డైలీ సీరియల్

యమహాపురి 48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండ దిగేదాకా కూడా నువ్వు కటిక ఉపవాసం చెయ్యాలి. అప్పుడు నేనిచ్చిన ప్రసాదం తిను. అప్పుడు స్వామి నీకిచ్చిన దీవెనలో, నీ అదృష్టంలో, ఇంతవరకూ నీకు లభించిన పుణ్యంలో- సగం వాటా నాకు లభిస్తుంది. నీ నుంచి నేను కోరేదిదే!’’ అంది జయమ్మ.
***
‘‘నిజానికి ఆ ప్రసాదం తిని చనిపోవాల్సినవాడు రాజా. ఆ బిచ్చగాడు తనకి తెలియకుండా రాజా ప్రాణాలు కాపాడేడనుకోవాలి’’ అంది రాణి.
బిచ్చగాడి హత్య కేసులో వచ్చిన ఈ కొత్తమలుపు వసంత ఊహకందనిది. హత్యకి మోటివ్ ఏమిటా అని తను, భర్త తలలు బద్దలు కొట్టుకున్నా దొరకనిది- ఇప్పుడు రాణి మాటల్లోంచి బయటపడింది. ‘‘ఇలా జరగొచ్చునని ముందే స్ఫురిస్తే ఎంత బాగుండేది?’’ అనుకుంటూ, ‘‘ఇదంతా నీకెలా తెలుసు?’’ అడిగిందామె రాణిని.
‘‘నువ్వే హంతకుడివంటూ ఓ పోలీసు రాజాని పట్టుకున్నాడు. పోలీసులకి దొరకడం తన భవిష్యత్తుకి మంచిది కాదనుకున్న రాజా- ఎలాగో అక్కణ్ణించి తప్పించుకున్నాడు. అలా పారిపోతున్న రాజాకి నేను ఫోన్‌చేశాను...’’ అంది రాణి.
‘‘అంటే అతడు హత్య చేస్తాడని నీకు ముందే తెలుసా?’’ అంది వసంత.
‘‘మేడమ్ ప్లీజ్! నన్ను కన్‌ఫ్యూజ్ చెయ్యకండి. జరిగింది జరిగినట్లు చెబుతాను. జగదానందస్వామి మమ్మల్నిద్దర్నీ జంటగా వేదికమీదికి పిలిచాడు. ఆయన మాతో, ‘మీరు మంచివాళ్లు. మీ ఆశయాలు మంచివి. మీ ఆశయాలతో ధైర్యంగా ముందుకు సాగిపోండి. మీకూ, సమాజానికీ కూడా మేలు జరుగుతుంది.
ఈ దీవెన మీ ఇద్దరికీ కలిపి ఇవ్వమని ఆ దేవుడు నన్నాదేశించాడు. మీరు ఏకాంతంలో మాట్లాడుకుని కార్యాచరణకు పూనుకోండి’ అన్నాడు. వేదిక దిగేక మేమిద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. మావల్ల సమాజానికేదో మేలు జరుగుతుందని స్వామి అన్నాడు కానీ- మాకు మేమే సాయపడలేని అసహాయ దశలో ఉన్నామని చెప్పుకుని నవ్వుకున్నాం’’ అంది రాణి.
‘‘రాజా అసహాయ స్థితి నాకు తెలుసు. కానీ నీ అసహాయ స్థితి ఏమిటి?’’ అంది వసంత కుతూహలంగా.
‘‘బహుశా అది చెప్పడం కూడా ఇప్పుడు అవసరమే అనుకుంటాను. ఎందుకంటే- రాజాకి తన అసహాయ స్థితినుంచి తన్ను తాను కాపాడుకునే అవకాశముంది. లేదా సమాజమో, పోలీసులో కూడా అతణ్ణి కాపాడగలరు. నన్నయితే నా పరిస్థితులనుంచి దేవుడు కూడా కాపాడలేడు’’ అంది రాణి.
‘‘దేవుడు కూడా కాపాడలేనివారిని, మావారు కాపాడిన సందర్భాలు చాలా వున్నాయి’’ అంది వసంత వెంటనే గర్వంగా.
‘‘నా కథ విన్నాక కూడా ఆ మాట మీరనగలిగితే- నాకంటే సంతోషించేవారుండరు’’ అంది రాణి.
‘‘అలాగా- అసలే ఊరేమిటీ నీది?’’ అంది వసంత.
‘‘మా ఊరు నరకపురి’’ అంది రాణి. వసంత ఉలిక్కిపడింది.
***
నరకపురి నాయకుడు యమ. ఆయన ఆ ఊరి జనానికి దేవుడు. జనాలాయనకు భక్తులమనుకునే బానిసలు.
