డైలీ సీరియల్

పూలకుండీలు - 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినా అటు ఇండ్లూ పూర్తిగాక ఇటు రోజువారి వాయిద్యాలు కట్టలేక నానా అగాచాట్లు పడసాగారు.
‘పొయ్యేకాలమొస్తే వంతన లేని బుద్ధులు పుడతాయి’ అన్నట్టు బస్తీలో ఇందిరమ్మ ఇండ్లు మొదలుపెట్టిన వాళ్ళ అవస్థలు రోజూ చూస్తూనే ఉన్నప్పటికీ శాంతమ్మ మనసులో మాత్రం ‘అందరిలాగే మేం గూడా డాబా ఇల్లు గట్టుకుంటే బాగుండు’’ అనుకుంటూ ఆశల ఉచ్చులో తనకు తెలియకుండానే రోజురోజుకూ కూరుకుపోసాగింది. తన మనసులోని మాటను భర్తకు, అత్తమామలకూ తెలియజేయాలని సమయం కోసం ఎదురుచూడసాగింది.

4
ఆ రోజు పొద్దునే్న ఓ ముద్ద చద్దనం తిని ఇంటి వెనక పెంట పోగులో తవ్వి తీసిన ఎర్రలను కొంచెం మట్టితో కలిపి చిన్న పాతగుడ్డలో మూటగట్టున్నాడు శాంతమ్మ మామ మల్లయ్య.
ఇంతలో శాంతమ్మ అత్త కమలమ్మ చూరులో చెక్కి వుంచిన గాలాలకట్టను బయటకు తీసి పెట్టి ఓ థమ్స్ అప్ సీసా నిండా నీళ్ళు నింపుకొచ్చి మల్లయ్య చేతికిచ్చింది.
ఆ మంచినీళ్ళ సీసానూ, గాలాలకట్టనూ అందుకున్న మల్లయ్య ‘‘పిల్లలు పదిలం’’ అంటూ ముసలమ్మకు జాగ్రత్తలు చెప్పి, కోళ్ళ గూడు మీద వున్న పాత చెప్పులేసుకుని మైనింగ్ కాలేజీ వెనుకనున్న కుందేళ్ళ కుంటలో చేపల వేటకు బయలుదేరి వెళ్లాడు.
ఆ వెళ్ళడం వెళ్ళడం సాయంత్రం నాలుగ్గంటలదాకా గాలాలు వేస్తూ కూర్చున్న మల్లయ్యకు చేపలు బాగానే పడ్డాయి. వాటిని అక్కడే శుబ్బరంగా తోముకుని ఇంటికి తీసుకొచ్చాడు.
అతను వచ్చేసరికి చింతపండు నానబెట్టి తయారుగా వుంచిన కమలమ్మ పనులకు వెళ్లి కొడుకు, కోడలు వచ్చేసరికి అన్నం వార్చి, చేపల పులుసు పెట్టి ఉంచింది.
రాత్రి ఏడు గంటలకల్లా పిల్లలు తిని పడుకున్న తరువాత ఎల్లయ్య దంపతులు, ముసలోళ్లిద్దరు మొత్తం నలుగురూ ఒకేసారి కలిసి అన్నాలకు కూర్చున్నారు.
చాలా రోజుల తరువాత చేపల కూర వండడంతో నలుగురూ తృప్తిగా తింటూ ఎప్పటెప్పటి పాత ముచ్చట్లో మాట్లాడుకోసాగారు.
ఎన్నో రోజులుగా ఇందిరమ్మ ఇంటికి సంబంధించి తన మనసులో మెదులుతున్న ఆలోచన బయట పెట్టటానికి ఇంక అంతకంటే అనువైన సమయం మరొకటి దొరకదని భావించిన శాంతమ్మ ‘‘ఏమయ్యా!’’ అన్నట్టు గారాబంగా భర్త వంక చూసింది.
ఆమె ఆ చూపుకు అర్థం ఎరిగివున్న ఎల్లయ్య ‘‘ఇయ్యాలేదో కొంప మునిగే ఎవారం వున్నట్టే వుందిరా దేవుడా!’’ అంటూ మనసులో అనుకుని ‘‘సరే అదేందో చెప్పరాదు’’ అన్నట్టు తనూ అంతే గారాబంగా భార్య వంక చూశాడు చేప ముక్క జాగ్రత్తగా వలుచుకు తింటూ.
‘‘ఏం లోదు, మన బస్తీల జనమంతా ఒకల్లను మించి ఒకల్లు పోటీలుబడి ఇందిరమ్మ డాబాలు కట్టుకుంటున్నారు సూస్తున్నావుగా?’’ అన్నంలోకి చేపల పులుసు వంపుకుంటూ అంది శాంతమ్మ.
