రతకాల్సినవాడివి. నీకు యోగి పేరు అస్సలు బాగోలేదయ్యా, నీకు నచ్చిందన్నావు కాబట్టి- నా కెజె రావు పేరు నీకిచ్చేస్తాను. మారుపేరుగా వాడుకుంటావా?’’ అన్నాడు ముత్యాల్రావు.
‘‘మీరన్నవన్నీ నిజమే కానీ- పిల్లా పాపలతో కలకాలం సుఖంగా బ్రతకడానికి యోగి పేరు అడ్డు రాదండి. అసలు మనమూ, దేవతలూ, రాక్షసులూ అంతా కూడా కశ్యపుడనే యోగినుంచి వచ్చినవారమే కదండీ!’’
‘‘ఐతేనేం, కెజెరావు పేరు నచ్చిందిగా, మారుపేరుగా వాడుకో!’’ అన్నాడు పెద్దాయన.
‘‘నాకు యోగి పేరు కూడా నచ్చిందండి. మరేమో మీకులా మారు పేరు పెట్టుకోవాలన్న సరదా లేదండి’’
‘‘మారు పేరు నాకు మాత్రం సరదా ఏంటి? జనాలే, వద్దన్నా పెట్టేశారు!’’ నిట్టూర్చాడు ముత్యాల్రావు.
‘‘మీదో పెద్ద కథలా ఉంది. నాకిదంతా ఎందుకు సార్! నేనడిగింది భయంకర్‌గారి ఇల్లు. అది చూపించండి, చాలు’’ అన్నాడు యోగి.
‘‘ఆ ఇల్లు చూపించడానికే ఇదంతా చెబుతున్నాను! ఇప్పుడు నేను నీకాయన ఇల్లు చూపిస్తాను. నువ్వెళ్లి కాలింగ్ బెల్ కొడతావు. అప్పుడాయనే స్వయంగా వచ్చి తలుపు తీస్తాడు. నువ్వాయన్ని భయంకర్‌గారున్నారా అనడిగావనుకో- కొంప ములుగుతుంది. ఎందుకంటే ఆయన పేరు శ్రీకర్. నేరస్థులాయనకి పెట్టిన మారుపేరు భయంకర్’’ అన్నాడు ముత్యాల్రావు.
యోగి క్షణంపాటు నిశే్చష్టుడయ్యాడు. తేరుకున్నాక, ‘‘ఒక్క ముక్కలో ముందే ఈ మాట చెప్పొచ్చు కదా సార్! మన సంభాషణ ఇంతసేపు పొడిగించారు!’’ అన్నాడు.
‘‘ఒక్కసారి నన్ను పలకరిస్తే కలకాలం గుర్తుండిపోవాలి. అదీ ముత్యాల్రావంటే! సరదాగా మాట్లాడ్డం నా హాబీ. అందుకే ఇందాకా అన్నాను- మనమిద్దరం ఓ జోక్స్ సెషన్ పెట్టుకుందామా అని!’’
యోగి ఆయనవంక మెప్పుకోలుగా చూసి, ‘‘అర్థమయింది సార్! ఇంతకీ ఇన్స్‌పెక్టర్‌గారి పేరు శ్రీకర్ అని మీరు జోక్ చెయ్యలేదు కదా! ఆయన పేరు భయంకర్ అని నా నమ్మకం’’ అన్నాడు యోగి.
‘‘అమ్మో! ఎవరితోనైనా జోక్ చెయ్యొచ్చు కానీ- పోలీసోడితో కాదు. ఆయన పేరు శ్రీకరే!’’ భయంకర్ పేరు నేరస్థుల్నించి వచ్చింది’’ అన్నాడు ముత్యాల్రావు.
యోగి సాలోచనగా, ‘‘నేరస్థులాయన్ని భయంకర్ అనడం సహజం. కానీ అదే నిజమైన పేరనుకునేటంతలా ప్రచారమెలాగైంది సార్!’’ అన్నాడు.
‘‘అదీ సహజమే! మన దేశంలో ఇంచుమించు నాయకులందరూ నేరస్థులే కదా! యథా రాజా తథా ప్రజా! మన పౌరుల్లో నేరస్థులు కానివారెవరున్నారు చెప్పు’’ అని గలగలా నవ్వాడు ముత్యాల్రావు.
ఆ నవ్వు పూర్తి కావడానికి కాసేపు పట్టింది. యోగి ఆయన నవ్వు పూర్తయ్యేదాకా ఆగి, ‘‘శ్రీకర్ గారికి భయంకర్ అనే పేరు రావడంలో ఆశ్చర్యం లేదు. ఒక విధంగా అదాయన ప్రతిభకి సర్ట్ఫికెట్టేమో కూడా. మరి మీకు కెజె రావనే పేరెలా వచ్చిందండీ?’’ అన్నాడు కుతూహలంగా.
‘‘ఇందులో దాచుకుందుకేం లేదు. నేను కాకపోతే ఇంకొకళ్లు చెబుతారు. కెజె అంటే కుళ్లు జోకులు’’.
అప్రయత్నంగా పొట్టచెక్కలయ్యింది యోగికి. ముత్యాల్రావు గుర్రుగా చూస్తున్నా ఆ నవ్వు ఆపుకోలేకపోయాడు. నవ్వు ఆగేసరికి అర్థమైపోయింది- శ్రీకర్ ఇల్లెక్కడో వేరెవరినైనా అడగాల్సి ఉంటుందని!
****
‘విశిష్ట’ కాలనీలో ఓ అందమైన బంగళా.
బంగళా చుట్టూ ప్రహరీ గోడ. ఆ గోడకి ఓ గేటు. గేటు తీస్తే చుట్టూ అందమైన తోట. ఆ తోటలో చెట్లున్నాయి. మొక్కలున్నాయి. లతలున్నాయి. పాదులున్నాయి.
గేటునుంచి తిన్నగా వెడితే పోర్టికో. అందులో పార్కు చేసిన ఓ జీవు. ఓ బైకు. సింహద్వారాన్ని చేరుకుందుకు రెండూ అడ్డు రావు. తలుపు తీస్తే డ్రాయింగ్ రూంలాంటి పెద్ద హాలు. హాలునానుకుని అటూ ఇటూ గదులు. వాటిలో మూడు బెడ్రూమ్స్, ఇంకా ఓ వంట గది, డైనింగ్ రూం, స్టోర్ రూం, దేవుడి గది.

-- ఇంకా ఉంది

వసుంధర