ఆ ఊళ్లో యమ మాటకు ఎదురులేదు. బయటి ప్రపంచంలోని ప్రజా నాయకులు కానీ, పోలీసులు కానీ ఆ ఊరివైపు కనె్నత్తి చూడరు.
యమ రూపం గ్రామస్థులకి తెలియదు. ఆయన ఎప్పుడూ యమధర్మరాజు మాస్కులో ఉంటాడు.
ఆ ఊళ్ళో తప్పొప్పులు నిర్ణయించేది యమ. తప్పులకి శిక్షించేది యమ. ఆ శిక్షలకు ప్రతిఘటన అనేది ఉండదు. ఒకవేళ ఉంటే గ్రామస్థులే సహించరు. ఊళ్ళో వ్యవసాయం చెయ్యాలన్నా, వ్యాపారం చెయ్యాలన్నా, చివరికి కూలి పని చెయ్యాలన్నా- యమ అనుమతి తీసుకోవాలి. ఏం సంపాదించినా అంతా యమకే అప్పజెప్పాలి. ప్రజల అవసరాలకి యమ దయాధర్మభిక్షగా ఏమిస్తే అది తీసుకోవాలి. ఎవరైనా ఊరొదిలి వెడితే- ఊళ్ళో కన్నవారో, తోడబుట్టినవారో జామీనుండాలి. ఊరు దాటి వెళ్లి పెద్ద చదువులు చదినివారు కూడా తిరిగొచ్చి ఊళ్ళోనే స్థిరపడి యమకి ఊడిగం చెయ్యాలి.
పెళ్లయిన వాళ్ళతో సహా- ఊళ్ళో ఆడవాళ్లంతా తనకే స్వంతమనుకుంటాడు యమ. ఎవరైనా ఆయన పిలిస్తే వెళ్లాలి. చెప్పింది చెయ్యాలి. ఊళ్ళో పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసేది కూడా యమే. యువకులాయన చూపించిన వధువు మెడలో తాళి కట్టాలి. యువతులాయన చూపించిన వరుడి ముందు తలవంచాలి.
ఇటీవల ఆయన కన్ను రాణీమీద పడింది.
ఏటా తానొక్కడూ వెళ్లి రెండు నెలలపాటు విదేశయాత్ర చెయ్యాలని యమకి ఓ నియమముంది. రెండు రోజుల క్రితం ఆయన ఆ పనిపై ఊరొదిలి వెళ్లాడు. వెళ్ళే ముందు ఓ ప్రకటన చేశాడు. తిరిగొచ్చేక కొన్నాళ్లు రాణిని తను ఉంచుకుంటానని.
రాణి ఇప్పుడిక హాస్టల్లో ఉండి డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది.
రాణిది పెద్ద కుటుంబం. ఆమెకి అమ్మ, బామ్మ, ఇద్దరు తమ్మళ్లు ఉన్నారు.
ఊళ్ళో ఎక్కువమంది యమని దేవుడిగా కొలవొచ్చు. వాళ్లు సంతోషంగా ఉన్నారు. యమని దేవుడనుకోనివారిలో రాణి కుటుంబం కూడా ఉంది. వాళ్లది అసహాయత.
యమ తనని ఉంచుకుంటాననడమే రాణికి కంపరంగా ఉంది. కానీ కాదంటే ఆమెకి ఊరు దాటే అవకాశమే ఉండదు. ఊళ్లోనే బయటపడ్డానికి రాణికున్న ఒకే ఒక మార్గం- చదువు పేరిట పట్నం వెళ్లి మరి తిరిగి రాకపోవడం. అప్పుడామెకి స్వేచ్ఛ లభిస్తుంది. కానీ ఊళ్ళో ఆమె కుటుంబం ఊచకోతకు గురౌతుంది.
అది రాణి భరించలేదు. కానీ రాణి కుటుంబంలో వారెవరికీ యమపై నమ్మకం, గౌరవం లేవు. ఊళ్లోని అధిక సంఖ్యాకులకి భయపడి తలలు వంచారు.
‘‘ఈ బ్రతుకూ ఓ బ్రతుకేనా! మనింట్లో కనీసం నువ్వయినా ఇలాంటి నీచపు బ్రతుకునుంచి తప్పించుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది. మా ప్రాణాలు పోతే, ఈ నరకం నుంచి విముక్తి పొందాం అనుకుంటాం. మా గురించి ఆలోచించకు. నువ్విక వెనక్కు రాకు’’ అన్నారామె తల్లిదండ్రులు- ఆమె పట్నానికి వెళ్ళేముందు.

ఇంకా ఉంది

వసుంధర