‘‘అయితే!’’ చేపముళ్ళను జాగ్రత్తగా చప్పరిస్తూ అన్నాడు ఎల్లయ్య కొంచెం విసురుగానే.
‘‘ఏదో తిప్పలుబడి మనం గూడా ఓ రొండు గదులు స్లాబేసుకుంటే మంచిగుంటది గదా?’’ ఎన్నాళ్లనుండో తన మనసు బోషాణంలో దాచుకున్న ఆలోచనా హారాన్ని మెల్లగా బయటపెట్టింది శాంతమ్మ.
‘‘అది మన తలకు మించిన పని బిడ్డా! మన బతుకు బండిని ఏదో ఇట్ల నడవనియ్యి. ఎందుకు లేనిపోని బరువును నెత్తికెత్తుకుంటారు? అసలే మీ నలుగురు పిల్లలతోపాటు పాసి పీనిగల మాదిరిగా మీ పానానబడి మేమిద్దరమున్నాం. పూటకు ఎనిమిది కంచాలు లేవాల్నంటే మాటలా? ఉప్పుతో కలిపి అండ్లకు ఎన్ని కావాల? సుఖానవున్న పానాన్ని ఎందుకు కష్టాన బెట్టుకుంటారు? డాబాలేదు, గీబాలేదు మెదలకుంట వూకోండి!’’ కోడలు మాటలు విని కొడుకు ఎక్కడ తల వూపుతాడోనన్న ఆందోళన వ్యక్తవౌతున్న స్వరంతో తన మనసులోని మాటను అడక్కముందే చెప్పేశాడు మల్లయ్య.
‘‘మరి నువ్వేమంటావ్?’’ అన్నట్టు అత్తవంక చూసింది శాంతమ్మ.
‘‘ఇద్దరాడపిల్లలు గోగు మొక్కలెక్క జువ్వున ఎదిగొస్తున్నారు. ఇప్పుడా ఇల్లు బెట్టుకుంటే సర్కారోడిచ్చే పైసలుగాగ ఇంకా ఎంతలేదన్నా చేతిగుండ లచ్చ రూపాయలదాకా పడతై. అన్ని పైసలు మనకాడికెల్లొస్తాయి? ఎవరిస్తారు? అదవా ఎవరన్న ఇచ్చినా మల్లా తిరిగి కట్టేదెట్టా? ఇదంతా ఎందుకొచ్చిన లాయిలాస? కలిగినకాడికి దిని కాల్లు కడుపుల ముడుచుకొని పడుకోక, కాని పోని పన్లు నెత్తికెత్తుకోకురి బిడ్డా!’’ అంటూ అత్త కూడా మామ మాటనే సమర్థిస్తూ మాట్లాడింది.
గడిచిన గతమంతా పేదరికపు వడిశేల రాళ్ళ దెబ్బలు తినీ తినీ రాటుదేలిన అనుభవంతో ఆ వృద్ధ దంపతులిద్దరూ ఒకరి తరువాత ఒకరు అసలా ఇందిరమ్మ డాబా ఇల్లు ఆలోచన వద్దంటే వద్దని ఒక్కమాటగా చెప్పుకొచ్చారు.
‘‘పిల్లలు చిన్నగున్నప్పుడే ఏదో తిప్పలుబడి అందరిలెక్క మనం గూడా ఓ ఇల్లు గట్టిజేసుకోకుంటే రేపు పిల్లలు పెద్దయినంక ఇంకేం గడతం?’’ తన ఆలోచనకు ఆదిలోనే హంసపాదులా అడ్డు తగులుతున్నారన్న అక్కసుతో అత్తమామల మీద కుత్తుకలోతు కోపం తెచ్చుకుంటూ తింటూ తింటున్న అన్నంలో హఠాత్తుగా చెయ్యి కడిగి, కంచాన్ని విసురుగా పక్కకు నెట్టి బయటకు లేచిపోయింది శాంతమ్మ.
కోడలికి కోపం వచ్చిందని అర్థం చేసుకున్న ముసలివాళ్ళిద్దరూ మారన్నం కూడా పెట్టుకోకుండానే వాళ్ళు కూడా వౌనంగా లేచిపోయారు.
చేపల కూర సంతోషం కాస్తా కోడలి చర్యతో ఆవిరైపోవడంతో ముసలివాళ్ళిద్దరూ ముభావంగా పిల్లల పక్కన ప్లాస్టిక్ చాపలమీద నడుం వాల్చారు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు